వీజే సన్నీ… ఇప్పటి వరకూ వెండితెరపై బాగానే దూసుకుపోతున్నాడు. అంతకు ముందు సీరియల్స్ నటించినా రాని గుర్తింపు … బిగ్ బాస్ 5
విన్నర్ కావడంతో వచ్చింది. ఈ షోతో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఆయనకు హీరోగా అవకాశాలు ఊపందుకున్నాయి. అందులో భాగంగానే సౌండ్ పార్టీ
మూవీ చేశాడు. అప్‌కమింగ్ డైరెక్టర్ సంజయ్ శేరి దర్శకత్వం వహించిన మూవీ ఇది. ఫుల్ మూన్ మీడియా, గజేంద్ర ప్రొడక్షన్స్ పతాకాలపై జయశంకర్ సమర్పణలో రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్యామ్ గజేంద్ర నిర్మించారు. ఈ మూవీ నేడు విడుదలైంది. క్లీక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: కుబేర్ కుమార్(శివన్నారాయణ) ఫ్యామిలీ ఫస్ట్ జనరేషన్ (తాతల నాటి) నుంచి కోటీశ్వరులు కావాలని కలలు కంటారు. కూర్చున్న చోట నుంచి కదలకుండా డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ కాలం తీస్తారు. సెకండ్ జనరేషన్ కూడా అలానే సాగిపోతుంది. మూడో జనరేషన్‌లో కుబేర్ కుమార్ ఇంకా అదే పోరాటంలో ఉంటాడు. ప్రస్తుత జనరేషన్‌లో కుబేర్ కుమార్ కొడుకు డాలర్ కుమార్(వీజే సన్నీ) సైతం అదే ప్రయత్నాల్లో ఉంటారు. అయితే ఈ సారి కుబేర్ కుమార్‌తోపాటు డాలర్ కుమార్ డబ్బు సంపాదించేందుకు అనేక ప్లాన్స్ వేస్తారు. చివరికి ముప్పై లక్షలు అప్పు చేసి గోరుముద్ద హోటల్ ప్రారంభిస్తారు. అది ప్రారంభంలో బాగానే నడిచినా డాలర్ కుమార్ లవర్ సిరి(హృతిక శ్రీనివాస్) డాడీ చెడగొడతాడు. దీంతో హోటల్ సీజ్ అవుతుంది. రోడ్డున పడతారు. అప్పు ఇచ్చిన సేటు నాగభూషణం(నాగిరెడ్డి) డబ్బుల కోసం ఒత్తిడి తెస్తాడు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని, అప్పు తీర్చాలని ఆలోచిస్తూ తాగుడుకి బానిసలవుతారు. అంతలోనే ఎమ్మెల్యే వరప్రసాద్(పృథ్వీ) కొడుకు భువన్ ఓ అమ్మాయిని రేపు చేసిన కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుంచి బయటపడేందుకు కుబేర్ కుమార్, డాలర్ కుమార్‌లకు రెండు కోట్ల ఆఫర్ ఇస్తారు. దొంగతనం కేసు అంటూ అబద్దం చెప్పి వారిని ఆ కేసులో ఇరికిస్తారు. దీంతో ఆ రేప్ కేస్‌లో ఈ ఇద్దరికి ఉరిశిక్ష పడుతుంది. మరి దాన్నుంచి ఎలా బయటపడ్డారు? కోటీశ్వరులు కావాలనుకునే వారి కోరిక తీరిందా? డాలర్ కుమార్ లవ్ స్టోరీ ఏంటి? అనేది మిగిలిన కథ.
కథ.. కథనం విశ్లేషణ: ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి డబ్బుకోసం ఓ తండ్రికొడుకులు పడే పాట్లను ఇతి వృత్తంగా చేసుకుని ఓ సినిమాని రూపొందిస్తే… ఎలా ఉంటుంది. అలాంటి సినిమాకి కామెడీ జోడిస్తే… ఆడియన్స్ మరింత కనెక్ట్ అవుతారు. ఇప్పటికే డబ్బు సంపాదించాలనే కాన్సెప్ట్ తో, డబ్బు చుట్టూ కథలతో అనేక సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని విజయాలు సాధించాయి, మరికొన్ని రొటీన్‌గా వచ్చి వెళ్లిపోయాయి. అయితే డబ్బు సంపాదించే క్రమంలో జనరేట్ అయ్యే కామెడీని నమ్ముకుని మేకర్స్ ఇలాంటి సినిమాలు తీస్తుండటం విశేషం. ఇప్పుడు వీజే సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ
మూవీ కూడా అదే జోనర్‌లో వచ్చింది. పూర్తి ఫన్ ప్రధానంగా ఈ మూవీని తెరకెక్కించారు. కష్టపడకుండానే డబ్బు సంపాదించాలనుకునే ఓ ఫ్యామిలీ స్టోరీ ఇది. ముఖ్యంగా తండ్రీకొడుకుల కథ. సగం సగం నాలెడ్జ్ తో డబ్బు సంపాదించేందుకు వారు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. బోల్తా పడుతుంటారు. వారు చేసే పనులతో సహజంగా ఫన్ జనరేట్ చేయాలని, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు దర్శకుడు సంజయ్ శేరి. ఇది అవుట్ అండ్ అవుట్ క్లీన్ కామెడీ మూవీ. గో అండ్ వాచ్ ఇట్.
కుబేర్ కుమార్ పాత్రలో శివన్నారాయణ, డాలర్ కుమార్ పాత్రలో సన్నీ అదరగొట్టారు. యాక్టింగ్ పరంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని చెప్పొచ్చు. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సినిమాని ఫన్ రైడ్‌గా నడిపించారు. సిరి పాత్రలో హృతిక ఫర్వాలేదనిపించింది. కానీ లవ్ స్టోరీకి పెద్దగా ప్రయారిటీ లేదు. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ కంటే తండ్రీ కొడుకుల కెమిస్ట్రీనే బాగుంది. ఎమ్మెల్యేగా పృథ్వీ మెప్పించాడు. సైంటిస్ట్ గా అలీ కాసేపు మెరిశాడు. అప్పు ఇచ్చే సేటు పాత్రలో నాగిరెడ్డి బాగా నవ్వించాడు. ఆయన తర్వాత చలాకీ చంటి నవ్వులు పూయించాడు. ఇక జైల్లో జైలర్‌గా సప్తగిరి రచ్చ చేశాడు. తన ఎపిసోడ్ కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. సన్నీ మదర్‌గా ప్రియా ఆకట్టుకుంది. ఆమెకి మంచి పాత్ర పడింది. చిత్ర దర్శకుడి పాత్ర కూడా నవ్వించేలా ఉంది. మిగిలిన పాత్రలు సైతం ఓకే అనిపించాయి.
టెక్నీకల్‌గా సినిమా బాగుంది. మోహిత్ రెహమానికి మ్యూజిక్ సినిమాకి పెద్ద ప్లస్. పాటలు బాగున్నాయి. ఆర్‌ఆర్ కూడా బాగుంది. సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ పాత్ర చాలా కీలక పాత్ర పోషించింది. అలాగే శ్రీనివాస్ రెడ్డి కెమెరా వర్క్ బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. కలర్ ఫుల్‌గా ఉంది. పాటలు కూడా బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. జీపడకుండా నిర్మించారని సినిమా క్వాలిటీ చూస్తే తెలుస్తుంది. ఇక దర్శకుడు సంజయ్ శేరి జస్ట్ కామెడీని నమ్ముకుని ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆ విషయంలో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అన్ని ఫన్ కొంత వరకు వర్కౌట్ అయ్యింది. ఆ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. అయితే ఇలాంటి సినిమాల్లో ఏది పేలుతుందో ఏది పేలదో ముందే ఊహించడం కూడా కొంత కష్టమే. కానీ దర్శకుడు తన బెస్ట్ ఇచ్చాడని అర్థమవుతుంది. సో ఈ వారం సరదాగా చూసేయండి.
రేటింగ్: 2.75