చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా… సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, వినయ్ వర్మ, బెనర్జీ, ప్రవీణ్, నవీన్ నేని ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ధూం ధాం. సాయి కిశోర్ మచ్చా దర్శకత్వంలో తెరెక్కిన ఈ చిత్రాన్ని ఎంఎస్ రామ్ కుమార్ నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ప్రముఖ రచయిత గోపీ మోహన్ కథ… స్క్రీన్ ప్లే రాశారు. దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వ టీమ్ లో పనిచేసిన వీరు… ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా అలరించిందో చూద్దాం పదండి.
కథ: కార్తీక్ (చేతన్ కృష్ణ) సరదాగా తన మిత్రులు(ప్రవీణ్, నవీన్)లతో తిరుగుతూ కాలం గడిపేస్తూ వుంటారు. సుహానా(హెబ్బా పటేల్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. మనసులో ప్రేమ ఉన్నా సుహానా లవ్ చేయడానికి నిరాకరిస్తుంది. కానీ పొలెండ్‌కు జాలీ ట్రిప్‌కు వెళ్లిన కార్తీక్‌కు సుహానా కూడా జతకలుస్తుంది. అయితే తన ప్రేమను అంగీకరించడానికి ఓ పరీక్ష పెట్టిందనే కారణంతో సుహానాకు కార్తీక్ బ్రేకప్ చెప్పి.. మరో యువతితో నిశ్చితార్థానికి సిద్దమవుతాడు. అయితే పొలెండ్ అమ్మాయితో కూడా కార్తీక్ ఎంగేజ్‌మెంట్ చేసుకోకుండానే బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకొని కార్తీక్, సుహానా ఒక్కటవుదామని అనుకొంటారు. కానీ వారి ప్రేమకు కార్తీక్ తండ్రి (సాయికుమార్)పై పాత పగ కారణంగా సుహానా నాన్న, పెద్దనాన్నలు (వినయ్ వర్మ, బెనర్జీ, గోపరాజు) అడ్డుగా నిలుస్తారు. తొలుత కార్తీక్ ప్రేమను సుహానా ఎందుకు నిరాకరించింది? పొలెండ్‌లో కుదిరిన సంబంధాన్ని కార్తీక్ ఎందుకు బ్రేకప్ చేసుకొంటాడు? హెబ్బా గురించి కార్తీక్ ఏం తెలుసుకొని ఆమె ప్రేమను అంగీకరిస్తాడు? కార్తీక్ తండ్రిపై సుహానా ఫాదర్‌కు ఉన్న పాత పగ ఏంటి? ఇక కార్తీక్ ఫ్రెండ్స్ (ప్రవీణ్, నవీన్)పై సుహానా పెదనాన్నలకు ఎందుకు కోపం ఉంది? ఇలాంటి ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకొని కార్తీక్, సుహానాలు తమ పెళ్లికి మార్గం ఎలా సుగమం చేసుకొన్నారనేదే మిగతా కథ.
దర్శకుడు సాయి కిషోర్ మచ్చా… రైటర్ గోపీ మోహన్ రాసిన కథ… స్క్రీన్ ప్లేను తన ప్రతిభతో అన్ని వర్గాల ప్రేక్షకులు కూర్చుని హాయిగా నవ్వుకునేలా తెరవై ఆవిష్కరించారు. కథ… కథనాల్లో కొంచెం ఇంతకు ముందు చూసిన తాలూకు ఛాయలున్నా… తెరపై ఆవిష్కరించిన విధానం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. సినిమా మొత్తం పోలెండ్ లో జరగడంతో అక్కడ లొకేషన్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుని… సరదాగా రెండు గంటలపాటు చూసేలా చేస్తాయి. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ రాకతో… థియేటర్లో నవ్వులే నవ్వులు. కిషోర్ తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు. క్లీన్ కామెడీ కావడంతో ఫ్యామిలీ సమేతంగా సినిమాను చూసేయొచ్చు.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. చేతన్ కృష్ణ తొలి పరిచయం ద్వారా ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. కొత్త హీరోకు ఉండే కొన్ని లోపాలను అధిగమించాడనే చెప్పాలి. నూతన పరిచయమనే ఫీలింగ్ రాకుండా.. ఫస్ట్ సినిమాలో ఉండే బెరుకును కనిపించకుండా చాలా జాగ్రత్తలు పడ్డాడు. లుక్ వైజ్, యాక్టింగ్ వైజ్ ఫర్వాలేదు. నటనపరంగా, ఈజ్ పరంగా తన ప్రతిభకు మెరుగు పెట్టుకొంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి హీరో అవుతాడనే ఫీలింగ్‌ను తన సినిమా ద్వారా కల్పించాడు. ఇక హెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో గ్లామర్ కాకుండా పెర్ఫార్మెన్స్ రుచిని చూపించింది. కొత్త హీరోతో కలిసి మంచి కెమిస్ట్రీని పండించింది. కేవలం అందచందాలకే పరిమితం కాకుండా కొంత సినిమా భారాన్ని కూడా తన భుజాల మీద మోసాననే ఫీలింగ్ కలిగించింది. ఇక సెకండాఫ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుల, కమెడియన్లదే హావా ఈ సినిమాలో కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ చెలరేగిపోతే.. ప్రవీణ్,నవీన్ ఆయనకు తోడుగా నిలిచారు. ఇక శ్రీనివాసరావు, బెనర్జీ, గోపరాజు రమణ, వినయ్ వర్మ సీరియస్ పాత్రలతో కామెడీని జనరేట్ చేసి నవ్వించారు. ఈ సినిమాలో నటించిన రతిక రోజ్, యాంకర్ హర్షిణి, ఇతర నటీనటులు ప్రతీ ఒక్కరు తమ పాత్రల పరిధి మేరకు పూర్తిగా న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు గోపి సుందర్, సిద్దార్థ్ రామస్వామి, గోపి మోహన్, ప్రవీణ్ వర్మ పనితీరు ప్లస్ పాయింట్. పొలెండ్ ఎపిసోడ్, అలాగే సెకండాఫ్‌లో పెళ్లి ఎపిసోడ్‌ను చాలా రిచ్‌గా తెరకెక్కించడంలో సిద్దార్థ్ తన ప్రతిభను చూపించాడు. అలాగే గోపి సుందర్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఫ్రెష్‌నెస్‌ను తెచ్చిపెట్టింది. అమర్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది, శాస్త్రి గారి సాహిత్యంతో పాటలు మెలోడిగా మారాయి. ఇక ఎంఎస్ రామ్ కుమార్ అనుసరించిన నిర్మాణం సినిమా చాలా రిచ్‌గా అనిపించింది. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సినిమాను మంచి ఫీల్‌గుడ్ సినిమాగా రూపొందించారు. తన కుమారుడిపై ప్రేమ కాకుండా సినిమాపై తనకు ఉండే అభిరుచిని రామ్ కుమార్ చూపించుకొన్నారనిస్తుంది.
ధూమ్ ధామ్ సినిమా విషయానికి వస్తే.. పాత కథను కొత్తగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. కానీ కథ, కథనాల్లో ఉండే స్పీడ్, సన్నివేశాల్లో ఉండే రొమాన్స్, లవ్, కామెడీ మూవీని ఫ్రెష్‌గా కనిపించేలా చేశాయి. సాయి కుమార్ మచ్చా దర్శకత్వం, గోపి మోహన్ స్క్రీన్ ప్లే ఫార్మూలా తెలుగు ఆడియెన్స్ నచ్చేలా ఉంటుంది. రెండు గంటలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నవ్వుకునే అంశాలు ఉన్నాయి. కొత్తదనం, వెరైటీ సినిమాల కోరుకొనే వారిని పక్కన పెడితే.. రెగ్యులర్ ఆడియెన్స్ ఈ సినిమా నచ్చేలా ఉంటుంది. సరదాగా సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈవారం టైం పాస్ మూవీ… ధూం ధాం. గో అండ్ వాచ్ ఇట్
రేటింగ్: 3.25