‘బేబీ’తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న జోడీ ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటించిన సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ‘90s – A Middle Class Biopic’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ ఈ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఇది లండన్ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ లవ్ స్టోరీ. ప్రేమ, రిలేషన్‌షిప్, వ్యక్తిగత స్వేచ్ఛ, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు వంటి అంశాలను నేటి యువతకు కనెక్ట్ అయ్యేలా ఎలా తెరకెక్కింది అనేది రివ్యూలో చూద్దాం పదండి.
కథ
వనపర్తికి చెందిన ఓ సాధారణ మిడిల్ క్లాస్ కుర్రాడు ఆదిత్య(ఆనంద్ దేవరకొండ)చదువు కోసం యూకే వెళ్తాడు. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన కాస్త రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి కడలి(వైష్ణవి చైతన్య) కూడా యూకేలో ఉంటుంది. అక్కడ వీరిద్దరి పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది.
ప్రేమలో పడిన తర్వాత వారి మధ్య ఏర్పడే అనుబంధం, రొమాన్స్, లివింగ్ రిలేషన్, చిన్న చిన్న గొడవలు, అపార్థాలు, ఒకరిపై ఒకరికి ఉండే అంచనాలు కథలో ప్రధానంగా కనిపిస్తాయి. అదే సమయంలో ఉద్యోగం, కుటుంబం, భవిష్యత్తు గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలు వారి రిలేషన్‌షిప్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదే సినిమా అసలు పాయింట్.
ఫస్టాఫ్ ఎలా ఉంది?
సినిమా ఫస్టాఫ్ ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేస్తుంది. లండన్ లొకేషన్స్, హీరో–హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్ సన్నివేశాలు, ఫన్ ఎలిమెంట్స్‌తో కథను ముందుకు తీసుకెళ్లారు.
ఆదిత్య, కడలి మధ్య జరిగే సంభాషణలు సహజంగా ఉంటాయి . సాధారణంగా ప్రేమికుల మధ్య ప్రైవేట్‌గా జరిగే కొన్ని చర్చలను ఓపెన్‌గా చూపించడం సినిమాలో కొత్తగా అనిపించే అంశాల్లో ఒకటి.
సెకండాఫ్
ఇంటర్వెల్ తర్వాత సినిమా కేవలం ప్రేమకథగా కాకుండా రిలేషన్‌షిప్, కుటుంబం, బాధ్యతలు, జీవితంలో తీసుకునే నిర్ణయాలు వంటి అంశాల వైపు వెళ్తుంది.
ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు యువతతో పాటు తల్లిదండ్రులను కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఫోన్ కాల్ సన్నివేశాలు, భావోద్వేగ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి.
క్లైమాక్స్ విషయంలో దర్శకుడు సంప్రదాయ ముగింపునకు భిన్నంగా ఓపెన్ ఎండింగ్ తరహా ట్రీట్‌మెంట్ ఇవ్వడం వలన ఇది సినిమాకు ప్రత్యేకమైన అంశంగా నిలుస్తుంది.
నటీనటుల నటన
ఆనంద్ దేవరకొండ
ఆదిత్య పాత్రలో ఆనంద్ దేవరకొండ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో అతని పెర్ఫార్మెన్స్ బాగుంది. ‘బేబీ’ తర్వాత వైష్ణవితో మరోసారి కనిపించడంతో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
వైష్ణవి చైతన్య
కడలి పాత్రలో వైష్ణవి చైతన్య మరోసారి తన నటనతో మెప్పించింది. బయటకు సరదాగా, ధైర్యంగా కనిపించినప్పటికీ లోపల ఎన్నో భయాలు, బాధ్యతలు ఉన్న అమ్మాయి పాత్రలో ఆమె పెర్ఫార్మెన్స్ సహజంగా ఉంటుంది.
ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తల్లి తల్లిదండ్రులుగా నటించిన నటుడు శివాజీ, వాసుకి పాత్రలు చాలా న్యాచురల్ గా ఉన్నాయి. గవిరెడ్డి ఎప్పటిలాగే నవ్వించాడు. ఆనంద్ దేవరకొండ స్నేహితుడు కూడా బాగా ఆకట్టుకున్నాడు.
సాంకేతిక విభాగం
దర్శకుడు ఆదిత్య హాసన్ కథను నేటి యువతకు దగ్గరగా ఉండేలా రియలిస్టిక్ అప్రోచ్‌లో చెప్పే ప్రయత్నం చేశారు. ‘90s’ సిరీస్‌లో కనిపించిన సహజమైన హాస్యం, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌కు భిన్నంగా ఈసారి లవ్, రిలేషన్‌షిప్ అంశాలను ఎంచుకుని సక్సెస్ అయ్యారు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఎడిటింగ్ బాగుంది.
లండన్ లొకేషన్స్ కూడా సినిమాకు మంచి విజువల్ ఫీల్ తీసుకొచ్చాయి. సితార ఎంటర్ టైన్మెంట్ ప్రొడక్షన్స్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య కెమిస్ట్రీ
యూత్‌కు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ
లండన్ లొకేషన్స్
సహజమైన రిలేషన్‌షిప్ డైలాగ్స్
సెకండాఫ్‌లో భావోద్వేగ సన్నివేశాలు
మ్యూజిక్, BGM
కొత్త తరహా క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడా ల్యాగ్
అన్ని కామెడీ సన్నివేశాలు వర్కౌట్ కాకపోవడం
లవ్ స్టోరీలో కొన్ని అంశాలు ఇప్పటికే చూసినట్టుగా అనిపించడం
ఫైనల్‌గా..
‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ పూర్తిగా కొత్త కథ కాకపోయినా, నేటి యువత రిలేషన్‌షిప్స్‌ను రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసిన లవ్ డ్రామా. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కెమిస్ట్రీ, లండన్ బ్యాక్‌డ్రాప్, హిషామ్ మ్యూజిక్, సెకండాఫ్‌లోని ఎమోషనల్ సీన్స్ సినిమాకు బలం.
ఫస్టాఫ్‌లో యూత్‌ను ఎంటర్‌టైన్ చేసే సన్నివేశాలు ఉండగా, సెకండాఫ్‌లో ప్రేమతో పాటు బాధ్యతలు, కుటుంబం, జీవిత నిర్ణయాలపై ఆలోచింపజేసే ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా ‘బేబీ’ తర్వాత ఈ జంటను మళ్లీ తెరపై చూడాలనుకునే ప్రేక్షకులకు ‘ఎపిక్’ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
ట్యాగ్‌లైన్:
“ప్రేమను కొత్త కోణంలో చూపించిన యూత్‌ఫుల్ జర్నీ.. ఆనంద్–వైష్ణవి కెమిస్ట్రీ ‘ఎపిక్’!”
రేటింగ్: 3.25/5









