మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం “ట్రూ లవర్”. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్ పీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ తరం యూత్ ని దృష్టిలో ఉంచుకుని దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ ఓ న్యూ ఏజ్ ప్రేమకథాచిత్రంగా తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమాను యువదర్శకుడు మారుతి, సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ విడుదల చేశారు. ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీ ఈ యంగ్ జనరేషన్ ని ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: అరుణ్(మణికందన్), దివ్య(శ్రీ గౌరి ప్రియ)… ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. అరుణ్ మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. దాంతో పాటు మంచి డిజైనర్ ఆర్ట్ కూడా. ఈ ప్రతిభలను చూసే… దివ్య అరుణ్ ని ప్రేమిస్తుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. అలా క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత బలంగా పెరిగిపోతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే జీవితంలో అరుణ్ ఏదైనా బిజినెస్ చేసి సెటిల్ అయ్యి… దివ్యను పెళ్లి చేసుకోవాలనుకుంటారు. మరి అరుణ్ అనుకున్నట్టు బిజినెస్ లో సెటిల్ అయి దివ్యను పెళ్లి చేసుకున్నారా? ట్రూ లవర్స్ అయిన… వీరి మధ్య ఎలాంటి మనస్పర్దలు వచ్చాయి…? అవి ఎలా సాల్వ్ చేసుకున్నారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఒకప్పటి ప్రేమకథలు వేరు… ఇప్పుడు ప్రేమకథలు వేరు. ఈ మోడరన్ యుగం ప్రేమలన్నీ వాట్స్ ప్… ఇన్ స్టా, ఫేస్ బుక్… లైవ్ లొకేషన్, వీడియో కాలింగ్ తదితర టెక్నాలజీ మీదే ఆధారపడి… విపరితమైన పొసెసివ్ నెస్ తో కూడిన ప్రేమలే ఎక్కువ. ఒకరిమీద ఒకరికి అంత బలమైన నమ్మకాలు లేకుండా ప్రేమలో మునిగి తేలిపోతుంటారు. ప్రేమ పునాదులన్నీఈ మోడరన్ టెక్నాలజీ మీదనే ఆధారపడి ఉంటాయి. వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా… ఆ ప్రేమకు బీటలు వారడం ఖాయం. దాంతో ఒకరినొకరు పొద్దుకు నాలుగు సార్లు బ్రేకప్ చెప్పుకోవడం… మరో నాలుగు సార్లు సారీ చెప్పుకుని… నిత్యం తగువులతో మళ్లీ ఒక్కటి కావడం చూస్తుంటాం. ఇలాంటి న్యూ ఏజ్ లవర్స్ మధ్య ఉన్న బాండింగ్ నే దర్శకుడు మెయిన్ పాయింట్ గా తీసుకుని… స్క్రీన్ ప్లేను యూత్ ఆకట్టుకునేలా తెరమీద చూపించారు. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఈ కాలపు ప్రేమజంటలు రోజూ ఏ విధంగా అయితే పొసెసివ్ నెస్ తో ఒకరినొకరు రిస్ట్రిక్ట్ చేసుకుంటూ జీవిస్తుంటారో… అదే ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు… మన చుట్టూ జరుగుతున్న ప్రేమికుల కథలానే ఫీలయి చూస్తాం. చాలా నాచురల్ గా కథ… కథనాలను నడిపించారు దర్శకుడు. ఎక్కడా బోరింగ్ లేకుండా సరదాగా ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీని చూసేయ్యొచ్చు.
అరుణ్ పాత్రలో మణికందన్… ఈ జనరేషన్ యువకుని పాత్రలో ఒదిగిపోయి నటించారు. ఓ సాధారణ కుర్రాడు తన ప్రేయసిపట్ల ఎలాంటి పొసెసివ్ నెస్ తో ఉంటారో… అలాంటి యువకునిగా మెప్పించాడు. దివ్య పాత్రలో నటించిన శ్రీ గౌరి ప్రియ కూడా మోడరన్ థాట్స్ ఉన్న అమ్మాయి పాత్రలో ఆకట్టుకుంటుంది. తన ప్రియుడు పెట్టే రిస్ట్రిక్షన్స్ కి ఈ కాలపు అమ్మాయిలు ఒకానొకదశలో ఎలా వెక్స్ అయిపోయి ప్రవర్తిస్తారో… అలాంటి పాత్రను శ్రీగౌరి చాలా ఈజ్ తో క్యారీ చేసిందని చెప్పొచ్చు. ఇన్ స్టా ఇన్ ఫ్యూయెన్సర్ గా మదన్ పాత్రలో నటించిన కన్న రవి కూడా మోడరన్ అబ్బాయిగా కనిపించి మెప్పించారు. నేటితరం యువతీయువకులు ఎలా ఆలోచిస్తారనే దాన్ని అతని పాత్రలో చూపించారు. అతని స్నేహితులుగా నటించిన వారు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రాసుకున్న ఈ జనరేషన్ లవ్ స్టోరీ చాలా మోడరన్ గా ఉంది. పొసెసివ్ నెస్ తో ఇబ్బంది పడే ప్రేమికులు చూడాల్సిన సినిమా ఇది. ఇద్దరు ప్రేమికుల మధ్య ప్రధానంగా ఎక్కడా క్లాషెస్ వస్తాయనేదాన్ని బాగా స్టడీ చేసి… ఈ సినిమాని తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా కథ వస్తువుకు ఎంత మాత్రం డ్రామా అవసరమో అందుకు తగ్గట్టుగానే స్క్రీన్ ప్లే రాసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పెద్దగా రిజిస్టర్ కావు కానీ… ట్రిప్పు అనే బీట్ మాత్రం కాసేపు అలరిస్తుంది. అలాగే ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఈ వారం ఈ సినిమా ట్రూ లవర్స్ కి మంచి అనుభూతినే ఇస్తుందని చెప్పొచ్చు. సో.. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3