తిరువీర్(Thiruveer) కి నవంబర్ నెల సెంటిమెంట్ వుంది. ఎందుకంటే జార్జి రెడ్డి, మసూద సినిమాలు నవంబర్ నెలలో విడుదలై విజయం సాధించాయి. విలక్షణ నటుడిగా ఇండస్ట్రీలో పేరుతెచ్చుకున్న తిరువీర్… ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో(Pre wedding Show) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనకు సెటిమెంట్ అయిన నవంబర్ నెలలోనే విడుదలైన ఈ చిత్రం తన సెంటిమెంట్ ను మరో సారి ప్రూవ్ చేసిందో లేదో చూద్దాం పదండి.
కథ: రమేష్(తిరువీర్) ఓ గ్రామంలో ఫోటో స్టూడియో నడుపుతుంటాడు. పెళ్లిళ్లకు, ఫంక్షన్స్ కి ఫోటోలు, వీడియోలు తీస్తాడు. అదే ఊళ్ళో పంచాయతీలో సెక్రెటరీగా పనిచేసే హేమ(టీను శ్రావ్య)ని ఇష్టపడతాడు. ఆనంద్(నరేంద్ర) అనే వ్యక్తి తనకు పెళ్లి ఫిక్స్ అయిందని, గ్రాండ్ గా ఎంత ఖర్చైనా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, వీడియో తీయాలని రమేష్ వద్దకు వస్తాడు. రమేష్ ఆనంద్ – సౌందర్య(యామిని)ల ప్రీ వెడ్డింగ్ షూట్ భారీగానే చేస్తాడు. షూట్ ఫుటేజ్ ఉన్న చిప్ కాపీ పెట్టమని తన దగ్గర పనిచేసే అబ్బాయి(రోహన్ రాయ్)కి ఇస్తాడు. కానీ ఆ పిల్లాడు చిప్ పోగొడతాడు. రెండు లక్షలు పెట్టి షూట్ చేసింది పోయింది అని తెలిస్తే ఆనంద్ ఏమంటాడో అని భయపడి వాళ్ళ పెళ్లి చెడగొడితే ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో అడగరు అనుకోని హేమతో కలిసి రమేష్.. ఆనంద్ – సౌందర్య పెళ్లి చెడగొట్టే పనులు చేస్తారు. కానీ ఓ రోజు ఆనంద్ స్వయంగా వచ్చి తమ పెళ్లి ఆగిపోయింది అని చెప్పి బాధపడతాడు. ఆనంద్ – సౌందర్య పెళ్లి ఎలా ఆగిపోయింది? వాళ్ళ పెళ్లి జరుగుతుందా? ప్రీ వెడ్డింగ్ షూట్ ఫుటేజ్ ఉన్న చిప్ ఎలా పోయింది? ఆ చిప్ మళ్ళీ దొరుకుతుందా? ఆ విషయం ఆనంద్ కి తెలుస్తుందా? రమేష్ – హేమ ప్రేమ సంగతి ఏమైంది అనేది మిగతా కథ.
కథనం – విశ్లేషణ: డేటా ఉన్న ఒక చిప్ పోతే పడే ఇబ్బందులు ఏంటి అని గతంలో పలు సినిమాల్లో చూసాం. అయితే అదే మెయిన్ పాయింట్ గా తీసుకొని కామెడీగా తెరకెక్కించారు ఈ ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాని. ఇటీవల ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అని వింత వింత ఫోటోలు, వీడియోలతో జంటలు రెచ్చిపోతున్నారు. అలా ఓ వ్యక్తి తను కూడా కాబోయే భార్యతో ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయించుకుందామని వస్తే ఏం జరిగింది అని బాగా రాసుకున్నారు.
ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్ గా కాస్త ల్యాగ్ తో సాగుతుంది. అక్కడక్కడా నవ్విస్తూ వెళ్ళిపోతుంది. హీరో – హీరోయిన్ పాత్రల పరిచయాలు, వాళ్ళ లవ్ స్టోరీ కాసేపు క్యూట్ గా చూపించి ఆ తర్వాత కథ అంత కాబోయే జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చుట్టే తిరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ సీన్స్ ఫుల్ గానే నవ్విస్తాయి. పెళ్లి ఆపడానికి రమేష్ – హేమ చేసే ప్రయత్నాలు కూడా బాగానే నవ్వు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ కి నరేంద్రనే తన పెళ్లి ఆగిపోయింది అని చెప్పడంతో ఎలా అనే ఆసక్తి సెకండ్ హాఫ్ పై నెలకొంటుంది.
ఇంటర్వెల్ తర్వాత కాసేపు ఎమోషనల్ గా బాగానే నడిపించారు. ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నవ్వించే ప్రయత్నమే చేసారు. ఆ చిప్ పోయింది అనే బాధలో రమేష్ – హేమ పాట్లు పడుతుంటే అది పోగొట్టిన పిల్లాడు మాత్రం అదేమీ పట్టకుండా చేసే పనులతో కూడా బాగానే నవ్వించారు. క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, ప్రేమ, పెళ్లి ఇలాంటి అంశాలపై కామెడీగా చూపిస్తూనే అంతర్లీనంగా ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. క్లైమాక్స్ లో కూడా ఎమోషనల్ గా టచ్ చేసి చివర్లో మళ్ళీ నవ్వులతో ముగించడం బాగుంటుంది. ఈ సినిమాకు పార్ట్ 2 స్కోప్ కూడా ఉంది దర్శకుడు ఆలోచిస్తాడేమో చూడాలి.
తిరువీర్ ఎప్పట్లాగే సింపుల్ గా బాగానే మెప్పించాడు. టీనా శ్రావ్య చక్కని లుక్స్ తో క్యూట్ నటన తో ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఆనంద్ పాత్రలో చేసిన నరేంద్ర మాత్రం అందర్నీ మెప్పిస్తాడు. ఓ పక్క నవ్విస్తూనే కొన్ని ఎమోషనల్ సీన్స్ లో కూడా చక్కగా చేసి అలరించాడు. యామిని కూడా బాగానే నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ ఫుల్ గా నవ్విస్తాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ మీద ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. రియల్ లొకేషన్స్ లో తీసినా విజువల్స్ సింపుల్ గా అనిపిస్తాయి. కథకు తగ్గట్టు కొన్ని చోట్ల రిచ్ గా, మరింత క్లారిటీగా విజువల్స్ ఉంటే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగా ఇచ్చారు. పాటలు అంతంత మాత్రమే. డైలాగ్స్ బాగున్నాయి. కథ పాతదే అయినా దాన్ని కామెడీగా చెప్పడమే కాకుండా చిన్న ఎమోషనల్ టచ్ తో మెప్పించాడు దర్శకుడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్ : 3.25










