ఈ సంక్రాంతికి వినోదాల విందుని అందించడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా, శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుంచి ప్రచార చిత్రాలలో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. అసలుసిసలైన పండగ సినిమాగా 2026, జనవరి 14న థియేటర్లలో అడుగు పెట్టనుంది. మూడు వరుస ఘన విజయాల తర్వాత నవీన్ పొలిశెట్టి నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘అనగనగా ఒక రాజు’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన ట్రైలర్, ఆ ఆసక్తిని రెట్టింపు చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తాజాగా కథానాయిక మీనాక్షి చౌదరి, మీడియాతో ముచ్చటించి సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
గుంటూరు కారం, సంక్రాంతికి వస్తున్నాం, అనగనగా ఒక రాజు ఇలా వరుసగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడం ఎలా ఉంది?
చాలా చాలా సంతోషంగా ఉంది. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని సంక్రాంతి విజయాన్ని అందుకున్నాను. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకుంటాననే నమ్మకం ఉంది.
మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
ఈ సినిమాలో నా పాత్ర పేరు చారులత. సంపన్న కుటుంబంలో పుట్టిన తండ్రి గారాల పట్టి లాంటి పాత్ర. ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. చాలా మంచి అమ్మాయి. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. క్యూట్ గా బిహేవ్ చేస్తుంది. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు.
చారులత పాత్ర కోసం ఎలాంటి హోంవర్క్ చేశారు?
ఇది చాలా భిన్నమైన పాత్ర. నిజ జీవితంలో కాలేజ్ సమయంలో ఒకరిద్దరిని ఇలాంటి వారిని చూసి ఉన్నాను. డైరెక్టర్ ఇచ్చిన ఇన్ పుట్స్ ని బట్టి, నాకున్న అవగాహనను బట్టి ఈ పాత్రలో ఒదిగిపోయే ప్రయత్నం చేశాను. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. నేను ప్రాక్టికల్ గా ఉంటాను. చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్ గా ఉంటుంది.
నవీన్ గారితో కలిసి పని చేయడం ఎలా ఉంది?
నవీన్ గారితో వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్ లా ఉంది. సంక్రాంతికి వస్తున్నాంలో కామెడీ ఒకలా ఉంటే, నవీన్ కామెడీ మరోలా ఉంటుంది. పైగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా కామెడీగా ఉన్నా.. నా పాత్ర కాస్త సీరియస్ గా ఉంటుంది. కానీ, ఇందులో పూర్తిగా కామెడీగా ఉంటుంది. ఇందులో టైమింగ్ అనేది చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్ ని కరెక్ట్ టైమింగ్ లో చెప్పడం అనేది ఛాలెంజింగ్ గా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కామెడీ కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.
చారులత పాత్ర మీ కెరీర్ కి ఎంత ఉపయోగపడుతుంది.
ఇలా పూర్తిస్థాయి కామెడీ పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా వల్ల నటిగా నేను మరింత ఓపెన్ అయ్యాను. లక్కీ భాస్కర్ లోని సుమతి పాత్రకు ఈ చారులత పాత్ర పూర్తి భిన్నమైనది. దర్శకులు ఆ పాత్రలను మలిచిన తీరుకి తగ్గట్టుగా నన్ను నేను మలుచుకుంటాను. ఇందులో అద్భుతమైన కామెడీ టైమింగ్ చూస్తారు.
ఇందులో మాస్ డ్యాన్స్ నెంబర్ చేశారు కదా.. ఎలా ఉంది?
భీమవరం బాల్మా, రాజు గారి పెళ్ళిరో లాంటి క్యూట్ మాస్ డ్యాన్స్ నెంబర్స్ ఈ సినిమాలో ఉన్నాయి. సాధారణంగా నేను డ్యాన్స్ చేయడానికి సిగ్గుపడుతుంటాను. కానీ, ఈ సినిమాలో అలాంటి ఇబ్బంది కలగలేదు. చాలా సరదాగా షూట్ చేశాము. ఇందులోని ప్రతి పాట బాగా వచ్చింది.
గోదావరి ప్రాంతంలో చిత్రీకరణ అనుభూతి ఎలా ఉంది?
చాలా బాగుంది. అక్కడి ప్రజలు బాగా చూసుకున్నారు. ఎన్నో వంటకాలు తిన్నాను. ఆలయాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాను. అక్కడి ప్రజలు సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. గోదావరి ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను.
సినిమాలలో నాయిక పాత్ర ప్రాధాన్యతపై మీ అభిప్రాయం?
ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభించడం సంతోషంగా ఉంది. లక్కీ భాస్కర్ ఒక బాబుకి తల్లిగా కనిపించాను. సంక్రాంతికి వస్తున్నాంలో ఐపీఎస్ గా కనిపించాను. ఇప్పుడు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నాను. నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.
కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
నా దృష్టిలో కథే హీరో. కథ ఎలా ఉంది?, దర్శకుడు ఆ కథను, అందులోని పాత్రలను ఎలా చూపించబోతున్నారు అనేది ఆలోచిస్తాను. హీరో ఎవరనేది ముఖ్యం కాదు. కథకు, పాత్రకు ప్రాధాన్యం ఇస్తాను. ఈ పాత్ర నా కెరీర్ కి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూస్తాను.
సితార సంస్థలో ఇది మీకు మూడో సినిమా.. సితారలో వరుస సినిమాలు చేయడం ఎలా ఉంది?
సితార సంస్థ నాకు కుటుంబం లాంటిదని భావిస్తాను. సితార యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ముందు ఉంటుంది. ఆ సంస్థ నుంచి నాకు వరుస ఆసక్తికర సినిమాలు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. విభిన్న సినిమాలు, విభిన్న పాత్రలు చేస్తున్నాను. సితార బ్యానర్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉంది.
దర్శకుడు మారి గురించి?
నూతన దర్శకుడు అయినప్పటికీ, ఆయనకు ఫుల్ క్లారిటీ ఉంది. ప్రతిభగల దర్శకుడు. ఓపిక ఎక్కువ. ఏదైనా సన్నివేశంలో ఎక్కువ టేక్స్ తీసుకున్నా.. ఆయన విసుక్కోరు, నవ్వుతూనే ఉంటారు. ఓపికగా ఉంటూ నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు.
సినీ ప్రయాణం ఎలా ఉంది? సెటిల్ అయ్యాను అనుకుంటున్నారా?
నా దృష్టిలో సినీ ప్రయాణం అనేది ముగింపు లేని పరుగు పందెం లాంటిది. కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి విభిన్న పాత్రలు చేస్తూ నిరంతరం పరుగెడుతూనే ఉండాలి. నా వరకు సెటిల్ అయ్యాను, ఫలానా స్థానానికి చేరుకున్నాను లాంటి లెక్కలు ఉండవు. చేతిలో పని ఉండటం ముఖ్యమని భావిస్తాను.
తదుపరి ప్రాజెక్ట్ లు?
నాగ చైతన్య గారితో వృషకర్మ సినిమా చేస్తున్నాను. మరికొన్ని ఆసక్తికర కథలు కూడా ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి.










