ఇప్పటి వరకు సంపూర్ణేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు. లెంగ్తీ సంభాషణలు పలకడంలోనూ దిట్ట. అలాంటి సంపూ… ఇసారి ఓ రాజకీయ నేపథ్యంతో కూడుకున్న సీరియస్ సినిమాలో నటించి మన ముందుకు వచ్చాడు. తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ‘మండేలా’ చిత్రం ఇతి వృత్తంతో తెలుగలోకి తెరకెక్కించారు మహిళా దర్శకురాలు పూజ కొల్లూరు. ‘మార్టిన్ లూథర్ కింగ్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైనాట్ స్టూడియోస్, రిలయెన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ పతాకంపై ఎస్ శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: పడమరపాడు అనే ఓ చిన్న పల్లెటూరులో చర్మకారునిగా పని చేస్తూ పొట్టపోసుకునే అనాథ స్మైల్(సంపూర్ణేష్ బాబు). అతనికి బాటా అనే ఓ మిత్రుడూ ఉంటాడు. అనాథగా పెరిగిన స్మైలీకి పోస్టాఫీసులో ఓ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఆ గ్రామానికి కొత్తగా వచ్చిన వసంత(శరణ్య) చెబుతుంది. అయితే అందుకు కావాల్సిన డాక్యుమెంట్స్ స్మైల్ వద్ద ఉండవు. దాంతో అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి… పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేస్తుంది. అందులో భాగంగానే అతనికి ఓటర్ ఐడీ కార్డు కూడా రెడీ చేస్తుంది. ఆ ఓటర్ ఐడీతో స్మైల్… ఆ గ్రామంలో ఏమి చేశాడన్నదే మిగతా కథ.
విశ్లేషణః వర్తమాన రాజకీయాలను స్పృశిస్తూ… తెరకెక్కిన పూర్తి వ్యంగ్య చిత్రం ఇది. ప్రజాస్వామ్యంలో ‘ఓటు’ అనే ఆయుధం ఎంత విలువైనదో చాటి చెప్పేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ చిత్రం ఎంతో కొంత ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఓటుతో రాజకీయ నాయకులను సామాన్యుడు ఎలా ఆడుకోవచ్చునో ఇందులో చూపించారు. ఇలాంటి సినిమాలు గతంలో వచ్చినా… ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను అద్దం పట్టేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకురాలు. ప్రస్తుత తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. మన రాజకీయాలకు దగ్గరగా, అంతే కనెక్ట్ అయ్యేలా తీయడం మరో విశేషం. సినిమా ఆద్యంతం సెటైరికల్‌గా సాగుతుంది. ఊర్లో రెండు వర్గాల ప్రజలు కొట్టుకోవడం, దానికోసం ఊరు అసెట్‌ని ధ్వంసం చేయడం ప్రత్యక్ష స్వార్థ రాజకీయాలను ప్రతిబింబిస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలతో ఆ ఊరు ప్రజలు పడే ఇబ్బందులను, ముఖ్యంగా పిల్లలు, ఆడవాళ్లు, వృద్ధులు పడే ఇబ్బందులను కళ్లకి కట్టినట్టు చూపించారు. తమ స్వార్థం కోసం ఊరి జనం మధ్య గొడవలు పెట్టి, వారి ఎమోషన్స్ తో ఆడుకుంటూ తమ వ్యాపారాలను పెంచుకుంటున్న రాజకీయ నాయకుల నిజస్వారూపాలను ఆవిష్కరించింది ఈ చిత్రం.
మొన్నటి దాకా కామెడీతో ఆకట్టుకున్న సంపూ… ఈ చిత్రంలో మార్టిన్ లూథర్ కింగ్ పాత్రలో సంపూర్ణేష్‌బాబు యాప్ట్ గా నిలిచాడు. తనదైన అమాయకమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకున్నాడు. సంపూతో పాటు బాటా బాబుగా నటించిన కుర్రాడు కూడా ఆకట్టుకున్నాడు. ఇక సర్పంచ్ అభ్యర్థులుగా దర్శకుడు, రచయిత వెంకటేష్ మహా, సీనియర్ నరేష్ లు తమ నటనతో మెప్పించారు. ఇద్దరూ పోటీపడి పాత్రలకు ప్రాణం పోశారు. తపాలా శాఖ ఉద్యోగిగా, సంపూకి అండగా నిలిచే అమ్మాయిగా శరణ్య పాత్ర కూడా ఇందులో కీలకంగానే డిజైన్ చేశారు. ఆ పాత్రకి యాప్ట్ గా నిలిచింది శరణ్య. పెద్దాయన పాత్రలో నటించిన రాఘవన్ కూడా బాగా చేశారు. ఇతర పాత్రలు పరిధి మేరకు, సహజంగా నటించారు. గ్రామీణ రాజకీయ వాతావరణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పాత్రలు కూడా అందుకు తగ్గట్టుగానే డిజైన్ చేసుకోవడం… అందుకు తగ్గట్టుగానే నటులను ఎంపిక చేసుకోవడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయింది.
యువ దర్శకురాలు పూజ కొల్లూరు… తనకు ఇది తొలి చిత్రమైనా… ఓ పొలిటికల్ డ్రామా సినిమాను బాగా హ్యాండిల్ చేసిందని చెప్పొచ్చు. వర్తమాన రాజకీయాలను కనెక్ట్ చేస్తూ… సెటైరికల్ గా తీయడంలో ఆమె సక్సెస్ అయ్యారు. స్మరణ్ సాయి సంగీతం పర్వాలేదు. ఈ సినిమాకి దర్శకురాలే ఎడిటర్ కావడంతో ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. దీపక్ యరగెరా సినిమాటోగ్రఫీ గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కంచారు. ఇలాంటి జోనర్ సినిమాలు ఇష్టడపేవారు ఓసారి మార్టిన్ లూథర్ కింగ్ ను చూసేయొచ్చు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3