నవదీప్… విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే వుంటారు. అందుకే నవదీప్ సినిమాలన్నీ నవ్యంగా ఉంటాయి. ఇటీవల కొంత గ్యాప్ వచ్చినా… తాజాగా ‘లవ్ మౌళి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భిన్నమైన ప్రమోషన్స్ తో ఆకట్టుకున్న ఈ సినిమా…. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సి. స్పేస్, నైరా క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. అవనీంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాతో తన 2.0 వర్షన్ మొదలైందని ప్రచారం చేసుకున్న నవదీప్… లవ్ మౌళి గా ఎలా మెప్పించారో చూద్దాం పదండి.
కథ: పసితనంలోనే తల్లిదండ్రుల నుంచి విడిపోయి.. తాతయ్య వద్ద పెరుగుతాడు మౌళి (నవదీప్). 14 ఏళ్లు రాగానే తాతయ్య కూడా చనిపోవడంతో ఇష్టమొచ్చినట్టు పెరిగి పెద్దవాడై… ఇతరులను ఎవ్వరినీ పట్టించుకోకుండా తన ప్రపంచంలో తాను బతికేస్తూ వుంటారు. అయితే మౌళి ఒక గొప్ప పెయింట్ ఆర్టిస్ట్. మేఘాలయలో తన రిసార్ట్ లోనే ఉంటూ అప్పుడప్పుడు పెయింట్స్ వేస్తూ ఉంటాడు. మౌళి వేసే పెయింట్స్ తన మేనేజర్ హారిక అమ్మిపెడుతూ ఉంటుంది. ఓ రోజు మౌళి అడవుల్లోకి వెళ్తే అక్కడ ఓ అఘోరా(రానా) కనపడి మాట్లాడితే ప్రేమ గురించి టాపిక్ రావడంతో నెగిటివ్ గా మాట్లాడతాడు మౌళి. దీంతో అఘోర ఓ పెయింట్ బ్రష్ ని సృష్టించి మౌళి దగ్గర పెట్టి వెళ్ళిపోతాడు. అనుకోకుండా ఓ మౌళి వేసిన ఓ పెయింట్ మౌళి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కోసం అమ్ముడవడంతో హారికతో(భావన సాగి) గొడవ అవుతుంది. దీంతో హారిక అసలు నీకేం తెలీదు, నీకెలాంటి అమ్మాయి కావాలో కూడా తెలీదు అని తిట్టి వెళ్ళిపోతుంది. ఆ కోపంలో అఘోరా ఇచ్చిన పెయింట్ బ్రష్ తో తనకు కావాల్సిన అమ్మాయి లక్షణాల గురించి చెప్తూ చిత్ర(పంఖురి గిద్వాని) అనే పేరుతో ఓ అమ్మాయి బొమ్మ పెయింట్ వేస్తాడు. దీంతో ఆ పెయింట్ లోంచి చిత్ర అనే అమ్మాయి నిజంగానే బయటకు వస్తుంది. చిత్రతో గొడవ అయి మళ్ళీ తనకు కావాల్సిన అమ్మాయి లక్షణాలు ఇవి కాదు అని ఇంకో పెయింట్ వేస్తాడు. చిత్ర మళ్ళీ మౌళి కోరుకున్న క్యారెక్టర్ తో పెయింట్ లోంచి వస్తుంది. ఇలా మౌళి ఎన్ని సార్లు పెయింట్ వేసాడు? ఎన్ని సార్లు చిత్ర ఎన్ని క్యారెక్టర్స్ తో బయటకు వచ్చింది? అసలు మౌళి ప్రేమ అంటే ఏంటి అని తెలుసుకున్నాడా? మౌళి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? ఆమెతో గొడవ ఎందుకు? చివరికి మౌళికి గర్ల్ ఫ్రెండ్ దొరికిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే
ఒక ఫాంటసీ ఎలిమెంట్ చేర్చి కొత్త స్క్రీన్ ప్లేతో సరికొత్తగా చూపించారు. ఒక అబ్బాయి ప్రేమ అంటే ఏంటి? తనకు ఎలాంటి అమ్మాయి కావాలి అని వెతికే ప్రయాణంలో అతను ఏం తెలుసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ కొంచెం అక్కడక్కడా సాగదీసినట్టు ఉన్నా సెకండ్ హాఫ్ అదిరిపోతుంది. ఈ సినిమా కథకు లొకేషన్స్, మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యాయి. ఈ సినిమా మొత్తాన్ని మేఘాలయలోనే తీశారు. ఈ కథ అక్కడ చెప్తేనే బాగుంటుంది అనే విధంగా స్క్రీన్ ప్లే కూడా రాసుకున్నారు. క్లైమాక్స్ ఆసక్తికరంగా ముగించారు. సన్నివేశాల పరంగా చూసుకుంటే చాలా సీన్స్ ప్రేమ, పెళ్లిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక చోట కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాలోని ప్రేమ ఎమోషన్ కి మన రియల్ లైఫ్ కనెక్ట్ అయితే మాత్రం సినిమా బాగా నచ్చుతుంది. ఇక ముద్దు సీన్స్, బోల్డ్ సీన్స్ బాగానే ఉన్నాయి. చాలా వరకు ముద్దు సీన్స్ సహజంగానే అనిపించినా ఒకటి రెండు బోల్డ్ సీన్స్ మాత్రం అవసరమా అనిపిస్తాయి. డైరెక్టర్ తన దృష్టిలో ప్రేమ అంటే ఏంటి అనేది ఈ సినిమాతో తనకు అనిపించింది చెప్పాడు. అయితే కథని ఎంత కొత్తగా చూపించినా చివరకు అందరూ చెప్పేదే చెప్పడంతో ఇంతేనా అనిపిస్తుంది.
ప్రమోషన్స్ లో చూపించినట్టు నవదీప్ ఫుల్ గడ్డం, జుట్టుతో ఒక వైల్డ్ యానిమల్ లాగే కనపడి తన నటనలో కూడా ఒక భావోద్వేగం చూపించాడు. నవదీప్ 2.0 వర్షన్ కి తగ్గట్టు నటించాడు. బాడీ కోసం, సినిమాలో ట్రెక్కింగ్ సీన్స్ కోసం నవదీప్ బాగానే కష్టపడ్డాడు. ఇక సినిమాలో చిత్ర క్యారెక్టర్ చేసిన పంఖురి గిద్వాని అదరగొట్టేసింది. మౌళి క్యారెక్టర్ కోరుకున్నట్టు వివిధ క్యారెక్టర్స్ లో చిత్ర తన నటన, రూపంతో కూడా మెప్పించింది. ఒక్కోసారి ఒక్కో గెటప్ లో సినిమా కోసం ఏదైనా చేస్తాను అనేంతలా నటించింది. ఇక హారికగా నటించిన భావన సాగి మాత్రం ఒక మోడ్రన్ మేనేజర్ పాత్రలో పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రలు మిర్చి హేమంత్, కిరణ్, చార్వి దత్త, అక్షయ్ డోగ్రె.. తమ పాత్రల్లో మెప్పించారు. రానా దగ్గుబాటి అఘోరాగా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అదరగొట్టేసాడు. అసలు రానా అని అంత తొందరగా గుర్తుపట్టలేనంతగా మారి నటించాడు.
ఈ సినిమాలో ముందుగా చెప్పాల్సింది లొకేషన్స్ గురించి. మేఘాలయలో అద్భుతమైన కొండలు, కోనలు, లోయలు, నదులు, అడవులు.. ఎన్నో అద్భుతమైన ప్రకృతి ప్రదేశాల్లో షూటింగ్ చేసారు. ఆ లొకేషన్స్ ని చాలా అద్భుతంగా కెమెరా విజువల్స్ లో చూపించారు. ఈ సినిమా దర్శకుడే సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేసి తాను అనుకున్న విజువల్స్ ని చూపించాడు. ఇక గోవింద్ వసంత, కృష్ణ ఇద్దరూ కూడా మ్యూజిక్ బాగా ఇచ్చారు. పాటలు ఒక్కసారి వినడానికి బాగుంటాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని చోట్ల బాగుంటుంది. ఇక కథ పాతదే అయినా కథనం కొత్తగా చూపించాడు దర్శకుడు. అవనీంద్ర డైరెక్టర్ గా మాత్రం మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ విలువల పరంగా చూస్తే ఈ సినిమా నిర్మాణంలో కరోనా వల్ల, ఇంకా అనేక కారణాల వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా ఎక్కడా వెనుకడుగు వేయకుండా అద్భుతంగా నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3