రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు (BVC) బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కించిన చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియల్ క్రైమ్’ ట్యాగ్ లైన్. మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
కథ
శ్రీరామ్ (రమణ్) ఫైనాన్స్ ఏజెంట్. వడ్డీ డబ్బుల్ని రికవరీ చేస్తుంటాడు. ఈ క్రమంలో శ్రీరామ్‌కు శత్రువులు పెరుగుతూనే ఉంటారు. భాగస్వామ్యంతో కలిసి చేస్తున్న ఈ వ్యాపారంలో శ్రీరామ్‌కు ఎప్పుడూ సమస్యలు వస్తూనే ఉంటాయి. మరో వైపు ఫేస్ బుక్ పరిచయంతో సత్య భామ (వర్షా విశ్వనాథ్)తో శ్రీరామ్ ప్రేమ వ్యవహారం సాగుతుంది. గజగంగ్ దళ్ వల్ల శ్రీరామ్, సత్య భామలు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ పెళ్లి శ్రీరామ్ కుటుంబానికి నచ్చదు. దీంతో శ్రీరామ్, సత్య వేరు కాపురం పెట్టాల్సి వస్తుంది. అంతా బాగానే ఉందని అనుకునే టైంలో శ్రీరామ్ మీద యాసిడ్ దారి జరుగుతుంది. ఈ దాడిలో శ్రీరామ్ మొహం కాలిపోతుంది. దీంతో శ్రీరామ్‌ను సత్య మరింత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ దాడి వెనుకున్న మిస్టరీ ఛేదించేందుకు శ్రీరామ్ దగ్గరి బంధువు ఎస్సై శివరాం (జెమినీ సురేష్) రంగంలోకి దిగుతారు? ఈ విచారణలో బయట పడే నిజం ఏంటి? అసలు శ్రీరామ్ మీద దాడి చేసింది ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కొన్ని సార్లు సినిమాలో చూపించిన ఘటనలే బయట సమాజంలో జరుగుతుంటాయి. అయితే ఇంకొన్ని సార్లు మాత్రం సమాజంలో జరిగే నేరాలు.. సినిమాటిక్ స్థాయిని దాటి, ట్విస్టుల్ని మించి ఉంటుంది. అలాంటి ఓ నేర ఘటనను ఆధారంగా తీసుకుని ‘మటన్ సూప్’ సినిమాను రామచంద్ర తెరకెక్కించారు. కథ ఏంటి? నేరం ఏంటి? ఎలా జరిగింది? నేరస్థుడు ఎవరు? అనేది అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ కేసు ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
అలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీతో రామచంద్ర మటన్ సూప్ సినిమాను ఆద్యంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. క్రైమ్ కథకు కాల్ మనీ ఇష్యూని కూడా జోడించాడు. ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగినా సెకండాఫ్ మాత్రం పరుగులు పెడుతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే.. ఫస్ట్ హాప్‌కి, సెకండాఫ్‌కి లింక్ సీన్లను వదులుతుంటే ఆడియెన్స్‌లో ఉత్కంఠ కూడా అలా పెరుగుతూనే ఉంటుంది. క్లైమాక్స్ వరకు అలా రన్ అవుతూనే ఉంటుంది. అయితే నిర్మాణ పరంగా మరింత సపోర్ట్ లభించి ఉంటే.. ఈ మూవీ మరో లెవెల్లో వచ్చి ఉండేది.
ఉన్నంతలో దర్శకుడు, నిర్మాతలు ఈ మూవీని మంచి క్వాలిటీ, మంచి అవుట్ పుట్‌తో ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చారు. సాంకేతికంగా ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. వెంకీ ఆర్ఆర్ ప్లస్ అవుతుంది. భరద్వాజ్, ఫణింద్ర కెమెరా వర్క్ మెప్పిస్తుంది. ఎడిటింగ్‌లో ఇంకా కొన్ని సీన్లను తీసేస్తే బాగుండనిపిస్తుంది. మాటలు, పాటలు పర్వాలేదనిపిస్తాయి. మొదటి మూవీనే అయినా మేకర్లు ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో మంచి కథను తీసుకున్నారు.
నటీనటుల విషయానికి వస్తే.. రమణ్ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. హీరోగా రమణ్ ఆకట్టుకున్నాడు. వర్ష లుక్స్ బాగుంటాయి. నటనలో మాత్రం ఇంకా మెరుగు పడాల్సి ఉంది. జెమినీ సురేష్ పాత్ర, నటన రెండూ బాగున్నాయి. మిగిలిన పాత్రల్లో వింద్ శ్రీనివాస్, శివరాజ్, ఎస్ఆర్‌కే, చరణ్, కిరణ్, గోపాల్ మహర్షి, సునీత మనోహర్, మాస్టర్ విహార్, కిరణ్ మేడసాని అందరూ చక్కగా నటించారు.
రేటింగ్:3









