బిగ్‌బాస్ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు పెంచిన నటుడు శివాజీ, చాలా కాలం తర్వాత లయతో జతకట్టి చేసిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో, శివాజీ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం నేడు (మార్చి 6) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రైమ్ కామెడీ కథాకమామిషు ఏంటో చూద్దాం.
కథా నేపథ్యం:
హార్సిలీ హిల్స్ పంచాయతీ సెక్రెటరీగా పనిచేసే శ్రీరామ్ (శివాజీ) అత్యంత నిజాయితీపరుడు. కానీ ఆయన భార్య ఉత్తర (లయ), కొడుకు బిట్టు (రోహన్) మాత్రం ఆయనకు పూర్తి భిన్నం. ఇదిలా ఉంటే, ఆ ఊరిలో అమ్మాయిల పిచ్చి ఉన్న ఎస్సై విక్రమ్ (ప్రిన్స్) ఒక గొడవ నేపథ్యంలో శ్రీరామ్ ఇంటికి వస్తాడు. అక్కడ ఉత్తరను చూసి కన్నేసిన ఎస్సైని, చిన్నపిల్లాడైన బిట్టు తన ఆట గన్‌తో అనుకోకుండా కాల్చేస్తాడు. దీంతో ఆ పోలీస్ ఆఫీసర్ అక్కడికక్కడే చనిపోతాడు. ఒక నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి తన కుటుంబం చేసిన ఈ హత్య నుండి ఎలా తప్పించుకున్నాడు? ఆ శవాన్ని మాయం చేసే క్రమంలో ఈ ఫ్యామిలీ పడ్డ ఇబ్బందులు ఏంటి? చివరకు వీరు బయటపడ్డారా లేదా? అనేదే అసలు సినిమా.
ఎలా ఉందంటే?
శివాజీ సినిమాల్లో కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఆద్యంతం వినోదాన్ని పంచుతూనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను జోడించారు. ముఖ్యంగా శివాజీ తన ఫ్యామిలీని పరిచయం చేసే విధానం, ఆ తర్వాత శవాన్ని దాచడానికి పడే కష్టాలు కడుపుబ్బ నవ్విస్తాయి.
ప్లస్ పాయింట్స్: శివాజీ-లయ జోడీ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది. ఇరవై ఏళ్ల తర్వాత కూడా వారి మధ్య కెమిస్ట్రీ మునుపటిలాగే ఉండటం విశేషం. చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌లు, ధన్‌రాజ్ పాత్రలోని వేరియేషన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ సినిమా స్థాయిని పెంచింది.
మైనస్ పాయింట్స్: అక్కడక్కడా సాగదీతగా అనిపించే సీన్లు, కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు కథా వేగాన్ని తగ్గిస్తాయి. సెకండాఫ్‌లో మరికాస్త వేగవంతమైన ఎడిటింగ్ ఉంటే బాగుండేది.
నటీనటుల ప్రతిభ:
శివాజీ తన పాత్రలో ఒదిగిపోయారు. మధ్యతరగతి తండ్రిగా, బాధ్యతగల భర్తగా ఆయన నటన సెటిల్డ్‌గా ఉంది. లయ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో అదరగొట్టే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కామెడీ సీన్స్‌లో ఆమె టైమింగ్ అదిరిపోయింది. ప్రిన్స్, ధన్‌రాజ్, అలీ, ఇమ్మాన్యుయేల్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక వర్గం:
రంజిన్ రాజ్ అందించిన నేపథ్య సంగీతం థ్రిల్లర్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. రిత్విక్ రెడ్డి కెమెరా పనితనం గ్రామీణ నేపథ్యాన్ని అందంగా చూపించింది. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఒక రెగ్యులర్ క్రైమ్ కథను వినోదాత్మకంగా మలచడంలో సక్సెస్ అయ్యారు.
చివరి మాట: మీరు వీకెండ్‌లో హాయిగా నవ్వుకుంటూ, కొంచెం థ్రిల్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’ ఒక మంచి ఛాయిస్. ఇది పక్కా టైమ్ పాస్ మూవీ!
రేటింగ్: 3/5









