జగదీశ్ ఆమంచి, శ్రావణి శెట్టి, అద్విక శర్మ, ఆకాశ్ చల్లా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “యముడు”. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై చిత్ర హీరోనే దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ కుంద్రపు స్క్రీన్ ప్లే అందించగా… భవాని రాకేష్ సంగీతం సమకూర్చారు. క్రైం ప్రధాన అంశంగా బేస్ చేసుకుని ఓ మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: విశ్వ(జగదీశ్ ఆమంచి)ఒక అనాథ. ఓ వృద్ధాశ్రమం నడుపుతూ స్నేహితులతో సరదాగా గడిపేస్తుంటారు. ఒకరోజు గుడిలో అను(శ్రావణి శెట్టి)ని చూసి… ఆమెను తన పార్టనర్ గా చేసుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటాడు. జగడ్ అనే ఓ యువ సంగీత దర్శకుడు తన మిత్రుడు ఆకాష్ తో కలిసి సరదాగా పాటలు పాడుతూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. జగడ్ కి హరిణి (అద్విక శర్మ) అనే ఫ్రెండ్ ఉంటుంది. ఈమెను జగడ్ ప్రేమిస్తూ ఉంటాడు. అయితే హరిణి మాత్రం ఆ విషయంలో పెద్దగా సీరియస్ గా ఉండదు. దాంతో ఆకాష్ తో ఆమె కమిట్ అవుతుంది. అయితే అప్పుడే సంగీతంలో జగడ్ గ్రామీ అవార్డు అందుకుంటున్నాడని తెలిసి… తనని పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంది హరిణి. అయితే తన పెళ్లికి అడ్డు తగిలే ఆకాష్ ను అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేస్తుంది. అయితే అదే సమయంలో ఆ ఊరిలో వరుసగా మహిళలు హత్య గావించ బడుతూ ఉంటారు. ఈ హత్యల వెనుక ఉన్న వాళ్ళని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారుతుంది. అయితే ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు? సీరియల్ కిల్లర్ కేవలం మహిళలనే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? ఇంతకు విశ్వ ఎవరు? అను ఎవరు? జగడ్ , హరిణి వివాహం చేసుకున్నారా? ఆకాష్ ను అడ్డు తొలగించుకోవాలనుకున్న హరిణి ప్లాన్ వర్కవుట్ అయిందా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: క్రైమ్ బేస్డ్ మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అందులోనూ ఇలాంటి వాటిని మైథాలజికల్ థ్రిల్లర్ గా వెండితెరపై ఆవిష్కరిస్తే మరింతగా ఆకట్టుకునే అవకాశం ఉంది. కొత్త హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఇలాంటి వాటికి ప్రాధాన్యం ఇస్తూ బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూ ఉంటారు. తాజాగా జగదీశ్ ఆమంచి అనే ఓ డెబ్యూ హీరో తనే దర్శకత్వం వహించి యముడు పేరుతో సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇందులో వరుస హత్యలు అనే కాన్సెప్ట్ రొటీన్ గా ఉన్నా… వాటికి మైథాలజికల్ టచ్ ఇస్తూ… సినిమాను గరుడ పురాణంతో అనుసంధానం చేసి తెరకెక్కించిన విధానం బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఓ వైపు క్రైమ్ చూపెడుతూనే… మరో వైపు లవ్ స్టోరీ… మరో వైపు జగడ్, హరిణిల జంటను నేటి యూత్ ను ఆకట్టుకునే సీన్లతో స్క్రీన్ ప్లే నడిపిన విధానం ఆకట్టుకుంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో ఒక్కొక్కటిగా క్రైమ్ సీన్ వెనుక ఉన్న సీక్రెట్స్ ను రివీల్ చేస్తూ క్లైమాక్స్ లో ఇచ్చిన ముగింపు మహిళలకు ఓ మెసేజ్ ఇస్తుంది.
హీరోగా… దర్శకుడిగా… నిర్మాతగా జగదీశ్ ఆమంచి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ పక్కన పెడితే… మిగతా అంశాల్లో తన ప్రతిభను ఆన్ స్క్రీన్ పై చూపించాడు. అతనికి జంటగా నటించిన ఇద్దరు అమ్మాయిలు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అద్విక శర్మ హాట్ గా కనిపించి యూత్ ను ఆకట్టుకుంది. ఆకాష్ కూడా తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు. మిగతా పాత్రలన్నీ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. యముణ్ణి బేస్ చేసుకుని రాసుకున్న సంభాషణలు ఆకట్టుకుంటాయి. ఓ మంచి క్రైం బేస్డ్ మైథాలజికల్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునే వారు ఈ వారం చూసేయండి.
రేటింగ్: 3









