ప్రతి మనిషికి ఏదో ఒక లోపం గానీ… డిజార్డర్ గానీ ఉండే పాత్రల్లో ఆ మధ్య పెద్ద హీరోలే కనిపించారు. గుంటూరు కారంలో మహేష్ బాబు ఒక కన్ను సరిగా కనిపించని పాత్రను… గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ నత్తి ఉన్న యువకుని పాత్రలోనూ, విజయ్ దేవరకొండ కూడా లైగర్ లో ఇంచు మించు ఇలాంటి పాత్రలో కనిపించారు. ఇప్పుడు నూతన నటుడు వంశీ తుమ్మల మెల్లకన్ను ఉన్న యుకుడిగా ‘శ్రీ చిదంబరం గారు’గా మన ముందుకు వచ్చారు. అతనికి జంటగా సంధ్యా వశిష్ట నటించారు. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గో పాలకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మెల్లకన్ను పాత్రలో శ్రీ చిదరంబరం గారు ఎలా ఎంటర్టైన్ చేశారో చూద్దాం పదండి.
కథ: గోదావరి తీర ప్రాంతానికి చెందిన సోలమన్(వంశీ తుమ్మల)కి మెల్లకన్ను ఉంటుంది. దాంతో అతన్ని ఊర్లోవాళ్లంతా చిదంబరం అని పిలుస్తూ… ఎగతాళి చేస్తుంటారు. ఆ అవమానం భరించలేక చిన్నప్పుడు స్కూల్ కి వెళ్లడమే మానేస్తాడు. అంతేకాదు తన లోపాన్ని కప్పిపుచ్చుకోవడానికి కళ్లజోడుతో కవర్ చేస్తుంటాడు. తండ్రి చేసిన అప్పులు తీర్చడానికి మేస్త్రీ పనికి వెళ్తుంటాడు. అదే గ్రామానికి చెందిన లీలా(సంధ్య వశిష్ట)కి చిదంబరం అంటే చాలా ఇష్టం. కానీ, తనకున్న లోపం కారణంగా లీలా తనను ఇష్టపడదనే భయంతో చిందబరం.. ఆమెకు దూరంగా ఉంటుంటాడు. ఒక చిన్న అపార్థం కారణంగా లీలా తనను తిరస్కరించిందని భావించి సోలమన్.. ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? చిదంబరం తనను అపార్థం చే సుకున్నాడనే విషయం తెలిసిన తర్వాత లీలా ఏం చేసింది? కళ్లజోడు వెనుకాల బతికే పోలమన్.. చివరకు ఆ కళ్లజోడుని తీసి.. ధైర్యంగా ప్రపంచాన్ని ఎలా చూశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని బలంగా మార్చుకుంటే.. ధైర్యంగా జీవించొచ్చు అని సాటిచెప్పే కథ ఇది. దర్శకుడు వినయ్ రత్నం సింపుల్ పాయింట్ని ఎంచుకొని దానికి బలమైన ఎమోషన్స్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శారీరకలోపం ఉన్నవాళ్లని సమాజం ఎలా అవమానిస్తుంది? వారు ఎదుర్కొనే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. మెల్లకన్ను కారణంగా సోలమన్కి స్కూల్లో జరిగిన అవమానాన్ని చూపిస్తూ.. చాలా ఎమోషనల్గా సినిమాను ప్రారంభించాడు దర్శకుడు. సోలమన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని పరిచయం చేసి.. ఆ తర్వాత అసలు కథను ప్రారంభించాడు. లీలా-సోలోమన్ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఒకవైపు లీలా-సోలోమన్ల లవ్ స్టోరీని నడిపిస్తూనే.. మరోవైపు గోదావరి తీర ప్రాంతపు పల్లెటూరి ప్రజల జీవనశైలీని చాలా సహజంగా చూపించారు. ఇంటర్వెల్ సీన్తో కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం.. సోలమన్ తనకున్న లోపాన్ని సరిదిద్దుకునేందుకు చేసే ప్రయత్నం చుట్టూనే కథనం తిరుగుతుంది. మతం పేరుతో చేసే మోసాలను కూడా ఈ సినిమా చక్కగా చూపించారు. అయితే ఆయా సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. అలాగే హీరోలో వచ్చే మార్పుకు గల కారణం కూడా బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్లో ఇచ్చే సందేశం బాగుంది.
ఈ సినిమాలో మెయిన్ లీడ్ పోషించిన వంశీ తుమ్మల, సంధ్యకి ఇది తొలి చిత్రమే అయినా చక్కగా నటించారు. మెల్లకన్ను ఉన్న యువకుడి పాత్రలో వంశీ తుమ్మల ఒదిగిపోయాడు. ఇక ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి లీలాగా సంధ్య వశిష్ట తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తల్లిగా కల్పలత, హీరోయిన్ తల్లిగా తులసి మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
అక్షయ్ రామ్ పోడిశెట్టి సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. గోదావరి తీర ప్రాంతంలో ఉండే అందాలను తెరపై అందంగా చూపించాడు. చందు-రవి సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చక్కగా కుదిరింది. ఎం. ఎం. కీరవాణి ఆలపించిన ‘వెళ్లే దారిలోన’ పాట ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు చాలా క్వాలిటీగా ఉన్నాయి. ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతలు సినిమాను నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3










