ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా నటించిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు శ్రీనాథ్ పులకురం. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరి అరుణ సమర్పణలో నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంటర్మీడియట్ టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం… టీజర్, ట్రైలర్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చేసి… ప్రేక్షకుల్లో ఓ క్యూరియాసిటీని పెంచారు చిత్రం బృందం. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: వాసు(ప్రణవ్ ప్రీతం) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటాడు. అదే కళాశాలలో కుమారి(షాజ్ఞ శ్రీ వేణున్) చదువుతూ ఉంటుంది. కుమారి కళాశాలలో చాలా అందమైన అమ్మాయి. తన దృష్టిలో పడాలని సీనియర్స్ , క్లాస్ మేట్స్, తనకి పాఠాలు చెప్పిన గురువులు కూడా తమ ప్రయత్నాలు తాము చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాసు కూడా కుమారి అంటే ఇష్టపడుతుంటాడు. ఆమెకు ప్రపోజ్ చేయాలని చేయని ప్రయత్నం ఉంటూ ఉండదు. చివరకు తోటి కుర్రాళ్ల పోటీని తట్టుకుని కుమారికి ప్రపోజ్ చేసి… తన ప్రేమను అంగీకరించేలా చేస్తారు. వీరి ప్రేమ కాస్త… ముద్దూ ముచ్చట వరకు దారి తీస్తుంది. అయితే వీరి ప్రేమ… వివాహం వరకూ వెళ్లిందా లేదా అనేదే మిగత కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలా ఉందంటే…
టీనేజ్ లవ్ స్టోరీస్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. మంచి స్టోరీ ప్లాట్ తో… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వెండితెరపై ఆవిష్కరిస్తే యూత్ బాగా కనెక్ట్ ఆవుతారు. దర్శకుడు శ్రీనాథ్ పులకురం కూడా ఇదే చేసారు. ఓ రియల్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని… టీనేజర్ల మధ్య ఏర్పడే ప్రేమ.. ఆకర్షణను తెరపై చాలా అందంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజీలో జరిగే సరదా సన్నివేశాలతో ఎంటర్ టైన్ చేశారు. కళాశాలలో విద్యార్థుల మధ్య వచ్చే సీన్లన్నీ చాలా నాచురల్ గా ఉంటాయి. తోటి విద్యార్థుల మధ్య జరిగే సంభాషణలు, సైకిళ్లలో కాలేజీలకు వెళ్లే కుర్రాళ్లు ఎలా ఉంటారు… బస్సుల్లో అమ్మాయిలు కాలేజీకి వెళ్లే సీన్స్… లైబ్రరీ సీన్స్ అన్నీ మనకు మళ్లీ కాలేజీ రోజులను గుర్తుకు తెస్తాయి. అమ్మాయిలకు లైటింగ్ కొట్టే కుర్రాళ్ల పాట్లను చాలా సహజంగా చూపించారు. అలాగే పేద ఇళ్లలో తల్లిదండ్రుల పాట్లను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇక సెకండాఫ్ లో టీనేజ్ లవ్ స్టోరీకి బ్రేక్ అప్ చెప్పేసి… తల్లి సెంటి మెంట్ ను బాగా క్యారీ చేసారు. ఇవన్నీ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి.
ఇంటర్మీడియట్ కుర్రాడిగా ప్రణవ్ ప్రీతం చాలా సహజంగా నటించారు. హీరోయిజం ఎక్కువగా ఎలివేషన్ లేకుండా… పక్కింటి కుర్రాడు ఎలా ఉంటాడో అలా సామాన్య స్టూడెంట్ గా నటించారు. అతనికి జోడీగా నటించిన ఫ్యాషన్ డిజైనర్ కం హీరోయిన్ షాజ్ఞ శ్రీ వేణున్ చాలా క్యూట్ గా పక్కింటి అమ్మాయిగా కనిపించి మెప్పించింది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఎక్కడా వల్గారిటీ లేకుండా వీరిద్దరి సీన్స్ ఉన్నాయి. సాధారణంగా టీనేజ్ లవ్ స్టోరీ అంటే… అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందనే భావన అందరికీ ఉంటుంది.. కానీ ఇందులో అలాంటిదేమీ వుండదు. చాలా క్లీన్ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. వీరిద్దరితో పాటు సహ విద్యార్థులుగా నటించిన వారూ పర్వాలేదు అనిపించారు. వీరిద్దరి తల్లిదండ్రుల పాత్రలు బాగానే తీర్చిదిద్దారు. హీరో తల్లి సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అయింది.
దర్శకుడు ఎంచుకున్న కథ… కథనాలు ఆకట్టుకుంటాయి. రియల్ ఇన్స్ డెంట్ బేస్ చేసుకుని తీసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఓ టీనేజ్ లవ్ స్టోరీని ఎంచుకుని మంచి ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. హీరో, హీరోయిన్ ను అందంగా చూపించంలోనూ… కళాశాలలో విద్యార్థుల మధ్య వచ్చే సీన్స్ ను చాలా నాచురల్ గా తెరపై చూపించడంలో సినిమాటోగ్రాఫర్ విజయం సాధించారు. సంగీతం బాగుంది. మంగ్లీపాట అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్ ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువల చాలా ఉన్నతంగా ఉన్నాయి. కాంప్రమైజ్ కాకుండా సినిమాని నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3