కాలేజీలో చేసే అల్లర్లు ఎప్పుడూ అందంగానే ఉంటాయి. అప్పుడెప్పుడో ప్రేమికుడు సినిమాలో అన్నట్టు… ఇరవైలో చెయ్యని అల్లర్లు అరవైలో చేస్తే ఏం లాభం అన్నట్టు… కాలేజీ లైఫ్ లో చేసే అల్లరి జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే ఈ నేపథ్యంలో తెరకెక్కే కథలన్నీ… వెండితెరపై సూపర్ హిట్ అయ్యాయి. ఈ తరంలో వచ్చిన ప్రేమదేశం, హ్యపీడేస్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అలాంటి సరదా స్టోరీతో తెరకెక్కిన చిత్రమే ‘MAD’(Manoj, Ashok, Damodar). అంతా కొత్తవారితో తెరకెక్కిన ఈ చిత్రాన్ని… జాతిరత్నాలు చిత్రానికి రైటర్ పనిచేసిన కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించారు. చినబాబు కూతురు హారిక ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ చేయడంతో మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. దుల్కర్ సల్మాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి… మరింత హైప్ క్రియేట్ చేశారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం… ఏమాత్రం అలరించిందో చూద్దాం పదండి.
కథ: మనోజ్(రామ్ నితిన్), అశోక్(నార్నే నితిన్), దామోదర్ అలియాస్ డీడీ(సంగీత్ శోభన్) R.I.E.కాలేజీలో బ్యాచ్ మేట్స్. వీరికి లడ్డూ( ట్యాక్సీవాలా ఫేమ్ విష్ణు) అనే ఓ జోవియ్ క్యారెక్టర్ ఉంటాడు. మనోజ్… శ్రుతి(గౌరి ప్రియారెడ్డి)ని ప్రేమిస్తూ ఉంటాడు. అశోక్.. జెన్నీ(అనంతిక సనీల్ కుమార్) ప్రేమలో ఉంటాడు. దామోదర్ మాత్రం సింగిల్ లైఫ్ లో బతకాలనుకునే వ్యక్తి. అయితే ఓ లెటర్ అతన్ని కూడా ప్రేమలో పడే విధంగా చేస్తుంది. ఈ లెటర్ రాసింది ఎవరు… డీడీని ఇష్టపడిన అమ్మాయి ఎవరు? మనోజ్… శ్రుతి, అశోక్… జెన్నీల ప్రేమ సఫలమైందా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: మ్యాడ్… సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్ గానే ఉంటుంది… కానీ… దాన్ని రెండు గంటల పాటు నడిపించడానికి కళాశాలను బేస్ చేసుకుని రాసుకున్న కథనం మాత్రం ఆద్యంతం ఆడియన్స్ ని నవ్విస్తూనే ఉంటుంది. కాలేజీ కథలను నడిపించాలంటే సంభాషణలు కూడా ముఖ్యం. అందులోనూ ఈ తరం కుర్రాళ్లకి తగ్గట్టుగానే ఉండాలి. అందుకు మ్యూట్ వేయాల్సిన అవసరం కూడా ఉండకూడదు. ఇలాంటి యూత్ ఫుల్ డైలాగులు ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కూ ఉన్నాయి. అందుకే ఈ సినిమాని సమయం అనేది తెలియకుండా ప్రేక్షకులు ప్రతి మినిట్ ను ఎంజాయ్ చేస్తారు. ఒకరకంగా మాస్ గా చెప్పాలంటే… ఈ చిత్రంలో పిచ్చకామెడీ ఉందని చెప్పాలి. లడ్డూ పాత్రని తీర్చిదిద్దిన విధానం కడుపుబ్బ నవ్విస్తుంది. లైఫ్ లో ఏదైనా తీపి గురుతులు ఉన్నాయి అంటే… అది కాలేజీ లైఫ్ జ్ఞాపకాలే… అప్పుడు ఏర్పడిన స్నేహాలే జీవితాంతం తోడుంటాయి అనేది ఇందులో చూపించారు.
నటీనటుల విషయానికొస్తే… సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్ గతంలో వెబ్ సిరీస్ లో చేసిన అనుభవం ఉంది కానీ… ఇందులో మాత్రం ఇరగదీసేశాడని చెప్పొచ్చు. తన కామెడీ టైమింగ్ తో మిగతా ఇద్దరినీ డామినేట్ చేసేశాడని చెప్పొచ్చు. రామ్ నితిన్ కనబడిన ప్రతి అమ్మాయి దగ్గర పులిహోర కలిపి.. పటాయించే జోవియల్ యువకుడిగా మెప్పించాడు. నార్నే నితిన్… కామ్ గోయింగ్ గాయ్ గా మెప్పించారు. వీరికి జోడీగా నటించిన ముగ్గురు అమ్మాయిలు తమ క్యూట్ లుక్స్ తో యూత్ ని బాగా ఆకట్టుకుంటారు. అలాగే ప్రిన్సిపల్ గా నటించిన రఘుబాబు పాత్ర… గతంలో ధర్మవరపు సుబ్రమణ్యం చేసిన ప్రిన్సిపల్ పాత్రను గుర్తుకు తెస్తుంది. కమెడియన్ విష్ణు తండ్రి పాత్రలో నటించిన అతను బాగా నటించారు. రచ్చ రవి ప్రిన్సిపల్ ప్యూన్ పాత్రలో పర్వాలేదు అనిపించాడు. శివనారాయణ కాసేపు కనిపించి తన పాత్రకు న్యాయం చేశాడు.
టెక్నికల్ విషయానికి వస్తే… ద్శకుడు కల్యాణ్… బేసిగ్గా రైటర్ కాబట్టి… అతని పెన్ పవర్ సంభాషణల్లో కనిపిస్తుంది. మనం దైనందిన జీవితంలో చూసిన ప్రతి చిన్న విషయాన్ని ఇందులో చాలా హ్యూమరస్ గా చూపించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. మంచి భవిష్యత్తు ఉంది. గతంలో జాతిరత్నాలకు కూడా రైటర్ గా పనిచేసిన అనుభవం ఆయనది. ఇప్పుడు టిల్లు స్క్వయర్ కి కడా రైటింగ్ డిపార్ట్ మెంటులో చేస్తున్నాడు. భీమ్స్ సంగీతం యువతను ఉర్రూతలుగిస్తుంది. మాస్ బీట్స్ తో అలరించాడు. నవీన్ నూలీ ఎడిటింగ్ చాలా బాగుంది. రెండు గంటలపాటు నిడివి ఉండటంతో సినిమా చాలా సరదాగా సాగిపోతుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. సో.. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3.25