భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ మూవీ ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల నాయుడు, టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు త్రినాథరావు నక్కిన ఇందులో ఒక కీలక పాత్ర పోషించడం విశేషం. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
నాగవంశీ ప్రశంసలు
తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎలగే పిల్ల’ అనే బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ లవ్ సాంగ్‌ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పాట ట్యూన్ చాలా క్యాచీగా ఉందని, లిరికల్ వీడియోలోని విజువల్స్, విక్రమ్ సహిదేవ్ వేసిన గ్రేస్‌ఫుల్ స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాలని నాగవంశీ ఆకాంక్షించారు.
చార్ట్‌బస్టర్‌గా ‘ఎలగే పిల్ల’
అనంత శ్రీరామ్ అందించిన క్యూట్ లిరిక్స్‌కు కపిల్ కపిలాన్, దేవ్ జండ్ తమ గాత్రంతో ప్రాణం పోశారు. హీరో విక్రమ్ సహిదేవ్ వేసిన సింపుల్ అండ్ స్టైలిష్ హుక్ స్టెప్పులు సోషల్ మీడియా రీల్స్‌లో వైరల్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ‘అనకాపల్లి’ ఆల్బమ్ నుంచి వచ్చిన ‘అమ్మోరు దిగినాది’, ‘లబ్బరు బొమ్మ’ పాటలు యూట్యూబ్‌ను షేక్ చేయగా.. ఇప్పుడు ఈ ఫీల్ గుడ్ సాంగ్ కూడా ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్ లిస్ట్‌లో చేరిపోయింది.









