తమిళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తారు. అందుకే చాలా తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదం అవుతూ ఉంటాయి. కొన్ని అక్కడ రిలీజ్ అయి… హిట్టైన తరువాత తెలుగులోకి అనువాదం అవుతుంటాయి. కొన్ని తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతూ వుంటాయి. చిన్న సినిమాలు మాత్రం.. అక్కడ రిలీజ్ అయి… మంచి టాక్ తెచ్చుకున్న తరువాత తెలుగులో విడుదలవుతుంటాయి. ఇలాంటి సినిమానే తమిళంలో ఇప్పటికే రిలీజ్ అయి… మంచి టాక్ తెచ్చుకున్న ‘రంగోలి’సినిమా… ఇప్పుడు తెలుగులోకి అనువాదం అయింది. ప్రముఖ ఫొటో జర్నలిస్ట్ కం సినిమా రివ్యూవర్ శివ మల్లాల ఈ సినిమాని తెలుగులోకి అనువాదం చేసి రిలీజ్ చేశారు. ఇందులో హమరేష్, ప్రార్థన జంటగా నటించారు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ మూవీని ముందుగా ప్రీమియర్ ను ప్రదర్శించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: పేద కుటుంబానికి చెందిన సత్యమూర్తి అలియాస్ సత్య(హమరేష్)… గాజువాకలో ఓ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్టయిర్ చదువుతూ ఉంటారు. అయితే తండ్రి మోహన్ కుమార్ గాంధీ అలియాస్ గాంధీ(ఆడుగలం మురుగదాస్) తన కుమారుణ్ని ఏదైనా కార్పొరేట్ కళాశాలలో చేర్పించి… మంచి చదువులు చెప్పించాలనుకుంటారు. ప్రభుత్వ కళాశాల నుంచి కార్పొరేట్ కళాశాలకు వెళ్లిన సత్యకు అక్కడ తోటి విద్యార్థుల నుంచి రక రకాలుగా వివక్షకు గురవుతూ ఉంటారు. అదే కళాశాలలో చదివే పార్వతి అలియాస్ పారు( ప్రార్థన) ప్రేమలో పడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడినా… సత్య మాత్రం ఎందుకో కార్పొరేట్ కళాశాలలో ఇమడలేకపోతుంటారు. మరి అలా ఇమడలేకపోయిన సత్య చివరకు తన చదువును కార్పొరేట్ కళాశాలలో కొనసాగించారా? పార్వతితో తన ప్రేమ ఎలాంటి మలుపు తీసుకుంది? తనను కార్పొరేట్ కళాశాలలో చేర్పించడానికి తన తండ్రి గాంధీ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? తదితర విషయాలను తెలుసుకోవాలంటే… సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ప్రభుత్వ కళాశాలల్లో ఉండే చదువుల మీద… అక్కడి వాతావరణం మీద తీసే సినిమాలలో సోల్ ఉంటుంది. స్టూడెంట్స్ మధ్య ఉండే రిలేషన్స్… అక్కడ జరిగే చిన్న చిన్న గొడవలు, ప్రేమలు, లెక్చరర్ల మందలింపులు, చదువుల్లో వారి ప్రోత్సహం… ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి కళాశాల జీవితంతో ముడిపడి ఉంటాయి. అలాంటి సన్నివేశాలన్నీ ‘సత్య’ సినిమాలో మనకు కనిపిస్తాయి. వాటికి కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఈ సినిమాకి హైలెట్ ఏంటంటే… ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్. సముద్రంలాంటి గవర్నమెంట్ స్కూల్ లో చదువుకునే స్టూడెంట్ ని తీసుకెళ్లి బావి లాగా ఉండే ప్రైవేట్ స్కూల్లో వేస్తే… ఆ తండ్రికి కొడుక్కి మధ్య జరిగే సంభాషణ… వారిద్దరి మధ్య వచ్చే సీన్స్ అన్నీ మన మనసుకు తాకుతాయి. కార్పొరేట్ చదువులకు లక్షలు డబ్బులు కట్టేందుకు తల్లిదండ్రులు పడే బాధలు, కష్టాలను ఇందులో చూపించారు. అలాంటి సీన్స్ అన్నీ ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా సాగిపోయినా… సెకెండాఫ్ లో ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, ఓ పేద కుటుంబం… ఓ అబ్బాయిని మంచి చదువులు చదివించాలంటే ఎంత కష్టపడాలి అనేది చాలా హృద్యంగా చిత్రీకరించారు. ఇలాంటివన్నీ సెకెండాఫ్ లో మనసును తాకుతాయి. కొంచెం స్లోగా ఉన్నా… సినిమా చాలా సరదాగా సాగిపోతుంది.
కొత్త కుర్రాడు అయినా హమరేష్ చాలా బాగా నటించారు. ఓ నిరుపేద కుటుంబానికి చెందిన యువకునిగా ఎంతో ఎమోషన్ చూపించారు. అలాగే ప్రభుత్వ కళాశాలలో చదివిన విద్యార్థి… ఉన్నట్టుండి కార్పొరేట్ కళాశాలకు వెళితే… అక్కడ తోటి విద్యార్థులతో ఎదురయ్యే సమస్యలు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడే ఓ సాధారణ కుర్రాడిగా బాగా నటించారు. అతనికి జోడీగా నటించిన ప్రార్థన కూడా చాలా క్యూట్ గా నటించింది. హమరేష్ తోటి కుర్రాళ్లు కూడా బాగా నటించారు. సాధారణంగా స్టూడెంట్స్ మధ్య వచ్చే ఇగోలు, కొట్లాటలు అన్నీ మన చుట్టూ జరుగుతున్నట్టు కనిపించేలా వీళ్లు నటించారు. అందులో మనం కూడా ఉన్నట్టు ఫీలయ్యేంతలా కుర్రాళ్లంతా నటించి ఆకట్టుకున్నారు. హమరేష్ తండ్రిగా ‘ఆడుకలం’ మరుగదాస్ చక్కగా నటించారు. ఓ ఇస్త్రీ పని చేసుకునే వ్యక్తి ఎలా ఉంటారో… అలా కనిపించి మెప్పించారు. తన కుమారుడితో వచ్చే సీన్స్ లోనూ, భార్యతో వచ్చే సన్నివేశాలు, కూతురుతో రిలేషన్, అలాగే బయటి వ్యక్తులతో వ్యవహరించే తీరు అన్నీ…. ఓ సాధారణ కుటుంబ పెద్ద ఎలా ఉంటారో అలా కనిపించారు. హమరేష్ తల్లి పాత్రలో నటించిన నటి కూడా బాగా నటించారు. అలాగే హమరేష్ అక్కగా నటించిన నటి కూడా పర్వాలేదు అనిపించింది.
దర్శకుడు వాలి మోహన్ దాస్ కుర్రాడు కావడంతో… తను చూసిన కళాశాల వాతావరణం… అక్కడ ఉండే స్టూడెంట్స్ మనస్తత్వాలు, పేదరికంలో ఉండే కుటుంబం… వారి మధ్య ఉండే ఎమోషన్స్ అన్నీ చాలా అబ్జర్వ్ చేసి ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లేలను రాసుకున్నట్టు అనిపిస్తుంది. చాలా సరదాగా… ఎమోషనల్ గా సినిమాని తీశారు. అయితే ఇందులో పెద్దగా మలుపులు, మెరుపులేమీ కనిపించవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. పాటలు పెద్దగా రిజిష్టర్ కావు. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్నీ బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. తమిళంలో ఈ సినిమాని సతీష్ నిర్మించగా… తెలుగులో శివం మీడియా బ్యానర్ లో శివ మల్లాల ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా అనువాదం చేసి… సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ వారం సరదాగా ‘సత్య’ను చూసేయండి.
రేటింగ్: 3