హారర్ జోనర్ చిత్రాలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వుంది. అందుకే యువ హీరోలు కూడా ఇలాంటి జోనర్ లో చేయడానికి ఇష్టపడతారు. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంటి నుంచి వచ్చిన యువ హీరో ఆశిష్ కూడా ఇలాంటి జోనర్ ఎన్నుకోవడాన్ని బట్టి చూస్తే… హారర్ చిత్రాలకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతుంది. రౌడీ బాయ్స్ తో మంచి యువ హీరోగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్… ఇప్పుడు ‘లవ్ మీ’ ఇఫ్ యు డేర్… అంటూ మన ముందుకొచ్చారు. ఇందులో హీరోయిన్ గా ‘బేబీ’ ఫేం వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాణంలో అరుణ్ దర్శకత్వలో తెరకెక్కించారు. కీరవాణి సంగీతం అందించగా, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ ఈచిత్రానికి విజువల్స్ అందించారు. మరి ఈ సినిమా ఎలా వుందో రివ్యూలో చూద్దాం పదండి.
కథ: రామచంద్రాపురం అనే గ్రామంలో ఓ ఇరవై ఇళ్లు మాత్రమే ఉంటాయి. అక్కడ ఉన్న ఓ ఇంట్లో మాత్రం సాయంత్రం 8 గంటలు అవ్వగానే విపరీతమైన ఏడుపు వినిపిస్తూ… గ్రామస్తులను భయాందోళనలకు గురిచేస్తూ ఉంటుంది. అందులో నివసిస్తున్న ఓ జంట చనిపోవడంతో అక్కడ దెయ్యం ఉందని గ్రామస్తులు భావిస్తూ వుంటారు. అయితే వీరికి ఓ చిన్న పాప ఉంటుంది. ఆ పాప ఎక్కడికి పోయింది? ఏమి చేస్తోందనేదాన్ని కనిపెట్టడానికి యూట్యూబ్ ఛానల్ నడిపే అర్జున్(ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) అన్వేషణ మొదలు పెడతారు. భూతాలు, దెయ్యాలు, శ్మశానాల మీద వీడియోలను చేసే వీరికి రామచంద్రాపురం కథ తెలిసి… ఆ చిన్నారి ఏమైందనేదాన్ని కనుక్కోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వుంటారు. వీరికి ప్రియా(వైష్ణవి చైతన్య) సహాయం చేస్తూ ఉంటుంది. మరి ఈ క్రమంలో ఆ అమ్మాయి ఆచూకీ ఎలా కనుగొన్నారు? ఆమెకు వీరికి ఉన్న సంబంధం ఏమిటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: అనగనగా ఓ ఊరు… అందులో ఓ అందమైన కుటుంబం… అందులో తల్లిదండ్రులిద్దరూ అనుమానాస్పద స్థితిలో చనిపోతే… వారికున్న సంతానం ఎలిం ఇబ్బందులు ఎదుర్కొంది … ఇలాంటి టెంప్లేటెడ్ కథలకు వైవిధ్యమైన స్క్రీన్ ప్లే రాసుకుని… ఇంట్రెస్టింగ్ గా తెరమీద ఆవిష్కరించగలిగితే… ఆడియన్స్ కుర్చీలకు అతుక్కుపోవడం ఖాయం. అలాంటి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతోనే ఈ చిత్రాన్ని దర్శకుడు ఇంట్రెస్టింగ్ గా తెరమీద చూపించారు. ఆసక్తికరమైన మలుపులతో ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమాను తీసి సక్సెస్ అయ్యారు.
ఫస్ట్ హాఫ్ అంతా అర్జున్, దివ్యవతి గురించి వెతుకుతూ వెళ్లడం, అక్కడ దయ్యంతో సీన్స్ తో సాగుతుంది, ఇంటర్వెల్ కి ఓ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏంటి అనే ఆసక్తిని కలిగిస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో ఆ ముగ్గురు అమ్మాయిల గురించి, దివ్యవతి గురించి అర్జున్ చేసే రీసెర్చ్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక్కో ట్విస్ట్ రివీల్ చేసి కథపై మరింత ఆసక్తి కలిగిస్తారు. కాకపోతే ఆ రీసెర్చ్ కొంచెం కన్ఫ్యూజన్ గా సాగుతుంది. ఇక క్లైమాక్స్ లో వరుస ట్విస్ట్ లు, మళ్ళీ చివర్లో సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ ఇంకో ట్విస్ట్ తో అదరగొట్టారు. ముందు నుంచి ప్రమోషన్స్ లో చెప్పినట్టు సినిమాలో ఐదారుగురు హీరోయిన్స్ ఉన్నారు. వైష్ణవి, సిమ్రాన్ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పాత్రలేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఆశిష్ రౌడీ బాయ్స్ లో కాలేజీ కుర్రాడిగా ఫుల్ ఎనర్జిటిక్ గా కనపడి ఇప్పుడు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఈ సినిమా కోసం ఆశిష్ అడవుల్లో, స్మశానాల్లో చెప్పులు లేకుండా కష్టపడ్డాడు. బేబీతో అందర్నీ ఇంప్రెస్ చేసిన వైష్ణవి చైతన్య మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకులని అలరించింది. రవికృష్ణ కూడా ఆశిష్ కి బాగా సపోర్ట్ ఇస్తూ నటించాడు. సిమ్రాన్ చౌదరి స్కెలెటిన్ స్పెషలిస్ట్ గా కనిపించి ఓకే అనిపించింది. కథ మొత్తం వీరి మధ్య తిరుగుతుంది.
PC శ్రీరామ్ కెమెరామెన్ అంటే ఆ సినిమా విజువల్స్ బాగుంటాయని అందరూ ఫిక్స్ అయిపోతారు. ఈ సినిమా విజువల్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆస్కార్ విన్నర్ కీరవాణి ఈ సినిమాకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. BGM తోనే భయపెట్టారు. పాటలు కూడా బాగున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ లొకేషన్స్ ని చాలా బాగా డిజైన్ చేసారు. కొత్త కథకి ఓ కొత్త కథనంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి దర్శకుడిగా అరుణ్ మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. మొత్తంగా ‘లవ్ మీ’ ఓ దయ్యం కోసం, ఆమె చుట్టూ ఉన్న కథ కోసం హీరో పాత్ర చేసిన రీసెర్చ్, హీరో దయ్యంతో ప్రేమలో పడే ఆసక్తికర కథాంశంతో ఆసక్తికరంగా హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3