నటీనటులు: రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, ఇంద్రజ, సత్య, సురేష్ తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: ఎదు రాధాకృష్ణన్
నిర్మాత: రాకేష్ వర్రే
రచన–దర్శకత్వం: ప్రశంకర్
రేటింగ్: 3/5
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రే.. హీరోగా, నిర్మాతగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘మాయలేడి’. రొమాన్స్, కామెడీ, సైకలాజికల్ డ్రామా అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాలో మధుమిత సర్కార్ కథానాయికగా నటించారు. స్ప్లిట్ పర్సనాలిటీ అనే ఆసక్తికరమైన అంశాన్ని ప్రేమకథకు జోడించి దర్శకుడు ప్రశంకర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ
క్రిష్ (రాకేష్ వర్రే) మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఒక అమ్మాయి సమస్యలో సాయం చేసే క్రమంలో ఆశ (మధుమిత సర్కార్) పరిచయమవుతుంది. ఆమెతో పరిచయం కాస్త ప్రేమగా మారడంతో క్రిష్ ఆశకు దగ్గరవుతాడు. అయితే ఆశలాగే కనిపించే మరో అమ్మాయి రూపను చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె ఆశకు కవల సోదరి అయి ఉంటుందని భావిస్తాడు.
ఆశను ప్రేమిస్తున్న క్రిష్‌కు రూపతో ఎదురయ్యే పరిణామాలు ఇబ్బందికరంగా మారుతాయి. ఇద్దరినీ వేర్వేరు వ్యక్తులుగా భావించిన అతనికి అసలు విషయం తెలిసే సమయానికి అనూహ్యమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆశ, రూప ఇద్దరూ ఒకరేనా? ఆశలో రూప వ్యక్తిత్వం ఎలా ఏర్పడింది? క్రిష్ ఎవరిని ప్రేమిస్తున్నాడు? చివరకు వీరి ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగతా కథ.
కథనం – విశ్లేషణ
స్ప్లిట్ పర్సనాలిటీ అనే అంశాన్ని ప్రేమకథతో కలిపి చెప్పడం ‘మాయలేడి’లో ఆసక్తికరమైన పాయింట్. ఈ తరహా కథలు గతంలో వచ్చినప్పటికీ, వాటిని వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం దర్శకుడు ప్రశంకర్ చేశారు. ముఖ్యంగా ఆశ, రూప పాత్రల మధ్య ఉండే వ్యత్యాసాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే విధానం కథలో ఆసక్తిని పెంచుతుంది.
సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం, హీరోహీరోయిన్ల మధ్య స్నేహం, ప్రేమకు కొంత సమయం తీసుకున్నా.. కథలో కీలకమైన ట్విస్ట్ వచ్చే ఇంటర్వెల్ ముందు సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఆశ, రూప ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు కాదనే విషయం బయటపడే ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.
సెకండ్ హాఫ్‌లో ఆశలోని మరో వ్యక్తిత్వాన్ని క్రిష్ ఎలా అర్థం చేసుకుంటాడు? ఆమెకు అండగా ఎలా నిలుస్తాడు? అనే అంశాలతో కథ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ సన్నివేశాలు వినోదాన్ని అందిస్తాయి. ముఖ్యంగా సత్య తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయిస్తారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్‌లోని ఫైట్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.
క్లైమాక్స్‌లో భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కొన్ని సన్నివేశాల్లో కథనం మరింత బిగువుగా ఉండాల్సిన అవసరం కనిపించినా, కథలోని ప్రధాన కాన్సెప్ట్ ప్రేక్షకులను చివరి వరకు నడిపిస్తుంది. స్ప్లిట్ పర్సనాలిటీ నేపథ్యంలో సాగే ప్రేమకథను వినోదం, భావోద్వేగాలతో కలిపి చెప్పడం ఈ చిత్రంలోని ప్రత్యేకత.
నటీనటుల నటన
రాకేష్ వర్రే క్రిష్ పాత్రలో చక్కగా నటించారు. ప్రేమలో ఉన్న యువకుడిగా, అనూహ్యమైన పరిస్థితులను ఎదుర్కొనే వ్యక్తిగా తన పాత్రకు న్యాయం చేశారు. కథకు అనుగుణంగా తన నటనలో పరిణతిని చూపించారు.
మధుమిత సర్కార్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆశ, రూప అనే రెండు భిన్నమైన వ్యక్తిత్వాలను తన నటనతో అద్భుతంగా ప్రదర్శించారు. ఒకవైపు సున్నితమైన అమ్మాయిగా, మరోవైపు చురుకైన, భిన్నమైన స్వభావం కలిగిన యువతిగా చూపించిన వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆమె నటన సినిమాకు మంచి బలంగా నిలుస్తుంది.
సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో కొన్ని సన్నివేశాలను రక్తికట్టించారు. సీనియర్ నటుడు సురేష్ తన పాత్రలో కొత్తగా కనిపిస్తూ నవ్వించారు. ఇంద్రజ హీరోయిన్‌కు గార్డియన్ పాత్రలో చక్కగా ఒదిగిపోయారు. లావణ్య, మధురిమ తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు ప్రశంకర్ స్ప్లిట్ పర్సనాలిటీ అనే అంశాన్ని ప్రేమకథతో మేళవించి ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు. కథలోని ట్విస్టులను ఆసక్తికరంగా చూపించడంలో కొంతవరకు సఫలమయ్యారు.
ఎదు రాధాకృష్ణన్ సినిమాటోగ్రఫీ బాగుంది. పరిమిత లొకేషన్లలోనే కథను అందంగా తెరకెక్కించారు. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కథకు అనుగుణంగా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ మరింత క్రిస్ప్‌గా ఉంటే సినిమా వేగం ఇంకాస్త పెరిగేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాతగా రాకేష్ వర్రే సినిమాకు అవసరమైన స్థాయిలో ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
ఫైనల్‌గా..
‘మాయలేడి’ స్ప్లిట్ పర్సనాలిటీ అనే ఆసక్తికరమైన అంశాన్ని ప్రేమకథ, కామెడీ, భావోద్వేగాలతో మేళవించిన చిత్రం. మధుమిత సర్కార్ ద్విపాత్రాభినయ తరహా వ్యక్తిత్వాల ప్రదర్శన, రాకేష్ వర్రే నటన, సత్య కామెడీ, ఇంటర్వెల్ ట్విస్ట్ సినిమాకు ప్రధాన బలాలు. కథలో కొంత పరిచయమైన అంశాలు ఉన్నప్పటికీ, వినోదాత్మకంగా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. రొమాంటిక్ కామెడీతో పాటు భిన్నమైన కాన్సెప్ట్ ఉన్న సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘మాయలేడి’ బాగా నచ్చుతుంది.
చివరగా.. మాయలేడి – ప్రేమకు మరో వ్యక్తిత్వం తోడైతే.. వినోదమే వినోదం!
రేటింగ్: 3/5










