మత్స్యకారుల జీవితాలు మీద… వారి గ్రామాల జీవన విధానంలో మార్పులు ఎలా వచ్చాయి అనే దాన్ని బేస్ చేసుకుని తీసిన చిత్రం “రేవు”. హరినాథ్ పులి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంలో వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి, సుమేశ్ మాధవన్, హేమంత్ ఉద్భవ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమా జర్నలిస్ట్ లు ప్రభు, పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం పదండి.
కథ: సముద్రతీర ప్రాంతంలో వుండే పాలరేవు అనే చిన్న గ్రామంలో అంకాలు(వంశీరామ్ పెండ్యాల), గంగయ్య(అజయ్) ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరూ ఇరుగు పొరుగున వుంటూ పెరిగి పెద్దవారవుతారు. అయితే చేపల వేటలో పోటీ పడి పనిచేస్తూ… రైవల్స్ గా వుంటారు. సంప్రదాయ బోట్లతోనే ఇలా ఇద్దరూ పోటీ పడి చేపలు పట్టే క్రమంలో… ఆ గ్రామానికి చెందిన నగేష్(ఏపూరి హరి) ఓ రూ.35లక్షల ఖరీదు పెట్టి ఓ మరబోటును కొనుగోలు చేసి పెద్ద ఎత్తున్న చేపల వేటను ప్రారంభిస్తాడు. దాంతో చేపల వేటను నమ్ముకున్న సంప్రదాయ మత్స్యకారులకు ఉపాధిలేకుండా పోతుంది. పైగా పెద్ద పడవ కాడంతో నాణ్యమైన చేపలను పట్టడం వల్ల కంపెనీలు కూడా నగేష్ నుంచే చేపలను కొనుగులో చేయడానికి మొగ్గుచూపుతారు. ఈక్రమంలో నగేష్ కు ధీటుగా తాము కూడా ఏదైనా మరబోటును కొనుగోలు చేయాలని అంకాలు ఉన్న పొలాన్ని అమ్మేయాలని చూస్తాడు. అయితే అందుకు గంగయ్య నిరాకరిస్తారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ చదువుకున్న కుర్రాడితో మోటారును మ్యాన్యువల్ బోటుకు బిగించి చేపల వేటను కొనసాగించాలని అంకాలు, గంగయ్య ప్రయత్నిస్తుంటారు. ఇది తెలిసిన నగేష్… ఆ చదువుకున్న కుర్రాడిని చంపేస్తాడు. దాంతో అంకాలు, గంగయ్య… నగేష్ ను దారుణంగా చంపేస్తారు. ఇది తెలిసి… అప్పటి వరకు కనిపించకుండా తిరుగుతున్న నగేష్ కుమారులిద్దరూ(సుమేశ్ మాధవన్, హేమంత్ ఉద్భవ్) పాలరేవులో అడుగుపెడతారు. పచ్చి క్రూరంగా పెరిగిన వీళ్లిద్దరూ… తమ తండ్రిని చంపిన అంకాలు, గంగయ్యపై ఎలా పగతీర్చుకుంటారు? క్రూర మనస్తతత్వంతో పెరిగిన నగేష్ కుమారులను ఎలా ఎదుర్కొన్నారు? వీరిద్దరూ ఎందుకు ఊరొదిలి దూరంగా ఉన్నారు? అక్కడ ఏంచేసేవారు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఇటీవల చిన్న బడ్జెట్టు చిత్రాలు… వెండితెరపై దూసుకుపోతున్నాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గత వారం నాలుగు సినిమాలు విడుదలైతే… అందులో మూడు పెద్ద సినిమాలు బోల్తాపడగా… స్మాల్ బడ్జెట్టు మూవీ అయిన ‘ఆయ్’ మాత్రం బాక్సాఫీసును బద్దలు కొట్టింది. అంతకు ముందు వారం కూడా నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్లు’ కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఈ వారం తాజాగా చిన్న బడ్జెట్టుతో తెరకెక్కిన ‘రేవు’ మూవీ విడుదలైంది. ఇందులో నటించిన వారు, ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులంతా కొత్తవారే. ఇప్పటికే మనం తీర ప్రాంతంలో నివసించే మత్స్యకారుల జీవితాల మీద వచ్చిన అనేక చిత్రాలను చూసుంటాం. ఈ సినిమా మాత్రం చాలా యూనిక్ కాన్సెప్ట్. 90స్ లో జరిగే ఈ కథ… చాలా రా అండ్ రస్టిక్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ లో అసలు కథ మొదలు కావడానికి చాలా టైం పడుతుంది. ఇంటర్వెల్ కి ముందు నుంచి సినిమా ఆసక్తికరంగా… చాలా ఇంటెన్స్ గా సాగుతుంది. నగేష్ కుమారిలిద్దరూ ఎంటర్ కావడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. మత్స్యకార గ్రామాల్లో వుండే నెటివిటీతో ఈ సినిమాను క్లైమాక్స్ వరకూ దర్శకుడు ఎక్కడా డీవియేట్ కాకుండా సినిమాను ముందుకు నడిపించి సక్సెస్ అయ్యారనడంలో సందేహం లేదు.
నటీనటుల విషయానికొస్తే… నటుడు వంశీరామ్ పెండ్యాల.. అంకాలు పాత్రలో అచ్చం మత్స్యకారునిగా కనిపించి మెప్పించారు. అతనికి జోడీగా నటించిన స్వాతి భీంరెడ్డి కూడా చాలా నాచురల్ గా నటించింది. ఇద్దరి జోడీ బాగా కుదిరింది. పక్కింటి అమ్మాయిలాగా కనిపించింది. గంగయ్య పాత్రలో నటించిన అజయ్ కూడా విలేజ్ నేపథ్యంలో మనుషులు ఎలా వుంటారనే పాత్రలో చక్కగా ఒదిగిపోయి నటించారు. ఇద్దరి పాత్రలు చివరి దాకా సమానంగా సాగిపోతాయి. విలన్ పాత్రలు పోషించిన సుమేశ్ మాధవన్, హేమంత్ ఉద్భవ్ లిద్దరూ అదరగొట్టేశారని చెప్పొచ్చు. విభిన్న లక్షణాలున్న వ్యక్తులుగా మెప్పించారు. మలయాళ నటుడు సుమేష్ మాధవన్ అయితే… సైకోపాత్రలో ఒదిగిపోయాడు. వీరిద్దరూ సెకెండాఫ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ప్రేక్షకులను కదలనీయకుండా చేస్తాయి వారి పాత్రలు. వీరి తండ్రి పాత్ర పోషించిన యేపూరి హరి కూడా కాసేపు వున్న బాగానే చేశాడు. మిగతా పాత్రలు పోషించిన వారంతా కూడా తమ తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
దర్శకుడు హరినాథ్ పులి రాసుకున్న ఈ రా అండ్ రస్టిక్ కథ… కథనం చాలా ఎంగేజింగ్ గా వుంది. స్మాల్ బడ్జెట్టు మూవీగా తెరకెక్కించిన దర్శకుడు… ఎంచుకున్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో బెస్ట్ అవుట్ పుట్ రాబట్టాడనే చెప్పొచ్చు. చివరి వరకు సినిమాను తీసుకెళ్లి…ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా చేయడంలో దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. సినిమాకి చాలా వరకు సంగీతం ప్రధాన బలం అయింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మత్స్యకారుల జీవితాలు ఎలావుంటాయనేదాన్ని తన విజువల్స్ లో చూపించారు. భావోద్వేగాల్ని కూడా చక్కగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త గ్రిప్పింగా వుండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గో అండ్ వాచ్ ఇట్.
రేటింగ్: 3