మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. దర్శకులు చేయాల్సిందల్లా ఒక్కటే… ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథ… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమాను వెండితెరపై ఆవిష్కరిస్తే… ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. ఇలాంటి వాటికి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే దర్శకులు, నిర్మాతలు ఇలాంటి కథలను వెండితెరపై చూపించడానికి లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి కోవకు చెందినదే ‘డిటెక్టివ్ కార్తీక్’. ఈ చిత్రానికి మిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి ఈ చిత్రాన్ని రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మించారు. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి, యేషో భరత్ రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: పదో తరగతి చదువుతున్న శ్రుతీ అనే ఒక అమ్మాయి హత్యకు గురవుతుంది. ఆ అమ్మాయి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఓ ప్రైవేట్ లేడీ డిటెక్టివ్ సంధ్య(శ్రుతీ చంద్రన్) అనే యువతి కూడా మిస్సింగ్ అవుతుంది. సంధ్యను ప్రేమిస్తున్న అబ్బాయి కార్తీక్(రజత్ రాఘవ్) ఆమె మిస్సింగ్ కేసుతో పాటు స్కూల్ స్టూడెంట్ మర్డర్ కేసును కూడా ఛేదించాలని చూస్తాడు. కానీ అతని ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో మలుపులు, సవాళ్లు ఎదురవుతాయి. వీటన్నింటినీ అధిగమించి ఈ మర్డర్ మిస్టరీని డిటెక్టివ్ కార్తీక్ ఎలా ఛేదించాడనేదే ‘డిటెక్టివ్ కార్తీక్’ మిగతా కథ.
కథ… కథనం విశ్లేషణ: డిటెక్టివ్ కథలకు మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కావాలి. అప్పుడే ప్రేక్షకుల్ని కుర్చీలో నుంచి కదల కుండా కట్టి పడేయొచ్చు. అలాంటి కథనాన్ని ఎంతో ఎంగేజింగ్ గా నడిపించాడు దర్శకుడు. నేటి టెక్నాలజీ యుగంలో యువత బాగా ఫేస్ చేస్తున్న ఓ సైబర్ క్రైం ను బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం నేటి యువతను మేలుకొలిపే విధంగా ఉంది. ఓ చిన్నపాటి మెసేజ్ ను కూడా ఇందులో ఇచ్చారు దర్శకుడు. అలాగే ఎంతో పవిత్రమైన వృత్తిలో కొనసాగే ఉపాధ్యాయులు సైతం… డబ్బు మీద వ్యామోహంతో ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారనే దాన్ని చూపించారు. టెక్నాలజీ వల్ల కలిగే అనర్థాలను… దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారనే దాన్ని చూపించారు. నేటి యువత… వీడియో కాలింగ్స్ ద్వారా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను ఇందులో చూపించి… ఓ చిన్న మెసేజ్ కూడా యువతకు ఇచ్చారు. వరుస మర్డర్ల మిస్టరీ చుట్టూ రాసుకున్న కథ… కథనాలు ఆద్యంతం ఆడియన్స్ ని కట్టిపడేసేలా ఉన్నాయి. ఇలాంటి జోనర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్ లో కరెక్ట్ ఛాయిస్. గో అండ్ వాచ్ ఇట్.
టైటిల్ రోల్ పోషించిన రజత్ రాఘవ్… డిటెక్టివ్ పాత్రలో చక్కగా నటించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తరహాలో కనిపించే ఈ పాత్ర… ఎక్కడా బోరింగ్ లేకుండా డిజైన్ చేయడంతో కార్తీక్ పాత్ర అందరినీ ఆకట్టుకుంటుంది. అలాగే అతనికి జోడీగా నటించిన ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. విద్యార్థినుల పాత్రలో నటించిన అమ్మాయిలు పర్వాలేదు అనిపించారు. కంప్యూటర్ టీచర్ రాహుల్ పాత్రలో అభిలాష్ చక్కగా నటించారు. స్కూల్ టీచర్, హీరో మిత్రునిగా నటించిన ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
దర్శకుడు వెంకట్ నరేంద్ర ఎంచుకున్న కథ, కథనాలు బాగున్నాయి. నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న ఓ సమస్యను ఇందులో చూపించడం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది. సంగీతం పర్వాలేదు. పూర్తిగా డిటెక్టివ్ బేస్డ్ స్టోరీ కావడంతో సంగీతానికి పెద్దగా ఇందులో ప్రాధాన్యం లేకుండాపోయింది. నిర్మాత సినిమాకి తగ్గట్టుగా బడ్జెట్టును పెట్టి… చాలా క్వాలిటీగా సినిమాని నిర్మించారు. డిటెక్టివ్ కథలను ఇష్టపడే వారు ఓ సారి లుక్కేయండి.
రేటింగ్: 3