ఎస్.రాయ్ క్రియేషన్స్ పతాకంపై కథ్రి అంజమ్మ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘చెరసాల’. ఈ చిత్రానికి కథ్రి అంజమ్మ, షికార నిర్మాతలు. రామ్ ప్రకాష్ గున్నం హీరోగా నటిస్తూ… ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీజిత్, నిష్కల, రమ్య తదితరులు లీడ్ రోల్ పోషించారు. రొమాంటిక్ హారర్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి…
కథ: వంశీ(శ్రీజిత్), ప్రియ(నిష్కల) ఇద్దరూ ప్రేమించుకుంటారు. వారికి మరో కొంత మంది స్నేహితులు కూడా వుంటారు. వీరంతా కలిసి ఎటైనా వెళ్లి సరదాగా గడపలానుకుంటారు. ఈ నేపథ్యంలో ఓ అందమైన పెద్ద బంగ్లాలోకి వెళతారు. అక్కడే బసచేసి ఎంజాయ్ చేయాలనుకుంటారు. అనుకున్నట్టే అందులో వుండిపోయి సరదాగా గడిపేస్తుంటారు. ఈ క్రమంలో ఆ బంగ్లాలో కౌసల్య అనే వివాహిత చనిపోయి ఆత్మ తిరుగుతోందని వారికి ఇంటి వాచ్ మెన్ ద్వారా తెలుస్తుంది. ఇంతకు కౌసల్య ఎవరు? ఆమెను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? ఆమె ఆత్మ ఎందుకు ఆ బంగ్లాలో తిరుగుతోంది? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: హారర్ డ్రామా సినిమాలు ఎప్పుడూ ఆడియన్స్ కు థ్రిల్ ను ఇస్తాయి. గ్రిప్పింగ్ కథ… కథనాలతో సినిమాను తెరకెక్కించగలిగితే ఆడియన్స్ ను రెండు గంటలపాటు థియేటర్లలో ఎంటర్టైన్ చెయ్యెచ్చు. దర్శకుడు కం ఇందులో వన్ ఆఫ్ ధి హీరో రామ్ ప్రకాశ్ గున్నం ఇదే చేశాడు. హారర్, రొమాన్స్ కి తోడుగా కామెడీతో డ్రామాను బాగా పండించాడు. ఎక్కడా బోర్ లేకుండా సామెతలతో కూడిన సంభాషణలు పలికించి ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగారు. కథ… రొటీన్ యే అయినా… కథను నడిపించడానికి కామెడీ స్క్రీన్ ప్లేను ఎంచుకుని… యూత్ కి తగ్గట్టుగా డైలాగులు రాసుకున్నారు. దాంతో ఎక్కడా ప్రేక్షకులు బోర్ గా ఫీలవ్వరు. భార్య భర్తల బంధం చాలా పవిత్రమైనది… దాన్ని అనుమానాలతోనూ, అపార్థాలతోనూ అర్ధాంతరంగా ముగించరాదు. అప్యాయంగా గడపడంతోనే నిండు జీవితానికి సార్థకత వుంటుందనే పాయింట్ ను ఇందులో చూపించారు. ఓ పవిత్రమైన స్త్రీ తన మాంగళ్యాన్ని ఎలా కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగం చేసిందనేది ఇందులో చూపించారు. ఓవరాల్ గా ఈ చిత్రం ఆడియన్స్ ను ఆట్టుకునే హారర్ రొమాంటిక్ కామెడీ డ్రామా. ఈ వారం సరదాగా చూసేయండి
ఇందులో ఇద్దరు హీరోలు, హీరోయిన్లతో పాటు… మరో అరడజను మంది నటీనటులున్నారు. వీరింతా తమ పాత్రలకి తగ్గట్టుగా నటించి మెప్పించారు. చిత్ర హీరో కం డైరెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో తన పాత్రను సమర్థవంతంగా పోషించారు. నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర కావడంతో అవలీలగా నటించేశారు. అతనికి జోడీగా కౌసల్య పాత్రలో నటించిన నటి కూడా కాసేపు వున్న తన పాత్రకు న్యాయం చేసింది. కన్నడ నటుడు శ్రీజిత్ కూడా యూత్ కు నచ్చే పాత్రలో నటించి మెప్పించారు. అతనికి జోడీగా ప్రియ పాత్రలో నిష్కల నటించింది. ఆమె గ్లామర్ షో యూత్ ను ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రంలో ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్ షిప్‌లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే పాయింట్‌ను దర్శకుడు చూపించారు. మంచి ఎమోషన్స్‌తో పాటుగా చక్కని వినోదం ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. బంగ్లాలో నటీనటుల మధ్య వుండే బాండింగ్ ను, కామెడీ సన్నివేశాలను బాగా చిత్రీకరించారు. నిడివి ఇంకాస్త తగ్గించాల్సింది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను ఎంతో క్వాలిటీగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3