రావు రమేష్… ఇప్పటి వరకు ఫుల్ లెంగ్త్ సోలో సినిమా చేయలేదు. తొలిసారిగా సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని ఈ సినిమాని చేశారు. అతనికి తగ్గట్టుగానే చాలా సరదాగా సినిమా టైటిల్ ను పెట్టారు. అది అందరిలోనూ ఆసక్తి కలిగించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కి అల్లు అర్జున్ కూడా రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇందులో రావు రమేష్ కి జోడీగా ఇంద్రజ నటించారు. ఇటీవల విడుదలై సక్సెస్ అయిన ‘ఆయ్’చిత్రంలో నటించిన అంకిత్ ఇందులో రావు రమేష్ కుమారుడిగా నటించారు. అతనికి జంటగా రమ్య పసుపులేటి నటించింది. ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలావుందో తెలుసుకుందాం పదండి.
కథ: 1998 డీఎస్సీ అంటే ఎంత పాపులర్రో అందరికీ తెలిసిందే. అందులో ఉత్తీర్ణులైన వారి జీవితాలు కొన్ని దశాబ్దాలుగా ఎలా మూలన పడ్డాయో కూడా మన నిత్యం వార్తల్లో చదువుతూనే ఉంటాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా… 98 డీఎస్సీ బాధితుల మొదర అరణ్య రోధనగానే మిగిలింది. అలాంటి పాపులర్ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని… ఈ సినిమా కథ… కథనాలను రాసుకున్నారు దర్శకుడు. అదేంటో చూద్దాం కథలో… 98 డీఎస్సీలో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన సుబ్రమణ్యం… కోర్టు స్టే కారణంగా పోస్టింగ్ రావడం ఆగిపోతుంది. దాంతో తన భార్య (ఇంద్రజ) సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటాడు. తనకు జీవితంలో ఎన్ని ఇబ్బందులు… అవమానాలు ఎదురైనా వాటిని లెక్కచేయకుండా… ఇతర ఉద్యోగాలు చేయకుండా కాలం గడిపేస్తుంటారు. అలాంటి వ్యక్తికి అనుకోకుండా తన ఖాతాలో రూ.10 లక్షల రూపాయలు వచ్చి పడుతుంది. దాంతో ఉబ్బి తబ్బవుతాడు. అంత పెద్ద మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది. దానిని సుబ్రమణ్యం ఏం చేశారు? అతని కుమారుడు అర్జున్ ఎందుకు తన తండ్రి సుబ్రమణ్యం పేరు చెప్పకుండా తండ్రి అల్లు అరవింద్ అని, తన అన్న అల్లు అర్జున్ అని చెప్పుకుంటూ తిరుగుతుంటారు? తన ప్రేయసి కాంచన(రమ్య పసుపులేటి)తో సెటిల్ అయ్యారా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: 98 డీఎస్సీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. కోర్టు స్టే కారణంగా టీచర్ పోస్టులు ఆగిపోవడం అప్పట్లో నైన్ టీస్ లో ఎంతో మంది జీవితాలను ఈ డీఎస్సీ ప్రభావితం చేసింది. దీని చుట్టూ రాసుకున్న కథ… కథనాలు ఆద్యంతం ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తాయి. రకరకాల పాత్రలు, ట్విస్టులతో కథను ఫీల్ గుడ్‌తో ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు లక్ష్మణ్ కార్య సక్సెస్ అయ్యాడు. ఇక ఫస్టాఫ్‌లో కథా స్వభావం, పాత్రల పరిచయం కారణంగా కొంత ల్యాగ్ అనిపించినా.. సెకండాఫ్‌లో కథలో అనేక మలుపులతో చకచకా పరుగులు పెట్టించడం సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు రావు రమేష్‌ను చూసిన కోణం వేరు.. మారుతి నగర్ సుబ్రమణ్యంగా ఒక సినిమాను పూర్తిగా భుజాల మీద మోయడమే కాకుండా నటుడిగా తన స్టామినాను ప్రూవ్ చేసుకొన్నాడు. సినిమాకు కర్త, కర్మ, క్రియ కావడం, పుల్ లెంగ్త్ క్యారెక్టర్ లభించడంతో చెలరేగిపోయాడు. సెటైరికల్ కామెడీ, ఎమోషనల్ సీన్లలో అద్బుతంగా నటించారని చెప్పడం రొటీన్ అవుతుంది. కథానాయకుడిగా సినిమాను ముందుకు తీసుకెళ్లే సత్తా తనకు ఉందనే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పకనే చెప్పారు. మిగితా నటీనటుల్లో అంకిత్ కోయా ఫెర్ఫార్మర్‌గా ఆకట్టుకొన్నాడు. రావు రమేష్‌తో పోటీ పడి నటించాడు. అలాగే తండ్రి కొడుకులుగా వారిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది. రమ్య పసుపులేటితో కలిసి రొమాంటిక్ సీన్లలో మెప్పించాడు. కాంచనగా రమ్య ఆ పాత్రలో ఒదిగిపోయారు. గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించారు. ఇక ఇంద్రజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమోషనల్ క్యారెక్టర్‌తోనే కాకుండా డ్యాన్స్ స్టెప్పులతో అలరించారు. ఆమెలో ఇంకా హీరోయిన్ ఫ్లేవర్ కొట్టొచ్చినట్టు కనిపించింది. అన్నపూర్ణమ్మ, అజయ్, ప్రవీణ్, మిగితా పాత్రల్లో నటించిన వారాంత తమ పాత్రలకు న్యాయం చేశారు.
లక్ష్యణ్ కార్య రాసిన డైలాగ్స్ అద్బుతంగా పేలడమే కాకుండా ఫన్ క్రియేట్ చేశాయి. ఇక పాటల సాహిత్యం కూడా భాగుంది. అలాగే సినిమాను చాలా హోమ్లీగా కనిపించేలా ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి, సురేష్ భీమంగని ఆర్ట్ విభాగాలు పనిచేశాయి. చాలా సీన్లు చాలా రిచ్‌గా అనిపించాయి. ఇక బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ సినిమాను పరుగులు పెట్టించింది. సెకండాఫ్‌లో సీన్ల కూర్పు బాగుంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య, సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక తబితా సుకుమార్ సమర్పకురాలిగా సినిమా రేంజ్‌ను పెంచారని చెప్పాలి. ఫైనల్‌గా మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా విషయానికి వస్తే… ప్రధానంగా నటీనటుల ఫెర్ఫార్మెన్స్… కామెడీ ఎలిమెంట్స్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. వారం కుటుంబ సభ్యులతో చాలా హాయిగా నవ్వుకుని ఎంజాయ్ చేసే సినిమా మారుతినగర్ సుబ్రమణ్యం. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3.25