ఈ వారం కూడా ఓ డజను సినిమాలకు పైగా థియేటర్లలో సందడి చేయనున్నాయి. అందులో యువ హీరో త్రిగుణ్, అందాల తార మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘జిగేల్’ ఒకటి. ఈ చిత్రానికి చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగార్జున అల్లం కథ… కథనం అందించగా… మల్లి యేలూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి డాక్టర్ వై.జగన్ మోహన్ మరో నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో సాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, పృథ్వీ రాజ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. రొమాంటిక్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండి.
కథ: ఏదైనా లాకర్ తెరచుకోకున్నా… లేదా చాటుగా లాకర్ ను తెరచి అందులో ఉన్న సొమ్మును కాజేయాలన్నా అందులో సిద్ధహస్తుడు నందు(త్రిగుణ్). ఈ క్రమంలో అతనికి మీనా(మేఘా చౌదరి) పరిచయం అవుతుంది. ఆమెను నందు గాఢంగా ప్రేమిస్తూ వుంటాడు. అండ్రాయిడ్ బాబా(పోసాని) సహాయంతో మరింత ప్రేమలో మునిగిపోతాడు నందు. ఈ క్రమంలో ఆమె గురించి ఓ భయంకర నిజం తెలుస్తుంది. అయినా… ఆమెతోనే ప్రయాణం సాగిస్తూ వుంటాడు. ఇంతలో అదే ఊళ్లో ఓ రాజమహాల్ లో వున్న జేపీ(సాయాజీ షిండే)… గత కొన్నేళ్లుగా ఓ లాకర్ ను తెరవలేక ఇబ్బందులు పడుతుంటాడు. ఆ విషయం తెలుసుకున్న నందు, మీనాలు లాకర్ ను తెరవడానికి జేపీ దగ్గరకు చేరుకుంటారు. అయితే… ఆ లాకర్ కు, మీనాకు ఉన్న సంబంధం మీనా తల్లి చెబుతుంది. ఆ సంబంధం ఏమిటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఈ మధ్య సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు మంచి ఆదరణ వుంది. ప్రేక్షకులు కూడా వీటిని బాగా ఆదరిస్తున్నారు. సరైన కథ… కథనాలతో సినిమాను తీయగలిగితే… ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల ఈ జోనర్లో విడుదలైన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యి… నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. అందుకే కొత్తగా మెగా ఫోన్ పట్టే దర్శకులు గానీ… సినిమాలను నిర్మించి నిలదొక్కోవాలనుకునే వారు కానీ ఇలాంటి జోనర్స్ కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తాజాగా జిగిల్ లాంటి రొమాంటిక్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో మన ముందుకు వచ్చారు ఇలాంటి ఔత్సాహిక దర్శక, నిర్మాతలు.
కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కాస్త రొమాంటిక్ కూడా తోడైతే… అలాంటి సినిమాలు యూత్ ను బాగా ఆకట్టుకుంటాయి. ఇలాంటి సినిమాను గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో తెరకెక్కిస్తే ఆడియన్స్ ను థియేటర్లో రెండు గంటల పాటు కదలనివ్వకుండా కూర్చోబెట్టవచ్చు. మంచి ఎంగేజింగ్ ప్లాట్ తో ఇలాంటి సినిమాలను తీస్తే… బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయం. తాజాగా దర్శకుడు మల్లి యేలూరి… నిర్మాతల్లో ఒకరైన నాగార్జున అల్లం అందించిన స్టోరీ, స్క్రీన్ ప్లేను ప్రేక్షకులు హాయిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వగలిగే సినిమాను వెండితెరపై ఆవిష్కరించారు. యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు… కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా చేశారు.
ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే పోసాని వేసిన ఆండ్రాయిడ్ బాబా వేషం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. పోసానికి రాసిన సంభాషణలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే లాయర్ మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ చేత చేయించిన కామెడీ బాగా వర్కవుట్ అయింది. ఇక సెకెండాఫ్ లో అసలు కథ మొదలై… చివరి వరకూ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లాకర్ చుట్టూ రాసుకున్న స్టోరీ, స్ర్కీన్ ప్లే ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
త్రిగుణ్ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. లాకర్ టెక్నీషియన్ గా బాగా సూట్ అయ్యాడు. అందులో లాకర్ ను ఓపెన్ చేసే టెక్నిక్స్ ను కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశారు. ఆ పాత్రలో త్రిగుణ్ బాగా ఒదిగిపోయి నటించారు. అతనికి జంటగా నటించిన మేఘా చౌదరి కూడా రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించింది. కథ మొత్తం సెకెండాఫ్ లో ఆమె చుట్టూనే తిరుగుతుంది కాబట్టి… ఆమె పాత్ర ఇంపార్టెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. పోసాని పాత్ర బాగా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ లోనూ, సెకెండాఫ్ లోనూ అతని పాత్ర ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. సాయాజీ షిండే పాత్ర నెగిటివ్ రోల్ లో పర్వాలేదు అనిపిస్తుంది. మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ ఎప్పటిలాగే బాగా నటించారు. అతనితో పాటు నటించిన జయవాణి పాత్ర కూడా బాగుంది. హీరోయిన్ తల్లి పాత్రలో నళిని నటించి ఆకట్టుకుంది. రఘుబాబు ముక్కు అవినాష్, మధునందన్ పాత్రలు పర్వాలేదు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
నిర్మాత నాగార్జున అల్లం రాసిన స్టోరీ, స్క్రీన్ ప్లేను దర్శకుడు మల్లి యేలూరి ఆడియన్స్ ను రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా తీయడంలో సక్సెస్ అయ్యారు. రొమాంటిక్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ పక్కాగా తెరపై చూపించి ఆడియన్స్ ను ఎంగేజ్ చేయడంలో విజయం సాధించారు డైరెక్టర్. అతనికి సహాయంగా నిర్మాతలు కూడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను మంచి స్టార్ కాస్ట్ తో ఎంతో క్వాలిటీగా నిర్మించారు. సీనియర్ నటీనటులతో ఇందులో ముఖ్యమైన పాత్రలను పోషించేలా నిర్మాతలు ప్లాన్ చేసుకున్నారు. వాసు అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్ అన్నీ బాగున్నాయి. చివర్లో వచ్చే ఐటెం సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఆకట్టుకుంటుంది. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ చిత్రానికి ఎడిటర్. దాంతో సినిమా ల్యాగ్ లేకుండా చాలా గ్రిప్పింగ్ గా, క్రిస్పీగా వుంది. రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. సంగీత దర్శకుడు ఆనంద్ మంత్ర అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టకుంటాయి. ఓవరాల్ గా సినిమా ఆడియన్స్ ను రొమాంటిక్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వారం మంచి ఛాయిస్ ఈ చిత్రం. ఓ సారి సరదాగా చూసేయండి
రేటింగ్: 3