వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూషన్ లో సినిమా రిలీజ్ అనగానే… ఆ సినిమా ఎంతో కొంత బాగుంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అందుకే ఆయనకు సినిమా ఇండస్ట్రీలో చాలా త్వరగా గుర్తింపు వచ్చింది. సినిమాకి నిర్మాత, దర్శకుడు, హీరో ఎవరైనా కానివ్వండి… విడుదలకు ముందు ఆ సినిమా పబ్లిసిటీని తన భుజస్కంధాలపై వేసుకుని ప్రేక్షకులను థియేటర్ కు వచ్చేలా చేస్తాడు. ఆ మధ్య రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళ నుంచి… మొన్న విడుదలైన ఈషా మూవీ వరకు బన్నీ వాస్ తో కలిసి డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా సుహాస్, శివాని నగరం జంటగా తెరకెక్కిన ‘హే బల్‌వంత్’ సినిమాను తమ డిస్ట్రిబ్యూషన్ సంస్థలైన వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని త్రిశుల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సీనియర్ నరేష్, యాంకర్ స్రవంతి, సుదర్శన్, వెన్నెల కిషోర్, బాబూ మోహన్, అజయ్ ఘోష్, హర్ష వర్ధన్, అన్నపూర్ణ తదితరులు నటించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: గుంటూరు నగరంలో రామ్ బల్‌వంత్(నరేష్) ఒక వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అయితే ఆయన తన వ్యాపారం గురించి కుటుంబ సభ్యులకు తెలియకుండా చాలా జాగ్రత్త పడుతుంటాడు. అయితే బల్ వంత్ కుమారుడు కృష్ణ (సుహాస్).. తన తండ్రి పెద్ద బిజినెస్ మెన్ అని, తను కూడా పెద్దయ్యాక తండ్రి బిజినెస్ టేకోవర్ చేస్తానని చిన్నప్పటినుంచే కలలు కంటూ ఉంటాడు. కృష్ణ చదువు పూర్తి అయ్యాక బిజినెస్ టేకోవర్ చేద్దామని వస్తే బల్‌వంత్ అందుకు ససేమిరా అంటాడు. తన తండ్రికి తన ట్యాలెంట్ చూపించాలని ఓ NGO నడుపుతున్న మిత్ర(శివాని నగరం) దగ్గర బిజినెస్ కన్సల్టెంట్ గా చేరి ఆమెతో ప్రేమలో పడతాడు. బల్‌వంత్ కి సడెన్ గా గుండెపోటు వచ్చి హాస్పిటల్ పాలవడంతో బిజినెస్ టేకోవర్ చేద్దామని వెళ్లిన కృష్ణ… తన తండ్రి బిజినెస్ చూసి షాక్ అవుతాడు. దాంతో తండ్రి మీద ఉన్న గౌరవం కాస్త… అసహ్యించుకునే దాకా వస్తుంది. ఇంతకు బల్ వంత్ చేసే వ్యాపారం ఏమిటి? ఎందుకు ఆ వ్యాపారం చేయాల్సి వచ్చింది? ఈ క్రమంలో కృష్ణకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? తన ప్రేయసితో కలిసి ఎలా ముందుకు సాగాడు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ:
ముందునుంచి ఈ సినిమాలో నరేష్ చేసే బిజినెస్ ఏంటో కనిపెట్టండి అంటూ ప్రమోషన్స్ బాగా చేయడం, చివర్లో సెన్సార్ వాళ్ళు హే భగవాన్ టైటిల్ మార్చమనడంతో అది హే బల్‌వంత్ గా మారి సినిమాపై మంచి హైప్ వచ్చింది. సినిమా మొదలుపెట్టడమే బల్‌వంత్ బిజినెస్ ఏంటో చెప్పేయడంతో మొదట్లోనే ప్రేక్షకులు షాక్ అవుతారు.
ఇక ఆ బిజినెస్ ఏంటో తెలియకుండా కృష్ణ మాట్లాడే మాటలు, చేసే చేష్టలతో మనకు నవ్వొస్తుంది. పక్కనే ఉండి పంచులతో ఫుల్ గా నవ్విస్తాడు బంక(సుదర్శన్). అలా ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ గా నవ్విస్తూ, ప్రేమకథతో పాటు చిన్న పొలిటికల్ టచ్ ఇచ్చి నడిపించారు. ఇంటర్వెల్లో ఓ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చి అందరిని ఫుల్ గా నవ్విస్తారు. ఇక సెకండ్ హాఫ్ అంతా కృష్ణ, బల్‌వంత్, మిత్ర, బంక, చంప(యాంకర్ స్రవంతి), యువన్ (వెన్నెల కిశోర్)ఇంకొంతమంది అంతా కలిసి ఓ పొలిటీషియ(అజయ్ ఘోష్) ఇంటికి వెళ్లి చేసే హంగామా, అక్కడ జరిగే సీన్స్ తో ఫుల్ గా నవ్వుకుంటాం. చివర్లో మళ్ళీ అసలు బల్‌వంత్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటూ ట్విస్టులు రివీల్ చేస్తూనే తండ్రి ఎమోషన్ ని చూపించారు. సినిమా అంతా ఫుల్ గా నవ్వించి చివర్లో కాస్త ఎమోషన్ తో ముగించారు.
సీనియర్ నరేష్… సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు. సమ్మోహనం నుంచి నరేష్ చేస్తున్న పాత్రలన్నీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకులు కూడా తనకోసమే స్ర్కిప్ట్ ప్రత్యేకంగా రాస్తున్నారనడంలో సందేహం లేదు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ కొన్ని సినిమాల్లో నవ్వించడం .. కొన్ని సినిమాల్లో ఎమోషన్స్ తో ఆకట్టుకోవడం చేస్తున్నాడు. ఇందులో కూడా మొదట నవ్వించి చివర్లో ఎమోషనల్ చేస్తారు. ఓ సీన్ లో అందరి హీరోలని స్పూఫ్ చేసి అదరగొట్టారు నరేష్. ఇక హీరో సుహాస్ నటుడిగా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. హే బల్‌వంత్ లో టెన్షన్ పడే కుర్రాడిగా కామెడీతో బాగానే మెప్పించాడు. శివాని నగరం క్యూట్ గా కనిపిస్తూనే అక్కడక్కడా నవ్వించింది. సుదర్శన్ సినిమా అంతా ఫుల్ గా నవ్విస్తాడు. యాంకర్ స్రవంతి నటిగా బాగానే నటించింది. వెన్నెల కిషోర్ అక్కడక్కడా నవ్విస్తాడు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, అన్నపూర్ణమ్మ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. బాబు మోహన్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి నవ్వించాడు.
కొత్త దర్శకుడే అయినా మెయిన్ ప్లాట్ ను చాలా డేరింగ్ గా అటెంప్ట్ చేశాడు. అందుకు తగ్గట్టుగా సంభాషణలు… ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో సినిమాను ఆద్యంతం ఎంగేజ్ చేశాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఈ వారం సరదాగా చూసేయండి.
రేటింగ్: 3/5









