ప్రేమికుల దినోత్సవం కానుకగా నేడు(ఫిబ్రవరి 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫంకీ’ చిత్రం, థియేటర్లలో నవ్వుల వర్షం కురిపిస్తూ, అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది.
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందిన చిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలో కయాదు లోహర్ కథానాయిక.
విశ్వక్ సేన్, అనుదీప్ కలయికలో తొలి చిత్రం కావడంతో పాటు, ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకోవడంతో.. భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 13న థియేటర్లలో అడుగుపెట్టింది ‘ఫంకీ’ చిత్రం. ఆద్యంతం వినోదభరితంగా సాగిన ఈ సినిమా, ప్రేక్షకులను రెండు గంటల పాటు నవ్వుల్లో ముంచెత్తింది. అందుకే మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఫంకీ’ చిత్ర బృందం సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించి.. తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ..”సినిమా విడుదలకు ముందు ఒత్తిడి ఉండటం సహజం. కానీ నేను ఫంకీ విడుదలకు ముందు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఉదయం శ్రీరాములు థియేటర్ లో ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాను. అందరూ థియేటర్ లో ఎంతగానో ఎంజాయ్ చేశారు. కుటుంబంతో కలిసి హాయిగా నవ్వుకునేలా అనుదీప్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఫంకీ చిత్రం నాకెంతో ఊరటనిచ్చింది. అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. నా సినీ ప్రయాణంలో ఫంకీ లాంటి సినిమా చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.” అన్నారు.
కథానాయిక కయాదు లోహర్ మాట్లాడుతూ..”ప్రేక్షకులతో కలిసి ఉదయం ఫంకీ సినిమా చూశాము. ప్రేక్షకులు ప్రతి జోక్ ని ఎంజాయ్ చేస్తూ నవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మా సినిమాపై ఇంతటి ప్రేమ కురిపిస్తున్న ప్రేక్షకులకు కృతఙ్ఞతలు.” అన్నారు.
దర్శకుడు అనుదీప్ కె.వి. మాట్లాడుతూ..”కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేసేలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనే ఉద్దేశంతో ‘ఫంకీ’ సినిమా చేశాము. సినిమాలో కామెడీతో పాటు ప్రేమ కథ, భావోద్వేగాలు కూడా బాగా పండాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల సంతోషంగా ఉంది.” అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..”ఫంకీ సినిమా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకునేలా ఉంటుందని ముందునుంచీ చెబుతూ వచ్చాము. మా నమ్మకం నిజమై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇది కేవలం ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. ఆ విషయంలో మేము విజయం సాధించాము. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫోన్ చేసి సినిమా బాగుంది అన్నారు. కామెడీ బాగుంది, అలాగే సెకండ్ హాఫ్ లో మదర్ ఎమోషన్ పండిందని చెబుతున్నారు. ప్రేక్షకులంతా థియేటర్లకు వెళ్ళి, సినిమా చూడండి. మీ టికెట్ డబ్బులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నవ్వుకోడానికి థియేటర్ కి రండి.. అసలు నిరాశచెందరు.” అన్నారు.










