బాల్యంలో చేసే స్నేహాలు కానీ… ఆ వయసులో చిగురించే ప్రేమలు కానీ జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఆ వయస్సులో స్వచ్ఛమైన ప్రేమతో మనస్సంతా ఉప్పొంగిపోయి వుంటుంది. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఫస్ట్ క్రష్ అనేది ఓ మధురమైన జ్జాపకం. అలాంటి మధుర స్మ్రుతులతో తెరకెక్కిన చిత్రమే ‘కాలమేగా కరిగింది’. అరవింద్ ముదిగొండ, నోమిన తార స్కూల్ డేస్ లో ప్రేమించుకునే టీజనేజర్స్ పాత్రలో నటించగా… వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి పెరిగి పెద్దవారై జీవితంలో స్థిరపడిన వారిగా కనిపించారు. శింగర క్రియేటివ్ వర్క్స్ పతాకంపై మరే శివశంకర్ నిర్మించారు. డెబ్యూ దర్శకుడు శింగర మోహన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం కావడంతో మోస్ట్ పొయెటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర యూనిట్. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: ఫణీంద్ర(అరవింద్ ముదిగొండ), బిందు(నోమిన తార) ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుకుంటూ వుంటారు. బిందు అంటే ఫణీంద్రకు పంచప్రాణాలు. మొదట్లో బిందు హేట్ చేసినా… ఆ తరువాత ఫణీంద్ర నిజయతీని చూసి అతన్ని ప్రేమించడం ప్రారంభిస్తుంది. ఇద్దరూ కలిసిమెలిసి తిరుగుతూ అభిప్రాయాలను షేర్ చేసుకుంటూ స్కూలింగ్ లైఫ్ ను గడిపేస్తూ వుంటారు. ఫైనల్ పబ్లిక్ పరీక్షల్లో ఫణీంద్ర త్రుటిలో ర్యాంకును కోల్పోతాడు. తనకు ర్యాంకు రాకపోవడానికి కారణం బిందునే అనుకుని… ఆ తరువాత వచ్చే ఇంటర్ లో మంచి మార్కులు సాధించాలని బిందుతో మాట్లాడటం మానేయడానికి సిద్దమవుతాడు . అలా విడిపోయిన వీరిద్దరూ మళ్లీ ఎప్పుడు కలిశారు? అసలు బిందుకు పెళ్లి వగైరా ఏమైనా అయ్యాయా? ఫణీంద్ర జీవితంలో స్థిరపడిపోయి ఎలాంటి పొజిషన్లో జీవిస్తున్నాడు? తదితర వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే
కథ… కథనం విశ్లేషణ: చైల్డ్ హుడ్ మెమోరీస్ ఎప్పుడూ తీపి గుర్తులుగానే మిగిలిపోతాయి. అది స్నేహమైనా… ప్రేమ అయినా. బాల్యంలో చిగురించిన ప్రేమలు మాగ్జిమం ఫలించవు. అందుకు మనం ఎన్నో ఉదాహరణలు చూపించొచ్చు. అయితే తాలుకు గురుతులు మాత్రం జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అలా నిత్యం ప్రేమలో తలమునకలై జీవించిన జంట యొక్క తాలూకు చిత్రమే ఇది. సినిమా మొదలైంది మొదలు… కవితాత్మకంగా హీరో, హీరోయిన్ల నోటి నుంచి జాలు వారే సంభాషణలు ప్రేక్షకుల మనస్సును తాకుతాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్క ప్రేక్షకుడు తమ బాల్యంలో జరిగినే సంఘటనలను ఈ చిత్రంలో చూసుకుంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
టీనేజ్ లో చిగురించే ప్రేమలు… జీవితంలో స్థిరపడిపోయిన తరువాత కూడా మనల్ని వెంటాడుతూనే వుంటాయి అనేదానికి ఉదహరణగా వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి పాత్రలు. కల్మషంలేని స్వచ్ఛమైన ప్రేమను మది నిండా నింపుకుని ఎన్నో ఏళ్లు గడిచినా ఏమాత్రం ప్రేమ విషయంలో విశ్రాంతి తీసుకోకుండా జీవించిన జంట గురించి ఇందులో చూపించారు. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
బాల్యంలో అరవింద్ ముదిగొండ, నోమిన తార జంట చాలా బాగుంది. వీరిద్దరి మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేలు మనస్సును హత్తుకుంటాయి అంటే… దానికి కారణం ఈ జంటే. అంత బాగా నటించారు. అలాగే పెద్దవారైన తరువాత పాత్రల్లో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి వున్నది కాసేపే అయినా ప్రేక్షకుల మన్ననలను పొందారు. ముఖ్యంగా చివర్లో వీరిద్దరి పాత్రలు బాగా ఆకట్టుకుంటాయి. ఇక మిగతా పాత్రల్లో నటించిన వారంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్టర్ శింగర మోహన్ కి ఇది నాలుగేళ్ల కళ. అన్నీ తానై ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యేలా చూసుకున్నారు. ఇందులో దర్శకుడు ప్రతి పాత్రను కవితాత్మకంగా మాట్లాడించి ఆకట్టుకున్నాడు. ప్రతి ఫ్రేమ్ ఒక స్టోరీని చెబుతంది. దాన్ని దర్శకుడు ఎంతో చాక చక్యంగా తెరపై ఆవిష్కరించారు. ఈ కథను తన సంగీతంతో మరింత బ్యూటిఫుల్ గా తయారుచేశారు సంగీత దర్శకుడు గుడప్పన్. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు, టీజర్లకు, ట్రైలర్లకు మంచి సంగీతం కుదరింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ప్రతి పాత్రను ఎంతో బాగా చూపించారు. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాను తెరకెక్కించారు. సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. చివరగా… కాలమేగా కరిగింది అనేది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. కలహాలే లేని ప్రేమ కథ అనేది ట్యాగ్ లైన్. ఇది ఎంతో పొయెటిక్ గా తెరకెక్కింది. దాంతో అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఓసారి సరదాగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీకెండ్ లో ఓ లుక్కేసేయండి.
రేటింగ్: 3