సంపూర్ణేసు బాబు సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వుంది. ఫీల్ గుడ్ కామెడీతో ఆడియన్స్ ను అలరించే నైజం తనది. అందుకే సంపూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే చాలు ప్రేక్షకులు బాక్సాఫీస్ వద్ద క్యూ కడతారు. ఇటీవల సంపూ సినిమాలు రిలీజ్ అయి చాలా కాలమే అయింది. ఇన్నాళ్లకు మళ్లీ ‘సోదరా’ వస్తున్నానంటూ ప్రేక్షకులను పలకరించడానికి వచ్చాడు. ఇందులో యువ హీరో సంజోష్ సంపూ తమ్ముడిగా నటించారు. ఇందులో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించారు. ప్రాచీ బన్సాల్, ఆరతి గుప్త వీరిద్దరి సరసన నటించారు. క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై చంద్ర చగన్లా నిర్మాణంలో మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం పదండి.
కథ: ఓ అందమైన పల్లెటూళ్లో ఎప్పుడూ ప్రతి చిన్న విషయానికి కీచులాడుతూ వుంటారు అన్నదమ్ములైన చిరంజీవి(సంపూర్ణేష్ బాబు), వపన్(సంజోష్). అయితే ఆ కీచులాటలన్నీ పాలపొంగులాంటివే. రాత్రవ్వగానే ఇద్దరూ ఒక్కటయి కలిసిమెలిసి వుంటారు. అలాంటి అన్నదమ్ములు… అమ్మాయిల విషయంలోనూ ఇద్దరూ పోటీపడి ప్రేమించడానికి ట్రై చేస్తుంటారు. ఈక్రమంలోనే పక్కింటిలో వున్న దివి(ఆర్తి గుప్తా)ని లైన్లో పెట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు చిరంజీవి. అదే సమయంలో పవన్ కూడా ఆమెను లైన్లో పెట్టడానికి ట్రై చేస్తూ చిరంజీవికి అడ్డుతగులుతుంటాడు. అసలే పెళ్లికాక ఇబ్బందులు పడుతున్న చిరంజీవి… ఎలాగైనా తమ్ముడి పవన్ తప్పించాలని వేరే ఊరికి కాలేజీ చదువులకు పంపిచేస్తాడు. దాంతో చింజీవికి లైన్ క్లియర్ అవుతుంది. అయితే పవన్ కూడా తన కాలేజీలో క్లాస్ మేట్ అయిన భువి(ప్రాచీ బన్సాల్)ను ప్రేమిస్తాడు. ఇద్దరికి ఒకరంటే ఒకరు ఇష్టం. సెలవులకు ఇంటికి వెళ్లిపోతారు ఇద్దరు. ఇంటిదగ్గర తన అన్న ప్రేమిస్తున్న దివి… తన అన్నప్రేమను రిజెక్ట్ చేసిందని తెలుసుకుని.. ఆమెను ఎలాగైనా లైన్లో పెట్టు అని రెచ్చగొడతాడు పవన్. ఈక్రమంలో దివి ఇంటికి రాత్రిపూట వెళ్లి ఆమెను ఒప్పించడానికి ట్రై చేస్తుంటే… అది దివి వాళ్ల అమ్మానాన్నలు చూసి చిరంజీవి కుటుంబంతో గొడవకు దిగుతారు. ఈక్రమంలో పవన్… దివి వాళ్ల నాన్నపై చేయి చేసుకోవడంతో ఆ ప్రేమకథ అంతటితో ముగుస్తుంది. అయితే ఎంతకూ పెళ్లికానీ చిరంజీవికి కొన్ని నాటకీయ పరిణామాల మధ్య అనుకోకుండా పవన్ ప్రేమించిన… భువితో ఎంగేజ్మెంట్ అవుతుంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలని భువి, పవన్ ప్రయత్నిస్తుంటారు. మరి వీరిద్దరూ కలిసి పెళ్లిని ఆపేశారా? ప్రేమించుకున్న పవన్, భువిల కథ చివరకు ఏమైంది? చిరంజీవికి పెళ్లి అయిందా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ.. సంపూర్ణేష్ బాబు అంటే కథ లేకపోయినా ఓ టిపికల్ కామెడీ ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే సోదరా ప్రమోషన్స్ లో ఇది తన టైపు కామెడీ సినిమాలు కాదని ఓ కథ, ఎమోషన్ ఉంటుందని ప్రమోట్ చేసారు. ఫస్ట్ హాఫ్ లో చిరంజీవి, పవన్ గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి పవన్ కాలేజీలో లవ్ స్టోరీ, చిరంజీవి దివి వెనకపడటం చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ లో కామెడీ ట్రై చేసినా అంతగా వర్కౌట్ అవ్వలేదు. కాలేజీ సీన్స్ అయితే బాగా సాగదీశారు. కాలేజీ సీన్స్, పవన్ లవ్ స్టోరీ ఇంకా బాగా రాసుకుంటే బాగుండేది.
ఇంటర్వెల్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి పెంచుతారు. ఆ ట్విస్ట్ తో సినిమా కథ గాడిలో పడుతుంది. సెకండ్ హాఫ్ ఓ పక్క కామెడీ, మరో పక్క లవ్, బ్రదర్స్ ఎమోషన్ బాగానే వర్కౌట్ చేసారు. సెకండ్ హాఫ్ బాగానే నవ్వుకోవచ్చు. మళ్ళీ క్లైమాక్స్ లో ట్విస్ట్ లు ఇచ్చి ఆసక్తిగా ముగించారు. సినిమా అంతా పూర్తి తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కాస్త రియలిస్టిక్ గా తీయడానికి ప్రయత్నించారు. కామెడీ బాగానే వర్కౌట్ అయినా అన్నదమ్ముల ఎమోషన్ ఇంకాస్త పండితే బాగుండేది.
సంపూర్ణేష్ బాబు తన టైపు కామెడీ కాకుండా రెగ్యులర్ పాత్రలో నటించడానికి ప్రయత్నించినా అక్కడక్కడా తన సినిమాల ప్రభావం కనిపిస్తుంది. సంజోష్ పక్కా తెలంగాణ కుర్రాడిగా బాగానే సెట్ అయ్యాడు. ఆర్తి గుప్తా పద్దతిగా చీరల్లో కనిపించి మెప్పించింది. ప్రాచీ బన్సాల్ క్యూట్ గా, పద్దతిగా కనిపించి నటనతో కూడా బాగానే మెప్పించింది. బాబు మోహన్ చాన్నాళ్ల తర్వాత కామెడీ పాత్రలో కాసేపు అలరించారు. గెటప్ శ్రీను అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. బాబా భాస్కర్ పాత్ర లేకపోయినా ఉన్నా ఒకటే. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే ఉన్నాయి. సినిమా అంతా పల్లెటూరు లొకేషన్స్ బాగానే చూపించారు. డబ్బింగ్ ఇంకాస్త బెటర్ గా చెప్పిస్తే బాగుండేది. కొంతమందికి ఆ డబ్బింగ్, తెలంగాణ స్లాంగ్ వర్కౌట్ అవ్వలేదు. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ తగ్గిస్తే బాగుండేది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే సాంగ్స్ పర్వాలేదనిపిస్తాయి. డైరెక్టర్ మొదటి సినిమా అయినా బాగానే తెరకెక్కించాడు. అన్నదముమ్ముల మధ్య కెమిస్ట్రీని కొత్తగా చూపించారు. నిర్మాణ విలువలవు బాగున్నాయి. ఈ వారం థియేటర్లో సరదాగా చూసేయండి.
రేటింగ్: 3