RX100 మూవీ తరువాత హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి మంచి హిట్ దొరకలేదనే చెప్పొచ్చు. అలాగే ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూపతికి కూడా గత చిత్రం మహాసముద్రం కొంచెం నిరాశే మిగిల్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘మంగళవారం’. రా అండ్ రస్టిక్ లవ్ డ్రామాతో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీని స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ, అజయ్ భూపతి నిర్మాతలు. ఇందులో మిగిలిన పాత్రల్లో నందిత శ్వేత, అజ్మల్ అమీర్, శ్రీ తేజ్, చైతన్య కృష్ణ, అజయ్ ఘోష్, లక్ష్మణ్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: మా లక్ష్మీపురం అనే గ్రామంలో అక్రమ సంబంధాలు పెట్టుకొన్న జంటలు ప్రతీ మంగళవారం మరణించడం ఆ ఊరి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఆ ఊళ్లో ఉన్న మాలచ్చమ్మ అమ్మవారి జాతర జరిపించకపోవడం వల్లే ఇలా జరుగుతోందని గ్రామస్థులు భావిస్తుంటారు. అదే సమయంలో మరణాళ వెనుక ఉన్న మర్మాన్ని ఛేదించడానికి ఓ మహిళా ఎస్.ఐ (నందిత శ్వేత) వస్తుంది. ఓ వైపు శైలునే దెయ్యంగా మారి అందర్నీ చంపేస్తుందనే మూఢ నమ్మకంతో ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ గ్రామానికి వచ్చిన ఎస్ఐ మరణాల వెనుక ఏదో మిస్టరీ ఉందనే అనుమానంతో దర్యాప్తు చేపడుతుంది. గ్రామంలో జరిగిన మరణాల వెనుక అసలు కారణాలు ఏమిటి? ఆ గ్రామంలో శైలు (పాయల్ రాజ్‌పుత్)ను జమీందార్(చైతన్య) ఆదేశాలతో గ్రామస్థులు ఎందుకు శిక్షించాలని అనుకొంటారు? ఈ విషయంలో శైలుకు ఎవరు అండగా నిలుస్తారు? చివరకు గ్రామంలో జరిగేవి ఆత్మహత్యలా? హత్యలా? మంగళవారమే మరణాలు ఎందుకు జరుగుతున్నాయి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఇప్పటి వరకు డిజార్డర్ కథలను చాలానే వెండితెరపై చూశాం. అయితే ఇందులో అమ్మాయిల్లో ఉండే ఓ యూనిక్ బోల్డ్ డిజార్డర్ ని మాత్రం ఎంతో ఎమోషనల్ గా తెరమీద చూపించు. శైలు అనే అమ్మాయి బాల్యానికి సంబంధించిన సంఘటనలతో కథను భావోద్వేగంతో దర్శకుడు అజయ్ భూపతి ఆరంభించిన విధానం బాగుంది. ఆ తర్వాత గ్రామంలో ఉండే కొన్ని క్యారెక్టర్లను ప్రధానంగా చేసుకొని హీరో, హీరోయిన్లు లేకుండా ఫస్టాఫ్ వరకు కథను పరుగులు పెట్టించిన విధానమే సగం సక్సెస్‌కు కారణమని చెప్పవచ్చు. ఫస్టాఫ్‌లో జరిగే మరణాలు, వాటి చుట్టు సాగిన డ్రామాను డైరెక్టర్ రక్తి కట్టించారు. ప్రతీ క్యారెక్టర్‌పై అనుమానాలు వచ్చేగా రాసుకొన్న స్క్రిప్టు బాగుంది. శైలు పాత్రకు సంబంధించిన చిన్న ట్విస్టుతో ఫస్టాఫ్‌ను ముగించడంతోపాటు సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచారు.
మంగళవారం సెకండాఫ్ విషయానికి వస్తే.. అసలు కథను మొదలుపెట్టి ప్రతీ ఎపిసోడ్‌తో ట్విస్ట్ ఇస్తూ ప్రతీ సీన్‌ను ఎమోషనల్‌గా మార్చారు. శైలు పాత్రను స్క్రీన్‌పై బోల్డుగా చూపిస్తూనే ఆ క్యారెక్టర్‌పై సానుభూతిని పెరిగేలా చేయడం ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది. చివరి 45 నిమిషాల్లో వచ్చే ప్రతీ ట్విస్టు ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది. ప్రతీ చిన్న క్యారెక్టర్‌ను రాసుకొన్న విధానం వారితో నటన రాబట్టుకొన్న విధానం ఆయన విజన్ ఏమిటో చెప్పింది. ఈ సినిమాకు దర్శకుడే హీరోలా చేసిందని చెప్పవచ్చు. పాయల్… శైలు పాత్రతో నటనాపరంగా విజృంభించింది. ఎవరూ ధైర్యం చేయని పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకొని ఫెర్ఫార్మ్ చేసిన విధానం సూపర్బ్ అనిపించేలా చేసింది. ఇక రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, లక్ష్మణ్, శ్రవణ్ రెడ్డి, దయానంద్ రెడ్డి, నందిత శ్వేత, చైతన్య కృష్ణ, నందిత శ్వేత, దివ్య పిళ్లై, అజ్మల్ అమర్ పాత్రలు అన్నీ బలమైన పాత్రలే కావడంతో వారి వారి శక్తి సామర్థ్యాల మేరకు రాణించారు. అజయ్ ఘోష్, లక్ష్మణ్ కాంబినేషన్‌లో వచ్చే సీన్లు మంచి కామెడీని పండించాయి. దివ్య పిళ్లై సినిమాను సమూలంగా మార్చే పాత్రలో అద్బుతంగా రాణించారు. అజ్మల్ అమర్ అతిథి పాత్రకే పరిమితమయ్యారు. మంగళవారం సినిమా ఫెర్ఫార్మెన్స్‌కు ఎంత బలంగా నిలిచిందో.. సాంకేతికంగా అంతకు రెండింతలు ఈ సినిమాలో భాగస్వామ్యమైంది. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ప్రతీ ఫ్రేమ్‌ను హైలెట్ చేసేలా, ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇచ్చేలా మ్యూజిక్ అందించారు. దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫి మరో హైలెట్. ప్రతీ ఫ్రేమ్‌ను విజువల్ ట్రీట్‌గా మార్చారు. తల్లూరి కృష్ణ ఆర్ట్ విభాగం పనితీరు, గుల్లపల్లి మాధవ్ కుమార్ ఎడిటింగ్ సినిమాను ఎక్సలెంట్‌గా మార్చారు. నిర్మాతలు సురేష్ వర్మ, స్వాతిలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని తెరకెక్కించారు. స్క్రిప్ట్ పరంగా కొన్ని లోపాలు, లాజిక్‌కు దూరంగా ఉన్నా.. మేకింగ్, యాక్టర్ల ఫెర్ఫార్మెన్స్ వల్ల అవన్నీ కనిపించుకుండా పోయాయి. డైరెక్టర్ బ్రిల్లియంట్ మేకింగ్, పాయల్, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్, అజనీష్ మ్యూజిక్, దాశరథి శివేంద్ర సినిమాటోగ్రఫి సినిమాకు ప్లస్ పాయింట్స్. అనుక్షణం కొత్త అనుభూతి, థ్రిల్లింగ్‌గా అనిపించే ట్విస్టులు ఈ సినిమాకు బలంగా నిలిచాయని చెప్పవచ్చు. థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. గో అండ్ వాచ్ ఇట్!!!
రేటింగ్: 3.25