సమాజంలో మగాళ్ల కష్టాలను సీరియస్‌గా కంటే ఎక్కువగా కామెడీ కోణంలోనే చూస్తుంటారు. వెండితెరపై కూడా ఇలాంటి కథలు అరుదుగానే వస్తాయి. టీజర్, ట్రైలర్లతో ‘భార్యాబాధితుల కథ’ అని హింట్ ఇచ్చిన ‘పురుషః’ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
గోవింద్ (పవన్ కళ్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్ కుమార్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. గోవింద్‌ది ప్రేమ వివాహం కాగా, మిగిలిన ఇద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెళ్లైన కొత్తలోనే చాలా ఇళ్లల్లో జరిగే చిన్న చిన్న గొడవలు, అనుమానాలతో వీరి కాపురం సాగుతుంటుంది. ఇలాంటి టైమ్‌లో ఈ ముగ్గురు దోస్తులు తమ చిన్ననాటి మిత్రుడు కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్ళికి వెళ్తారు.
అక్కడ అనుకోకుండా కిస్సు రాసుకున్న ఒక పర్సనల్ డైరీ ఈ ముగ్గురి భార్యల చేతికి చిక్కుతుంది. అందులో వీరి గతానికి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ చదివి భార్యలు షాక్ అవుతారు. ముఖ్యంగా గోవింద్‌కు గతంలో రోజీ (గ్యాబి రాక్) అనే అమ్మాయితో లవ్ స్టోరీ ఉందనే నిజం భార్య కమలకు తెలుస్తుంది. దీంతో ఈ ముగ్గురి భార్యలు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు. ఆ డైరీలో అంతగా ఏం రాసి ఉంది? ఈ చిన్న కారణానికే కోర్టు దాకా వెళ్లిన ఈ జంటలు చివరకు ఎలా కలిశారు? అనేదే మిగతా సినిమా.
విశ్లేషణ – స్క్రీన్‌ప్లే ఎలా ఉందంటే?
దర్శకుడు వీరు ఉలవల ఈ సినిమాను నాన్-లీనియర్ స్క్రీన్‌ప్లేతో నడిపించారు. ఫస్టాఫ్‌లో ముగ్గురు స్నేహితుల పరిచయం, పెళ్లయ్యాక భార్యల వల్ల వారు పడే ఇబ్బందులను కామెడీగా చూపించారు. అయితే, కోర్టు సీన్లు, భార్యాభర్తల మధ్య గొడవలతో కథనం కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ లో డైరీ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. సెకండాఫ్‌లో ఎక్కువ భాగం హీరో ఫ్లాష్‌బ్యాక్ ప్రేమకథతో ఎమోషనల్‌గా, క్యూట్‌గా సాగుతూ.. చివరకు రొటీన్ కోర్టు క్లైమాక్స్‌తో ముగుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
వెన్నెల కిషోర్, కసిరెడ్డి రాజ్‌కుమార్ ల కామెడీ టైమింగ్.
పమ్మి సాయి ‘హౌస్ హస్బెండ్’ ఎపిసోడ్ (నవ్విస్తూనే ఆలోచింపజేసేలా ఉంటుంది).
భార్యాభర్తల మధ్య అనుమానాలు, చెప్పుడు మాటలు ఎలాంటి నష్టాన్ని తెస్తాయో చూపించిన విధానం.
మైనస్ పాయింట్స్:
కాలేజీ రోజుల్లో చేసే చిన్న చిన్న చిలిపి పనులకే విడాకుల దాకా వెళ్లడం అంత కన్విన్సింగ్‌గా అనిపించదు.
మగాళ్ల కష్టాలను కేవలం కామెడీ కోణంలోనే చూపిస్తూ, ఎమోషనల్ టచ్ మిస్ చేయడం.
క్లైమాక్స్ ట్విస్ట్ ఊహించేలా ఉండటం, ముగింపును చాలా సిల్లీగా తేల్చేయడం.
కొన్ని సీన్లలో భార్యల ఓవర్ యాక్షన్ బోర్ కొట్టిస్తుంది.
సినిమా చూస్తున్నంత సేపు మనకు గతంలో వచ్చిన ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘F2’ వంటి చిత్రాల ఛాయలు గుర్తుకు వస్తాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్:
కొత్తవాడైనప్పటికీ హీరో పవన్ కళ్యాణ్ తన పాత్రకు న్యాయం చేయడానికి గట్టిగానే ప్రయత్నించాడు. ఎమోషనల్ సీన్స్‌లో పర్వాలేదనిపించాడు. వెన్నెల కిషోర్, కసిరెడ్డి రాజ్ కుమార్ తమ మార్క్ కామెడీతో థియేటర్‌లో నవ్వులు పూయించారు. సప్తగిరి, విటివి గణేష్, పమ్మి సాయి అక్కడక్కడా నవ్వించారు. భర్తలను వేధించే భార్యలుగా రాయంచ, హాసిని, విషిక బాగానే సెట్ అయ్యారు. ఫ్లాష్‌బ్యాక్‌లో బ్రెజిల్ నటి గ్యాబి రాక్ క్యూట్‌గా నటించి మెప్పించింది. హరితేజ, అనైరా గుప్తా గెస్ట్ రోల్స్ పర్వాలేదు.
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల అందించిన విజువల్స్ చాలా రిచ్‌గా, బాగున్నాయి.
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ పాటలు యావరేజ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని సీన్లలో అంతగా సెట్ అవ్వలేదు.
ఎడిటింగ్: సెకండాఫ్‌లో ల్యాగ్ సీన్స్‌ను కాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్పీగా ఉండేది.
దర్శకత్వం: భర్తల కష్టాలనే మంచి కాన్సెప్ట్ తీసుకున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే లో దర్శకుడు కొంచెం తడబడ్డాడు. నిర్మాణ విలువలు మాత్రం కథకు తగ్గట్టుగా బాగున్నాయి.
బాటమ్ లైన్:
‘పురుషః’.. భార్యాబాధితుల కష్టాలను చూసి, లాజిక్కులు పక్కన పెట్టి కాసేపు సరదాగా నవ్వుకోవడానికి ట్రై చేయొచ్చు!
రేటింగ్ : 3 / 5









