‘మిత్ర మండలి’ మూవీ రివ్యూ..
నటీనటులు: ప్రియదర్శి, నిహారిక NM, వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయి, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, విటివి గణేష్, సత్య ప్రకాష్, జీవన్ రెడ్డి.. తదితరులు.
సంగీతం: RR ధృవన్
ఛాయాగ్రహణం: సిద్దార్థ్ SJ
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం – విజయేందర్ S
నిర్మాతలు: కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి, బన్నీ వాసు
జాతి రత్నాలు తర్వాత ప్రియదర్శి మళ్ళీ అలాంటి ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాతో రావడం, ఇన్నాళ్లు సోషల్ మీడియాలో మెప్పించిన నిహారిక NM ఈ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నేడు అక్టోబర్ 16న థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా రివ్యూ ఏంటో చూసేద్దాం..
కథ :
జంగిలిపట్నం అనే ఊరులో ఎన్నికలు రావడంతో ఎమ్మెల్యే టికెట్ కోసం కుల పిచ్చి ఉన్న తుట్టె కులం లీడర్ నారాయణ(విటివి గణేష్), ఫ్రీడమ్ రాజు(సత్య ప్రకాష్) పోటీ పడుతూ ఉంటారు. ఆ ఊళ్ళోనే చైతన్య(ప్రియదర్శి), సాత్విక్(విష్ణు ఓయ్), అభి(రాగ్ మయూర్), రాజీవ్(ప్రసాద్ బెహరా) నలుగురు ఫ్రెండ్స్ ఏ పనిపాట లేకుండా ఖాళీగా చిల్లర తిరుగుళ్ళు తిరుగుతూ ఉంటారు. ఓ రోజు సాత్విక్, అభి.. స్వేచ్ఛ(నిహారిక NM)ని చూసి అది నా పిల్ల, నేను లవ్ చేస్తాను అని ఇద్దరూ కొట్టుకుంటారు. అప్పట్నుంచి సాత్విక్, అభి ఆమె వెనకాలే తిరుగుతూ ఆమెని లవ్ లో పడేయాలని తెగ ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఓ రోజు ఆమె తొట్టె కులం లీడర్ నారాయణ కూతురు అని తెలిసి వాళ్ళని నారాయణ చంపేస్తాడు అని భయపడతారు. అయితే నారాయణ సడెన్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కూతురు లేచిపోయింది కానీ ఈ విషయం బయటకు రాకూడదు, నాకు ఎమ్మెల్యే టికెట్ రావాలి అని కిడ్నాప్ కేసు కింద ఎంక్వేరి చేసి కూతుర్ని వెతకమని SI (వెన్నెల కిషోర్)ని కోరతాడు. అసలు స్వేచ్ఛ కిడ్నాప్ అయిందా లేచిపోయిందా? అభి, సాత్విక్ లు స్వేచ్చకి లవ్ ప్రపోజ్ చేసారా? అసలు స్వేచ్ఛ ఎవర్ని లవ్ చేస్తుంది? ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వస్తుంది.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
కథనం – విశ్లేషణ: జాతి రత్నాలు తర్వాత ఓ ముగ్గురు లేదా నలుగురు ఫ్రెండ్స్ కలిసి చిల్లర పనులు చేయడం లాంటి కథలతో చాలానే సినిమాలు వచ్చాయి. అవన్నీ పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టే ఉంటాయి. ఈ మిత్రమండలి కూడా అదే ఫార్మేట్ లో వచ్చినా ఇది కంప్లీట్ స్పూఫ్, సెటైరికల్ కామెడీతో నడుస్తుంది. ఈ సినిమా చూసినంతసేపు అల్లరి నరేష్ సుడిగాడు సినిమా గుర్తుకు వస్తుంది. కానీ ఓ సింపుల్ కథని కాస్త ఆసక్తికర స్క్రీన్ ప్లే తో రాసుకొని సినిమా కామెడీ ప్రధానంగా తెరకెక్కించాడు దర్శకుడు.
సమాజంలో ఉండే క్యాస్ట్ ఇష్యూ మీద మాత్రం చాలా సెటైర్స్ వేశారు. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ఓ కొత్త క్యాస్ట్ పేరుని సరదాగా సృష్టించి కుల పిచ్చి ఉన్నవాళ్లు ఎలా ఉంటారు? కులం పేరుతో ప్రేమ పెళ్లిళ్లు వద్దనే వాళ్ళు ఏం చేస్తారు? కులాన్ని చూసి నడిచే రాజకీయాలు, కులాన్ని చూసి ఓట్లు వేయడాలు.. ఇలాంటి అంశాలపై గట్టిగానే సెటైర్లు వేశారు. సినిమాలో సత్య పాత్ర వచ్చినప్పుడల్లా ఇరిటేషన్ రావడం ఖాయం. ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని పెట్టి ఏదో మాటిమాటికి మధ్యలో వచ్చి వాగుతూ ఉండటంతో ఎందుకురా బాబు ఈ పాత్ర అనిపించడం ఖాయం. అసలు సత్య క్యారెక్టర్ లేకపోయినా సినిమా నడుస్తుంది కానీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పి దానికి చివర్లో సెటైరికల్ గా జస్టిఫికేషన్ ఇవ్వడం గమనార్హం.
ఎంత కామెడీగా క్యాస్ట్ ఇష్యూ మీద సీన్స్ రాసుకున్నా అవన్నీ ఆలోచింపచేస్తాయి. కొన్ని సీన్స్ బాగా సాగదీసారు. ఇవన్నీ ఎడిటింగ్ లో పోతే బాగుండు అనిపిస్తుంది.సినిమా మాత్రమే కాదు సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా పాత సినిమాల్లోవి తీసుకొని స్పూఫ్ చేసి రీమిక్స్ చేయడం గమనార్హం. మిత్రమండలి ఫుల్ గా నవ్వించదు అలా అని ఫుల్ గా బోర్ కొట్టించదు. నవ్వు వచ్చినప్పుడు నవ్వడమే
నటీనటులు: ప్రియదర్శి ఎప్పటిలాగానే తన పాత్రని బెస్ట్ ఇవ్వడానికి చిల్లర పోరడులా బాగానే నటించాడు. కొత్త అమ్మాయి నిహారిక NM సోషల్ మీడియాలో ఇన్నాళ్లు వైరల్ అయినా హీరోయిన్ గా అయితే జస్ట్ పర్వాలేదనిపించింది. విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ఫ్రెండ్ పాత్రల్లో బాగానే నటించి నవ్వించారు. కుల లీడర్ పాత్రలో విటివి గణేష్, సత్య ప్రకాష్, వెన్నెల కిషోర్, జీవన్ రెడ్డి.. నవ్వించడానికి గట్టిగా ప్రయత్నం చేసారు. వెన్నెల కిషోర్ మాత్రం ఫుల్ ఫ్రస్టేషన్ పాత్రలో మెప్పించారు. సత్య క్యారెక్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సత్య నటించినా ఆ పాత్ర అవసరం లేకుండానే పెట్టారు అనిపిస్తుంది. బ్రహ్మానందం ఓ పాత్రలో వచ్చి మెరిపించి మాయమవుతారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపిస్తారు.
సాంకేతిక వర్గం : సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇంకొంత కష్టపడాల్సింది. కొన్ని సీన్స్ ఈజీగా సెట్స్ వేసి చేసేసారు అని తెలుస్తుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పాత సినిమాల మ్యూజిక్ తో రీమిక్స్ చేసి కొత్తగా వినిపించారు. సాంగ్స్ కూడా పర్వాలేదనిపిస్తాయి. ఇలాంటి సినిమాకు డైలాగ్స్, సీన్స్, స్క్రీన్ ప్లే రాయడం కష్టమే కానీ మొదటి సినిమా అయినా డైరెక్టర్ బాగానే రాసి తెరకెక్కించాడు. ఎడిటింగ్ పరంగా కొన్ని సీన్స్ కట్ చేస్తే బాగుండేది. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
రేటింగ్: 3









