రాజ్ తరుణ్ మంచి హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది. మధ్యలో వివాదాల్లో కూడా నిలిచాడు. అయినా వరుస సినిమాలు వస్తున్నాయి వచ్చినవి వచ్చినట్టే వెళ్లిపోతున్నాయి. దీంతో పెద్దగా బజ్ లేకుండానే ఈ పాంచ్ మినార్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ: కిట్టు(రాజ్ తరుణ్) ఆవారాగా తిరుగుతూ ఉంటాడు. లవర్ ఖ్యాతి(రాశిసింగ్), ఇంట్లో తండ్రి(బ్రహ్మాజీ) కిట్టుని జాబ్ తెచ్చుకొమ్మని చెప్తూనే ఉంటారు. ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడి కిట్టు ఇంట్లో జాబ్ కోసం అని గొడవపడి అయిదు లక్షలు తీసుకొని క్రిప్టో కరెన్సీ లాంటి దాంట్లో పెట్టగా అది మొత్తం ఫేక్ అని తెలుస్తుంది. దీంతో పోయిన డబ్బుల కోసం, ఖ్యాతి కోసం జాబ్ చేయాల్సి రావడంతో ఓ ఫ్రెండ్ కంపెనీలో క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అవుతాడు. క్యాబ్ డ్రైవర్ అని తెలిస్తే పరువు పోతుందని బయట మూర్తి(అజయ్ ఘోష్) అనే ఒక రౌడీ దగ్గర సెకండ్ హ్యాండ్ కార్ EMI లో తీసుకుంటాడు. ఎక్కువ కమిషన్ కోసం తనకు చెవుడు సమస్య ఉందని క్యాబ్ డ్రైవర్ ప్రొఫైల్ లో జత చేస్తాడు. ఓ రోజు ఇద్దరు క్రిమినల్స్ కిట్టు కార్ ఎక్కి ఒక చోటికి తీసుకెళ్లి కార్ లో వెనక కూర్చొనే చోటు(రవివర్మ)ని షూట్ చేసి చంపేస్తారు. కిట్టు షాక్ అయినా చెవుడు అని చెప్పాడు కాబట్టి భయపడుతూ ఏమి చూడనట్టు నటిస్తూ వాళ్ల మాటలు వింటాడు. కిట్టుని కూడా చంపేసి ఓ చోట డబ్బులు ఉన్నాయి తీసుకొని వెళ్దామని క్రిమినల్స్ మాట్లాడుకుంటారు కానీ అనుకోకుండా కిట్టు తప్పించుకొని క్రిమినల్స్ తీసుకోవాల్సిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ కారులో ఏదో ఉందని చెప్పి కృష్ణమూర్తి కార్ తెమ్మని కిట్టుని బెదిరిస్తాడు. కిట్టు ఆ డబ్బులతో ఏం చేశాడు? క్రిమినల్స్ కిట్టు కోసం వచ్చారా? అసలు ఆ కారులో ఏముంది? చోటును ఎవరు చంపారు? ఖ్యాతి – కిట్టు ప్రేమ కథ ఏమైంది? ఈ సమస్యల నుంచి కిట్టు ఎలా బయటపడ్డాడు అని తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ: రాజ్ తరుణ్ వివాదాలు, హిట్ కొట్టి చాన్నాళ్లు అవ్వడంతో అతని సినిమా వస్తున్నా పట్టించుకోవట్లేదు. ఒకవేళ సినిమా బాగున్నా ఎవరూ చూడట్లేదు. ఇలాంటి సమయంలో పాంచ్ మినార్ అని కొద్దిగా ప్రమోషన్స్ చేసి ఈ సినిమాతో వచ్చాడు. ఓపెనింగ్ లోనే చనిపోయిన ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ ఉండటంతో ఈ సినిమా ఓ మూడేళ్ళ క్రితంది అని తెలుస్తుంది.
ఫస్ట్ హాఫ్ ఒక అరగంట వరకు రొటీన్ లవ్ సీన్స్, ఫ్రెండ్స్ సీన్స్ తో బోర్ కొడుతుంది. కొన్ని సీన్స్, ఓ పాట ఎడిటింగ్ లో తీసేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇద్దరు క్రిమినల్స్ కిట్టు కార్ ఎక్కిన దగ్గర్నుంచి సినిమా కథ ఆసక్తికరంగా సాగుతుంది. అసలు వాళ్లెవరు చోటుని ఎందుకు చంపారు? కిట్టు ఎలా బయటపడతాడు అని ఒక సస్పెన్స్ తో సాగుతుంది. ఇంటర్వెల్ కి క్రిమినల్స్ ఇద్దరూ కిట్టుని వెతుక్కుంటూ రావడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే మంచి బ్యాంగ్ ఇచ్చారు.
ఈ సినిమా సెకండ్ హాఫ్ మాత్రం బాగుంది. సస్పెన్స్ క్రైం కామెడీతో సెకండ్ హాఫ్ లో కథని పరిగెత్తించారు. ఎక్కడా బోర్ కొట్టకుండా ఓ వైపు క్రిమినల్స్, ఓ వైపు కృష్ణమూర్తి, ఓ వైపు పోలీస్ కిట్టు వెనక పడటం, మరో వైపు ఖ్యాతి లవ్ సమస్య, మధ్యలో ఫ్యామిలీని కాపాడుకోవాలని.. ఇలా సీన్ సీన్ కి ఆసక్తికరంగా నెక్స్ట్ ఏం జరుగుతుందా అని స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ మెప్పించకపోయినా సెకండ్ హాఫ్ మాత్రం థ్రిల్లింగ్ గా సాగి మెప్పిస్తుంది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఊహించిచ్చు. పార్ట్ 2 ప్రకటించకపోయినా లీడ్ ఇచ్చారు. ఈ కథకు కూడా పార్ట్ 2 తీసే స్కోప్ ఉంది.
సినిమా బాగానే ఉంది కానీ రాజ్ తరుణ్ ని ఇటీవల ఎవరూ పట్టించుకోవట్లేదు కాబట్టి దీని ఫలితం ఏమవుతుందో చూడాలి. ఈ సినిమాకు ఇంకాస్త జనాల్లోకి వెళ్లి ప్రమోషన్ చేస్తే బాగుండేది. సినిమా సెకండ్ హాఫ్ మంచి టాక్ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా జనాళ్ళకి సినిమాని తీసుకెళ్తారేమో చూడాలి. రాజ్ తరుణ్ ఇప్పటికైనా బయటకు వచ్చి జనాల్లోకి వెళ్లకపోతే సినిమాలు బాగున్నా ఆడటం కష్టమే.
రాజ్ తరుణ్ ఎప్పట్లాగే రొటీన్ యాక్టింగ్ అనిపించినా సెకండ్ హాఫ్ లో మాత్రం అందరి మధ్యలో నలిగిపోతూ మనకు నవ్వు తెప్పిస్తాడు. రాశి సింగ్ కేవలం లవ్ సీన్స్, సాంగ్ వరకే పరిమితం చేసారు. లక్ష్మణ్ మీసాల బాగా నవ్విస్తాడు. నితిన్ ప్రసన్న నెగిటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ పాత్రలో బాగానే నటించాడు. బ్రహ్మాజీ, అజయ్ ఘోష్.. అక్కడక్కడా బాగానే నవ్విస్తారు. జీవా, రవివర్మ, కృష్ణతేజ, శ్రీనివాస రెడ్డి.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ మాత్రం ఒక్కసారి వినడమే కష్టం. ఇలాంటి క్రైమ్ కామెడీ కథలు గతంలో వచ్చినా ఈ సినిమాని మౌస్ & క్యాట్ రేస్ లాగా బాగా రాసుకున్నారు. ఎడిటింగ్ పరంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్, ఒక పాట కట్ చేస్తే బెటర్. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
చివరగా.. పాంచ్ మినార్ కాసేపు నవ్వించే క్రైం కామెడీ. రాజ్ తరుణ్ ఫేట్ ఈ సినిమాతో అయినా మారుతుందా చూడాలి.
రేటింగ్:2.25










