సుడిగాలి సుధీర్‌కు మరో కొత్త ప్రయత్నం.. దివ్యభారతి నటన, కామెడీ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణ!
నటీనటులు: సుధీర్ ఆనంద్, దివ్యభారతి, నితిన్ ప్రసన్న, మొట్టా రాజేంద్రన్, బ్రహ్మాజీ, సర్వదమన్ బెనర్జీ, ఆనంద్ రామరాజు తదితరులు
దర్శకత్వం: వేదవ్యాస్ ఆకుల
నిర్మాత: మొగుళ్ల చంద్రశేఖర్
సంగీతం: మణిశర్మ, లియోన్ జేమ్స్
ఛాయాగ్రహణం: రసూల్ ఎల్లోర్
జానర్: యాక్షన్ కామెడీ
బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్, వెండితెరపై మాస్ హీరోగా తన సత్తా చాటుకునే ప్రయత్నంలో భాగంగా నటించిన చిత్రం ‘గోట్’ (GOAT). దివ్యభారతి తెలుగు తెరకు పరిచయమవుతున్న ఈ సినిమాకు వేదవ్యాస్ ఆకుల దర్శకత్వం వహించారు. యాక్షన్, కామెడీ, ప్రేమ, గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలను కలిపి రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందించిందో చూద్దాం పదండి.
కథ
మొద్దు బాబ్జీ (నితిన్ ప్రసన్న) రుద్రవరం గ్రామాన్ని జూదం, బెట్టింగ్‌లకు కేంద్రంగా మారుస్తాడు. ఈ వ్యసనాలకు బానిసలైన గ్రామస్తులు అప్పుల ఊబిలో చిక్కుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
మరోవైపు విశాఖపట్నంలో రౌడీగా తిరుగుతూ, బెదిరింపులతో డబ్బులు సంపాదించే సర్ (సుధీర్ ఆనంద్) అనుకోకుండా సుభాషిణి (దివ్యభారతి)ని కిడ్నాప్ చేస్తాడు. ఆమె పరిచయం సర్ జీవితంలో మార్పుకు కారణమవుతుంది. రుద్రవరం గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న అతను వారికి అండగా నిలవాలని నిర్ణయించుకుంటాడు. అసలు సర్ గతం ఏమిటి? రుద్రవరం గ్రామంతో అతనికి ఉన్న సంబంధం ఏంటి? బెట్టింగ్ మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడు? అనేవి మిగతా కథాంశం.
కథనం – విశ్లేషణ
దర్శకుడు వేదవ్యాస్ ఆకుల గ్రామీణ నేపథ్యంలో సాగే బెట్టింగ్ మాఫియా కథకు కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌ను జోడించి తెరకెక్కించారు. కథలో సామాజిక అంశాన్ని కూడా అంతర్లీనంగా చూపించడం మంచి ప్రయత్నం. ముఖ్యంగా బెట్టింగ్, జూదం కారణంగా సాధారణ కుటుంబాలు ఎదుర్కొనే సమస్యలను కథలో భాగం చేయడం ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్‌లో సుధీర్, అతని స్నేహితుల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు వినోదాన్ని అందిస్తాయి. హీరోయిన్ పరిచయం, హీరో జీవితంలో వచ్చే మార్పులు కథకు ఆసక్తిని జోడిస్తాయి. సుధీర్ కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ తనదైన శైలిని చూపించారు.
సెకండ్ హాఫ్‌లో కథలోని అసలు నేపథ్యం, హీరో గతం, గ్రామంతో అతనికి ఉన్న సంబంధం బయటపడతాయి. ఎమోషనల్ సన్నివేశాలు, మాస్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో కథ ముందుకు సాగుతుంది. క్లైమాక్స్‌లో స్నేహితుల గ్యాంగ్ చేసే హడావుడి వినోదాన్ని అందిస్తుంది. కొన్ని సన్నివేశాలు ముందుగానే ఊహించేలా ఉన్నప్పటికీ, కామెడీ, యాక్షన్ కలయికతో సినిమా ప్రేక్షకులను కొంతవరకు అలరిస్తుంది.
నటీనటుల నటన
సుడిగాలి సుధీర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. తనకు బాగా అలవాటైన కామెడీ టైమింగ్‌తో పాటు మాస్ యాక్షన్ సన్నివేశాల్లోనూ మెప్పించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా స్నేహితులతో కలిసి కనిపించే సన్నివేశాల్లో ఆయన ఎనర్జీ బాగుంటుంది. హీరోగా తన పరిధిని విస్తరించుకోవాలనే ప్రయత్నం కనిపిస్తుంది.
దివ్యభారతి సుభాషిణి పాత్రలో చక్కగా నటించారు. డీ-గ్లామరస్ లుక్‌లో కనిపిస్తూ భావోద్వేగ సన్నివేశాల్లో మంచి అభినయం ప్రదర్శించారు. సుధీర్‌తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. వీరిద్దరిపై చిత్రీకరించిన పాటలు తెరపై చూడముచ్చటగా ఉన్నాయి.
మొట్టా రాజేంద్రన్ తనదైన కామెడీతో కొన్ని సన్నివేశాల్లో నవ్వులు పూయించారు. బ్రహ్మాజీ తన పాత్రకు న్యాయం చేశారు. నితిన్ ప్రసన్న ప్రతినాయకుడిగా ఆకట్టుకోగా, సర్వదమన్ బెనర్జీ, ఆనంద్ రామరాజు తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు వేదవ్యాస్ ఆకుల యాక్షన్, కామెడీ, గ్రామీణ నేపథ్యాన్ని కలిపి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ను అందించే ప్రయత్నం చేశారు. కథలో కొత్తదనం కొంత పరిమితంగా ఉన్నప్పటికీ, ప్రేక్షకులను అలరించే సన్నివేశాలను రూపొందించారు.
రసూల్ ఎల్లోర్, సన్నీ కొరపాటి అందించిన ఛాయాగ్రహణం బాగుంది. గ్రామీణ వాతావరణంతో పాటు విశాఖ అందాలను తెరపై చక్కగా ఆవిష్కరించారు. లియోన్ జేమ్స్ అందించిన పాటలు, మణిశర్మ నేపథ్య సంగీతం సినిమాకు అవసరమైన కమర్షియల్ టచ్‌ను అందించాయి. కొన్ని చోట్ల నేపథ్య సంగీతం మరింత మితంగా ఉంటే బాగుండేది. ఎడిటింగ్‌లో ఇంకాస్త క్రిస్ప్నెస్ అవసరం. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా..
‘గోట్’ సుడిగాలి సుధీర్‌ను కొత్త తరహా మాస్ పాత్రలో చూపించే ప్రయత్నం. ఆయన కామెడీ టైమింగ్, యాక్షన్ సన్నివేశాలు, దివ్యభారతి నటన, మొట్టా రాజేంద్రన్ కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. బెట్టింగ్ మాఫియా నేపథ్యంలో రూపొందిన కథకు మరింత బలమైన స్క్రీన్‌ప్లే తోడై ఉంటే సినిమా ఇంకా మంచి ఫలితాన్ని అందుకునేది. అయినప్పటికీ సుధీర్ అభిమానులకు, కామెడీతో కూడిన మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఒకసారి చూడదగ్గ వినోదాత్మక చిత్రం.
చివరగా.. గోట్ – సుధీర్ కామెడీ, మాస్ యాక్షన్‌తో మెప్పించే ప్రయత్నం!
రేటింగ్: 3/5









