తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల సంక్షేమం, శ్రేయస్సు కోసం ఎనలేని కృషి చేస్తానని సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ స్పష్టం చేశారు. కౌన్సిల్ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏ ప్యానెల్ తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్లుగా నట్టి కుమార్ ట్రెజరర్ పోస్ట్ కు పోటీ చేస్తుండగా…ఆయన తనయుడు నట్టి క్రాంతి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని తన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టి కుమార్ మాట్లాడుతూ, కౌన్సిల్ ఎన్నికల్లో మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పోటీకి నిలబడ్డాయని, అయితే ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను తాను చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మెడిక్లెయిమ్ హెల్త్ పాలసీకి సంబంధించి మన ప్యానెల్ కు చెందిన చదలవాడ శ్రీనివాసరావు ఇదివరకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని, కోశాధికారి పోస్ట్ కు ఆయన తాజాగా పోటీ చేస్తుండటం విచిత్రంగా ఉందన్నారు. మన ప్యానెల్ వారికి భయంపట్టుకుని బండ్ల గణేష్ ని బతిమలాడుకున్నారు. గిల్డ్ వారిని బండ్ల గణేష్ నమ్మించి మోసం చేశాడు.
అలాగే ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి స్రవంతి రవికిషోర్ పోటీలో ఉన్నారని, చార్టర్డ్ అకౌంటెంట్ గా ఆయన సమర్థుడే అయినా సభ్యుల సంక్షేమ కోసం చేసే పథకాలకు ఆయన సపోర్ట్ చేయకపోగా, అడ్డుపడతారని నట్టి కుమార్ ఆరోపించారు. తనతో పాటు తన కుమారుడు పోటీ చేస్తున్నామని చెప్పారు. సభ్యుల సంక్షేమమే తమ అజెండా అని, అందుకోసం చిరంజీవి, బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్ వంటి పలువురు పెద్దల కాళ్ళు పట్టుకుని అయినా అమలు చేసి తీరుతామని ఆయన చెప్పారు. తమకు చిరంజీవి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. ఇక మన ప్యానెల్ కమిటీ ఇప్పటివరకు తప్పుడు విధానాలు అవలంభించిందని ఆయన విమర్శించారు. మెడిక్లెయిమ్ హెల్త్ పాలసీ అమలు విషయంలో తమకు కావలసిన వారికి ఒక లెక్క, వేరే వాళ్లకు ఇంకో లెక్క అన్నట్లుగా వాళ్ళు వ్యవహరించారని అన్నారు. డబ్బు లెక్కలకు ఆ కమిటీ ఆడిటింగ్ చేయించదని, దేనికి వివరణ కావాలన్నా లేక తప్పుల గురించి నిలదీయాలన్నా ఆ కమిటీ వారికి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ లను రెగ్యులర్ నిర్వహించే అలవాటే లేదని, దేనికీ అకౌంట్ బిలిటీ లేదని చెప్పారు. ఇక ప్రోగ్రెసివ్ ప్యానెల్ వాళ్లు గెలిచినా చేసేదేమి ఉండదని, రెగ్యులర్ గా సినిమాలు తీస్తూ…వాళ్ళు ఆ బిజీలో ఉండిపోతారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తంచేశారు. క్యాష్ లెస్ కార్డ్ విధానం ఇస్తామని చెప్పిన గిల్డ్ వాళ్లు దానిని ఇవ్వలేకపోయారని అన్నారు. లాస్ట్ టైమ్ తనను ఇండిపెండెంట్ గా గెలిపించారని, కోశాధికారిగా ఈ తడవ తనను గెలిపిస్తే 10 లక్షల మెడిక్లెయిమ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అమలులోకి తీసుకొస్తానని, అలాగే తగిన కార్యాచరణ ద్వారా డెత్ ఫంఢ్ రూ.10 లక్షలకు, పెన్షన్ 5 వేలకు పెంపుకు తీవ్రంగా కృషి చేసి, వాటిని కూడా అమలు పరుస్తానని చెప్పారు. ఒకవేళ తాను గెలిచిన ఆరు నెలలు లోగా వాటిని అమలులోకి తీసుకోరాలేకపోతే పదవికి రాజీనామా చేస్తానని నట్టి కుమార్ సవాల్ చేశారు. వాస్తవానికి రెండు ప్యానెల్స్ లోనూ అందరూ తనకు సన్నిహితులేనని, కానీ కౌన్సిల్ గొప్పది…సభ్యుల సంక్షేమం కోసమే తాను పోటీ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు. దాసరి శిష్యుడిగా, చిరంజీవి అభిమానిగా తాను ఎప్పటికీ తప్పు చేయనని, ఓటర్ లిస్ట్ లో దొంగ ఓట్లు ఉన్నాయని, దీనిపై విచారణ జరగాలని నట్టి కుమార్ డిమాండ్ చేశారు. గెలిచినా, ఓడినా నిర్మాతల కోసం తాను ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటానని, ఇటీవల జీవో లో ఇచ్చిన 25 పర్సెంట్ ఆక్యుపెన్సీ, 5వ షో ఘనత తనదేనని నట్టికుమార్ స్పష్టం చేశారు.









