దేశముదురు, కంత్రి సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన హన్సిక… చాలా కాలం తరువాత ఓ లేడీ ఓరియంటెడ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటించారు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ ఓంకార్ తెరకెక్కించారు. ఇందులో ఇంకా ప్రవీణ్, ఆడుక్కాలమ్ నరేన్, రాజా రవీంద్ర, మురళీ శర్మ, ఆర్ నారాయణ్, జయప్రకాష్, వినోదిని, సాయి తేజ్, పూజా రామచంద్రన్ తదితరులు నటించారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మెడికల్ క్రైం థ్రిల్లర్ ఆడియన్స్ ని ఏమాత్రం థ్రిల్ కి గురి చేసిందో చూద్దాం పదండి.
కథ: శ్రుతి (హన్సిక) యాడ్ ఫిల్మ్ మేకర్. చరణ్ (సాయి తేజ)తో ప్రేమలో పడుతుంది. అయితే తనను మోసం చేసి తన స్నేహితురాలితో ప్రియుడు డేటింగ్ చేస్తున్నాడనే విషయం తెలుసుకొంటుంది శ్రుతి. ఈ విషయంలో ప్రియుడితో గొడవ పడుతుంది. ఆ తర్వాత తన ఫ్లాట్‌లో అను (పూజా రాంచంద్రన్) అనే యువతి శవం లభిస్తుంది. దాంతో శ్రుతిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే సమయంలో శృతిని… స్థానిక ఎమ్మెల్యే గురుమూర్తి (అడుక్కాలమ్ నరేన్) మనుషులు చంపడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రియుడు చరణ్‌తో గొడవపడిన శ్రుతి… అతణ్ని ఎందుకు ఎటాక్ చేస్తుంది? పోలీస్ అధికారి రంజిత్ (మురళీ శర్మ) ఈ కేసును ఎలా విచారించాడు? పోలీసులకు శృతి చెప్పిన విషయాలు ఎంత వరకు వాస్తవం? గురుమూర్తికి స్కిన్ స్పెషలిస్టు, బ్యూటిషియన్ కిరణ్మయి (ప్రేమ)కు ఉన్న సంబంధం ఏమిటి? మర్డర్ మిస్టరీలో తన బావ బాబీ (ప్రవీణ్) పాత్ర ఎంత? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: చర్మ సౌందర్యం మీద చాలా కథలు చూశాం. అయితే అవన్నీ మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగుతాయి. అయితే మైనేమ్ ఈజ్ శ్రుతిలో మాత్రం ఓ వైవిధ్యమైన కాస్మొటిక్ సర్జరీకి సంబంధించి యూనిక్ కథను రాసుకుని తెరకెక్కించారు శ్రీనివాస్ ఓంకారు. ఇది విక్రమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత భార్యకు స్కిన్ సమస్య రావడంతో కిరణ్మయి ఎంట్రీతో స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ఓ కాస్మోటిక్ ఇండస్ట్రీ కుంభ కోణం కథ అనే లీడ్ ఇచ్చి కథలోకి తీసుకెళ్తాడు దర్శకుడు శ్రీనివాస్ ఓంకార్. ఫస్టాఫ్‌లో ట్విస్టులతో కథ… కథనాలు వడి వడిగా ముందుకు సాగిపోతాయి. ఆ తరువాత ఓ మర్డర్ తో సినిమాపై మరింత ఆసక్తి రేపుతుంది. ఇక సెకండాఫ్‌పై పెట్టుకొన్న అంచనాలకు తగినట్టుగానే కథను దర్శకుడు పరుగులు పెట్టించారు. దర్శకుడి స్క్రీన్ ప్లేకు తగినట్టుగా హన్సిక ఫెర్ఫార్మెన్స్ జత కావడంతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఫస్టాఫ్‌లో వదలిన ట్విస్టులను జాగ్రత్తగా రివీల్ చేసుకొంటూ వెళ్లడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది. సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులను డీల్ చేసిన తీరు అతడు రాసుకొన్న స్క్రీన్ ప్లే పాజిటివ్‌గా మారింది. క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కి ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతారు.
నటీనటులు విషయానికి వస్తే.. ఈ సినిమాకు హన్సిక నటన ప్రధాన బలంగా నిలిచింది. అన్నీ తానై సినిమాను ముందుకు నడిపించింది. తాను మొదటి నుంచి ప్రమోషన్లలో స్క్రిప్ట్ చూసే ఈ సినిమాను చేశా అంటూ చెబుతూ వస్తున్నారు. ఈ సినిమా చూడగానే అదే నిజం అనిపిస్తుంది. ఇప్పటి వరకూ గ్లామర్ పాత్రలకే పరిమితమైన హన్సిక… ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఎమోషనల్, యాక్షన్ సీన్లలో హన్సిక నటన బాగుంది. ఇక ఈ మూవీలో ఆడుక్కాలమ్ నరేన్, మురళీ శర్మ పాత్రలు ఇంటెన్స్ గా సాగాయి. ధర్మచక్రం ఫేమ్ ప్రేమ గ్లామర్‌తో ఆకట్టుకొన్నది. పూజా రామచంద్రన్ విలన్ రోల్‌లో కొత్తగా కనిపించడమే కాకుండా తన పాత్ర పరిధి మేరకు నటించింది. మురళీ శర్మ, ప్రవీణ్ తదితరులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే… స్కిన్ మాఫియా కాస్మొటిక్ సర్జరీలో ఎలా రాజ్యమేలుతోందనే విషయాన్ని కాస్త స్టడీ చేసి తెరకెక్కించడం చాలా కన్వియన్సింగ్ గా ఉంది. చివర్లో డ్రగ్ లో యాస్పరిన్ టాబ్లెట్ కలిపా అనేది ఎంత వరకు కరెక్టో తెలియదు కానీ… ఇలాంటి మెడికల్ టెర్మనాలజీ డైలాగులు ఇందులో చాలానే ఉన్నాయి. అవన్నీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాయి. అలాగే మార్క్ కే రాబిన్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోరే ప్రధాన భూమిక కాబట్టి… ఈ విషయంలో సంగీత దర్శకుడు చాలా జాగ్రత్త పడ్డారనే చెప్పొచ్చు. మలుపులతో కూడిన ఈ మూవీకి ఎడిటింగ్ ప్రధానం. చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సినిమాటోగ్రఫి చాలా రిచ్ గా ఉంది. క్రైం సీన్స్ ని బాగా తెరమీద చూపించారు. మూవీ చాలా క్వాలిటీగా ఉంది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్!!!
రేటింగ్: 3