ఇప్పటి వరకు హీరోయిన్ పాత్రలకే పరిమితమై… గ్లామర్ రోల్స్ పోషిస్తూ వస్తున్న రుహానీ శర్మ… HER(Chapter1) సినిమాతో ఓ పవర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మన ముందుకొచ్చారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఆడియన్స్ ని ఏ మాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: ఓ జంట నగర శివారు ప్రాంతంలో హత్యకు గురవుతుంది. ఆ జంట హత్యల వెనకున్న మిస్టరీని ఛేదించడానికి ఏసీపీ అర్చన ప్రసాద్(రుహానీ శర్మ) రంగంలోకి దిగుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ సమయంలో ఆమెకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ఆ సవాళ్లను, చిక్కుముడులను ఛేదించుకుంటూ వెళ్లే క్రమంలో ఈ జంట హత్యలకు తన ప్రియుడు చనిపోవడానికి కారణమైన ముఠా లింకు ఉందని గ్రహిస్తుంది. దాన్ని ఎలా కనిపెట్టగలిగిందనేదే ఈ క్రైం ఇన్వెస్టిగేషన్ కథ.
కథ… కథనం విశ్లేషణ: మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ కథలను సరైన కథ… కథనాలతో వెండితెరపై ఆవిష్కరిస్తే… ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అలాంటి కథ… కథనాలతో తెరకెక్కిందే HER మూవీ. ఇందులో జంట హత్యలు జరిగింది మొదలు… కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఏసీపీ ఆర్చన రంగంలోకి నేరుగా దిగిపోవడం… ఆ తరువాత కేసుకు సంబంధించిన క్లూస్ ను సేకరించే క్రమం… ఆమెకు ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఆసక్తికరంగానే చూపించాడు దర్శకుడు. ఆ హత్యకు దారితీసిన పరిస్థితులను కూడా మనం నిత్యం సమాజంలో చూస్తున్న అంశాన్నే బేస్ చేసుకోవడం కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అలాగే తను ఎంతో ఇష్టపడిన వ్యక్తి మరణానికి కారణమైన ముఠా ఆటకట్టించడానికి తను NIA లోకి వెళ్లాలనే లక్ష్యంతో పనిచేయడం కూడా ఓ సిన్సియర్ పోలీస్ అధికారిణి మోటివ్ ఏంటో తెలియజేస్తుంది. జంట హత్యల ఇన్వెస్టిగేషన్ నుంచి అక్రమ ఆయుధాల సరఫరా ముఠా గుట్టు రట్టు చేసే వరకు… రాసుకున్న కథ… స్ర్కీన్ ప్లే ఆద్యంతం ఆడియన్స్ ను అలరిస్తుంది. ఇలాంటి క్రైం ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే వారికి HER మూవీ బెస్ట్ ఛాయిస్.
చి.ల.సౌ. చిత్రంలో సుశాంత్ సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో హోంలీ గాళ్ గా పేరు తెచ్చుకున్న రుహానీ శర్మ… ఆ తరువాత డర్టీ హరి చిత్రంలో గ్లామర్ పాత్రలో కనిపించి కుర్రకారుకు మరింత చేరువైంది. ఇప్పుడు ఈ చిత్రంలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీస్ పాత్రలో కనిపించి మెప్పించింది. ఇది ఒకరకంగా లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఏసీపీ అర్చన ప్రసాద్ గా రుహానీ మెప్పించింది. ఆమె కొలీగ్ గా నటరాజ్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా వృత్తి ధర్మంతో పాటు… కామెడీని పండించాడు. అలాగే రుహానీ ఫియాన్సీగా నటించిన వికాస్ వశిష్ఠ కాసేపు ఉన్నా పర్వాలేదు అనిపించారు. వీరితో పాటు నటించిన రవివర్మ, రవిప్రకాశ్, బెనర్జీ, సంజయ్ స్వరూప్ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కి ప్రధానం… స్క్రీన్ ప్లే. అది ఇందులో ఎంతో గ్రిప్పింగ్ గా ఉంది. ఎక్కడా పట్టు సడలకుండా ఇన్వెస్టిగేషన్ ని పరిగెత్తించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. అలాగే ఒక క్రైం బేస్డ్ స్టోరీకి నేపథ్య సంగీతం కూడా ప్రధానం. సినిమాకి తగ్గట్టుగానే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3