సత్యం రాజేష్… వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. పొలిమేర సిరీస్ తో భారీ విజయాలను సొంతం చేసుకున్న సత్యం రాజేష్… ఇప్పుడు ‘టెనెంట్’ అనే ఓ నాచురల్ కథతో మన ముందుకు వచ్చారు. మర్డర్ మిస్టరీతో తెరకెక్కిన ఈ చిత్రంతో సత్యం రాజేష్ మరో స్టెప్ ముందడుగు వేయబోతున్నారు. ఈ సినిమాని దర్శకుడు వై.యుగంధర్ తెరకెక్కించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మర్డర్ మిస్టరీ ఆడియన్స్ ను ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.
స్టోరీ: గౌతం(సత్యం రాజేష్), సంధ్య(మేఘా చౌదరి) ఇద్దరూ కొత్తగా పెళ్లైన జంట… నగరంలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకుని నివసిస్తూ ఉంటారు. గౌతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్. సంధ్య గృహిణి. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండే దంపతులు. ఉన్నట్టుండి ఓ రోజు సంధ్య శవాన్ని గౌతం తగులబెట్టి… తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఏస్తర్) స్పెషల్ గా తీసుకుని ఎంక్వైరీ మొదలు పెడుతుంది. ఈ ఎంక్వయిరీలో ఏమి తేలింది? అంతగా ప్రేమించే గౌతం.. సంధ్య శవాన్ని ఎందుకు తగులబెట్టారు? ఆమె చనిపోవడానికి కారణాలు ఏంటి? గౌతం చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ:
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలకు ప్రధానంగా ఉండాల్సింది… ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే. ఈ సినిమాలో కూడా అదే ప్రధాన ఆకర్షణ. ఎక్కడా ప్రిడిక్ట్ అనేది లేకుండా ఆడియన్స్ లో ఎంతో ఉత్కంఠ ను రేపుతూ సినిమా చివరిదాకా సాగిపోతుంది. మర్డర్ మిస్టరీని చివరిదాకా రివీల్ చేయకుండా బాగా మెయింటైన్ చేయగలిగారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ అంతా ఇంకా స్టోరీ ఏమీ రివీల్ కాకుండానే ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది. సంధ్య మరణానికి గల కారకులు ఎవరు? ఎలాంటి పరిస్థితులు ఆమె మరణానికి కారణం అయ్యాయి… అమెరికాకు వెళ్లాల్సిన గౌతమ్… కెరీర్ అన్యాయంగా ఎలా ముగిసింది.. తమ ప్రమేయం లేకుండానే ఎంతో అన్యోన్యంగా ఉండే జంట… అర్ధాంతరంగా తనువులు చాలించాల్సి వచ్చిందనేది ప్రేక్షకుల హృదయం ద్రవించేలా సినిమా క్లైమాక్స్ ను ముగించారు. నేటితరం అమ్మాయిలకు ఓ మంచి మెసేజ్ ఇస్తుంది ఈ సినిమా. పరిచయం లేని వ్యక్తులతో ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఇందులో చక్కగా చూపించారు. అమ్మాయిలకు ‘టెనెంట్’ ఓ అద్భుతమైన మెసేజ్ ఇస్తుంది.
ఎప్పటిలాగే సత్యం రాజేష్ చాలా డీసెంట్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. గతంలో చేసిన సినిమాలకు ఏమాత్రం పోలిక లేకుండా ఉండే ఓ ఎమోషనల్ పాత్రలో నటించారు. క్లైమాక్స్ లో తన మీద ప్రేక్షకులకు తప్పకుండా జాలి కలుగుతుంది. అతనికి జంటగా నటించిన మేఘా చౌదరి కూడా చాలా సాంప్రదాయ బద్ధంగా కనిపించి ఆకట్టుకుంది. ఓ డీసెంట్ ఫ్యామిలీలో అమ్మాయి ఎలా ఉంటుందో అలాంటి పాత్రను చక్కగా చేసింది. గృహిణి పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఇందులో మరో యువ జంట కూడా ఉంది. చందన పయావుల… ఇంతకు వెబ్ సిరీస్ తో అందరికీ సుపరిచితురాలే. చాలా క్యూట్ గా నటించింది. హోమ్లీగాళ్ గా కనిపించి మెప్పించింది. ఆమెకు పెయిర్ గా నటించిన భరత్ కూడా తన పాత్ర పరిధి మీరకు నటించి ఆకట్టుకున్నాడు. నెగిటివ్ రోల్ పోషించిన దిలీప్… కాసేపు చేసినా నెగిటివ్ రోల్ కు ప్రాణం పోశాడనే చెప్పొచ్చు. అతనితో పాటు నటించిన చందు, అనురాగ్, రమ్య, మేఘ్నా అంతా… తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు యుగంధర్… ఓ మెసేజ్ ఓరియంటెడ్ ప్లాట్ ను ఎంచుకొని ఈ సినిమా తీయడం వల్ల నేటి తరం అమ్మాయిలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ముఖ్యంగా మెట్రో పాలిటన్ సిటీస్ లో జీవించే అమ్మాయిలకు ఇలాంటి సినిమాలు కనువిప్పు కలిగిస్తాయి. అలాగే అపార్ట్ మెంట్ కల్చర్ లో ఎలాంటి జాగ్రత్తలతో వ్యవహిరించాలనే దాన్ని చాలా చక్కగా చూపించారు. చెడు స్నేహాలతో జీవితం ఎలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తుందనేదాన్ని ఇందులో చక్కగా చూపించారు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ బాగున్నాయి. సత్యం రాజేష్, మేఘా చౌదరి జంటను అందంగా చూపించారు. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సినిమా నిడివి కూడా రెండుగంటలలోపే ఉండటం సినిమాకి పెద్ద ప్లస్. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఇలాంటి మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ ను ఇష్టపడేవారికి ఈ వీక్ రైట్ ఛాయిస్ ఈ మూవీ.
రేటింగ్: 3